CM Revanth Reddy: నా గెలుపే నా ప్రత్యర్థులకు దు:ఖం
ABN , Publish Date - Aug 16 , 2025 | 09:28 PM
తెలంగాణ సమాజం కవులకు స్ఫూర్తినిచ్చిన గడ్డని సీఎం రేవంత్ రెడ్డి అభివర్ణించారు. నిజమైన ఉద్యమకారులు ఎవరూ తాను ఉద్యమకారుడిని అని చెప్పుకోరన్నారు. అందే శ్రీ ఎప్పుడు నేను ఉద్యమకారుడినని చెప్పుకో లేదని ఆయన సోదాహరణగా వివరించారు.
హైదరాబాద్, ఆగస్టు 16: 2047 నాటికి తెలంగాణను 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చడమే తన లక్ష్యమని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. తద్వారా ప్రపంచంలోనే గొప్ప రాష్ట్రంగా తెలంగాణను మారుస్తానని ఆయన ప్రకటించారు. తెలంగాణ అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేస్తానని స్పష్టం చేశారు. శనివారం హైదరాబాద్ కళ్యాణ్ నగర్‌లోని తెలంగాణ జెన్ కో ఆడిటోరియంలో ప్రముఖ కవి అందేశ్రీ ప్రచురించిన హసిత భాష్పాలు పుస్తకాన్ని సీఎం రేవంత్ రెడ్డి ఆవిష్కరించారు.
అనంతరం సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణ సమాజం కవులకు స్ఫూర్తిని ఇచ్చిన గడ్డ అని అభివర్ణించారు. నిజమైన ఉద్యమకారులు ఎవరూ నేను ఉద్యమకారుడిని అని చెప్పుకోరన్నారు. అందే శ్రీ ఎప్పుడూ తాను ఉద్యమకారుడినని చెప్పుకోలేదని సోదాహరణగా వివరించారు. ఉద్యమకారుడిని అని చెప్పుకున్న వాళ్లకు టీవీలు, పేపర్లు, రూ.వేల కోట్ల ఆస్తులు ఎలా వచ్చాయంటూ ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీ అగ్రనాయకత్వాన్ని సీఎం రేవంత్ రెడ్డి ఈ సందర్భంగా సూటిగా ప్రశ్నించారు.
గూడ అంజయ్య, అందే శ్రీ, గద్దర్, గోరేటి వెంకన్న వంటి కవులు.. తెలంగాణ ప్రజల్లో స్పూర్తి నింపారని గుర్తు చేశారు. అందే శ్రీ, గద్దర్‌లు తెలంగాణ ప్రజల స్వేచ్ఛను ఆకాంక్షించారని చెప్పారు. తాను ఎవరిని శత్రువుగా చూడనని.. శత్రువుగా చూడాలంటే వారికి ఆ స్థాయి ఉండాలన్నారు రేవంత్. 2006 నుంచి ప్రారంభమైన తన రాజకీయ జీవితంలో 17 ఏళ్లలో ముఖ్యమంత్రి అయ్యానని తెలిపారు.
తెలంగాణ ప్రజలు తనకు ఇచ్చిన ఈ అవకాశాన్ని వారి అభ్యున్నతి కోసం ఉపయోగిస్తానని స్పష్టం చేశారు. తనకు నచ్చని వారిపై అధికారాన్ని ఉపయోగించే మూర్ఖుణ్ణి కాదన్నారు. తెలంగాణ ప్రజలు తనపై పెద్ద బాధ్యత పెట్టారని పేర్కొన్నారు. తన గెలుపే ప్రత్యర్థులకు దుఃఖమని తెలిపారు. తాను సీఎంగా సంతకం పెట్టడం వాళ్ల గుండెలపై గీత పెట్టినట్లేనని ఆయన చెప్పుకొచ్చారు.
'109 దేశాల నుంచి వచ్చిన సుందరీమణులతో జయ జయ హే తెలంగాణ పాట పాడించాను.. ఇంత కంటే ఇంకా ఏం కావాలి?' అని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. తెలంగాణ తల్లి ముందు వారిని మోకారిల్లేలా చేశానని చెప్పారు. భవనాలు ఎవరైనా కడతారు.. అద్దాల మేడలు, రంగుల గోడలు.. ఇది అభివృద్ధి కాదని సీఎం రేవంత్ తనదైన శైలిలో వ్యాఖ్యానించారు.
పేదలు ఆత్మగౌరవంతో తలెత్తుకోవడమే అభివృద్ధని ఆయన అభివర్ణించారు. 4 లక్షల ఇందిరమ్మ ఇళ్లతో పేదలు ఆత్మగౌరవంతో బతకుతున్నారని ఆయన చెప్పారు. రేషన్ కార్డులు, సన్నబియ్యంతో పేదల ఆత్మగౌరవం పెంచామన్నారు. వ్యక్తిగత ప్రయోజనాల కోసం తన పదవిని వాడనని.. పేదల కోసమే పని చేస్తానని ఈ సందర్బంగా సీఎం రేవంత్ రెడ్డి కుండబద్దలు కొట్టారు.
ఈ వార్తలు కూడా చదవండి..
తృటిలో తప్పిన ప్రమాదం.. విమాన ప్రయాణికులు సురక్షితం
రాహుల్ గాంధీ ఆరోపణలు.. ఎన్నికల సంఘం కీలక నిర్ణయం
మరిన్ని తెలంగాణ వార్తలు, తెలుగు వార్తలు చదవండి..