Heavy Rains: భారీ వర్షాలపై సీఎం సమీక్ష.. కీలక ఆదేశాలు..
ABN , Publish Date - Sep 26 , 2025 | 12:08 PM
భారీ వర్షాలు నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలంటూ ఉన్నతాధికారులను సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. లోతట్టు ప్రాంతాలను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తు ఉండాలని వారికి స్పష్టం చేశారు.
హైదరాబాద్, సెప్టెంబర్ 26: ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని ఉన్నతాధికారులను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. హైదరాబాద్ మహానగరంతోపాటు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లోని లోతట్టు ప్రాంతాలను ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని ఆయన సూచించారు. రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలో శుక్రవారం హైదరాబాద్‌లోని సచివాలయంలో.. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావుతోపాటు వివిధ శాఖల ఉన్నతాధికారులతో సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు.
ఆ క్రమంలో ఆయన కీలక ఆదేశాలు జారీ చేశారు. నగరంలో ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని సీఎం స్పష్టం చేశారు. అన్ని విభాగాల అధికారులు అప్రమత్తంగా ఉండాలని.. అలాగే నీరు నిలిచే ప్రాంతాలను గుర్తించి ముందస్తు చర్యలు చేపట్టాలని ఈ సందర్భంగా సీఎం ఆదేశించారు. హైదరాబాద్‌లో జీహెచ్ఎంసీ, హైడ్రాతో పాటు ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు అప్రమత్తంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని.. ఆ దిశగా సంబంధిత అధికారులను అప్రమత్తం చేయాలంటూ సీఎస్‌ను సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు.
మరోవైపు హైదరాబాద్‌లోని వివిధ ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తుంది. ఈ నేపథ్యంలో ట్రాఫిక్ సమస్యలు ఉత్పన్నం కాకుండా పోలీస్ శాఖ చర్యలు చేపట్టింది. అందులోభాగం ఉద్యోగులకు ఈ రోజు.. అంటే శుక్రవారం సాఫ్ట్ వేరు నిపుణులకు వర్క్ ఫ్రమ్ హోమ్ ఇవ్వాలంటూ ఐటీ కంపెనీలను ఇప్పటికే సూచించింది. అలాగే వివిధ ప్రాంతాల్లోని రహదారులపైకి భారీగా వరద నీరు వచ్చి చేరింది. దీంతో హైడ్రా, ఎస్డీఆర్ఎఫ్, జీహెచ్ఎంసీ బృందాలు రంగలోకి దిగి సహాయక చర్యలు కొనసాగిస్తున్నాయి.
ఇవి కూడా చదవండి
ఐటీ ఉద్యోగులు ఎగిరి గంతేసే లాంటి వార్త..
అతిభారీ వర్షాలు.. తీర ప్రాంతాలకు అలెర్ట్
మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి