Share News

Rains: భారీ వర్షాలు.. సమీక్ష నిర్వహించిన సీఎం రేవంత్ రెడ్డి

ABN , Publish Date - Jun 03 , 2025 | 09:18 PM

అనుకున్న సమయానికంటే మందే నైరుతి రుతు పవనాలు తెలంగాణ రాష్ట్రంలోకి ప్రవేశించాయి. ఈ నేపథ్యంలో భారీ వర్షాలు కురవనున్నాయంటూ ఇప్పటికే వాతావరణ కేంద్రం స్పష్టం చేసింది.

Rains: భారీ వర్షాలు.. సమీక్ష నిర్వహించిన సీఎం రేవంత్ రెడ్డి
TG CM Revanth Reddy

హైదరాబాద్, జూన 03: అనుకున్న సమయానికంటే మందే నైరుతి రుతు పవనాలు తెలంగాణ రాష్ట్రంలోకి ప్రవేశించాయి. ఈ నేపథ్యంలో భారీ వర్షాలు కురవనున్నాయంటూ ఇప్పటికే వాతావరణ కేంద్రం స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో వర్షాకాల సన్నద్ధతపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.. మంగళవారం హైదరాబాద్‌లో ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. మాన్‌సూన్ ఎమర్జెన్సీ టీమ్స్ 24 గంటలు అందుబాటులో ఉండేలా చూడాలని అధికారులకు సూచించారు. ఇప్పటికే గుర్తించిన 141 వాటర్ లాగింగ్ పాయింట్స్‌లో వాటర్ హార్వెస్టింగ్ వెల్స్ పనుల్లో పురోగతిపై ఉన్నతాధికారులను సీఎం రేవంత్ రెడ్డి ఆరా తీశారు. హార్వెస్టింగ్ వెల్స్‌లోకి చేరే వర్షపు నీటిని ఆటోమేటిక్ పంపుల ద్వారా బయటకు పంపించేలా చర్యలు తీసుకోవాలన్నారు.


అలాగే వాతావరణ శాఖ సూచనలకు అనుగుణంగా ముందస్తు చర్యలు చేపట్టాలంటూ ఉన్నతాధికారులను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. వర్షాలు, వరదలకు సంబంధించి కమాండ్ కంట్రోల్ సెంటర్ నుంచి మానిటరింగ్ చేసేందుకు ఒక వ్యవస్థను ఏర్పాటు చేసుకోవాలని అధికారులకు సూచించారు. వర్షాలు పడినప్పుడు హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్, ఇతర సమస్యలు తలెత్తకుండా పోలీస్, ట్రాఫిక్, హైడ్రా, జీహెచ్ఎంసీ విభాగాలు అప్రమత్తంగా ఉండాలన్నారు. ఈ నాలుగు విభాగాల అధికారులు సమన్వయంతో పని చేసి సమస్యలు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలన్నారు. అసంపూర్తిగా ఉన్న నాలాల పూడికతీత పనులు వీలైనంతగా త్వరగా పూర్తి చేయాలని అధికారులను ఆయన కోరారు.


ఇక సమస్యాత్మక ప్రాంతాలను గుర్తించి ముందస్తు చర్యలు తీసుకునేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని అధికారులకు సూచించారు. ఔటర్ రింగ్ రోడ్డు లోపలనున్న కోర్ అర్బన్ రీజియన్‌లో సమస్యలు తలెత్తకుండా ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. డీసిల్టింగ్ పనులను వేగవంతం చేయాలని సూచించారు. కోర్ అర్బన్ రీజియన్ పరిధిలోని చెరువులు, నాలాలు, రోడ్ల విస్తరణ, అభివృద్ధికి సంబంధించి ప్రత్యేక పాలసీని తయారు చేసే అంశాన్ని పరిశీలించాలని ఉన్నతాధికారులకు సీఎం సూచించారు. ఈ సమావేశంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, సీఎంఓ అధికారులు శేషాద్రి, మాణిక్ రాజ్, జీహెచ్ఎంసీ కమిషనర్ కర్ణన్, హైడ్రా కమిషనర్ రంగనాథ్, హెచ్ఎండీఏ అధికారులతో పాటు ఇతర శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

ఈ వార్తలు కూడా చదవండి..

సీఎం చంద్రబాబుతో హీరో అక్కినేని నాగార్జున భేటీ

ఏపీ కేబినెట్ భేటీ.. ఎప్పుడంటే..

For Telangana News And Telugu news

Updated Date - Jun 03 , 2025 | 09:33 PM