Harish Rao Fire On CM Revanth: కట్టింగ్ మాస్టర్‌గా మారిన సీఎం రేవంత్ రెడ్డి
ABN , Publish Date - Oct 27 , 2025 | 08:01 PM
మంత్రుల పంచాయతీల పరిష్కారం కోసమే క్యాబినెట్ సమావేశాలు పెట్టుకుంటున్నారని మాజీ మంత్రి హరీశ్ రావు విమర్శించారు. దక్కన్ యాజమాన్యాన్ని తుపాకీతో బెదిరించిన వ్యవహారంలో నిగ్గు తేల్చేందుకు సీబీఐ విచారణకు సిద్ధమా..? అంటూ సీఎం రేవంత్ రెడ్డికి ఆయన సవాల్ విసిరారు.
హైదరాబాద్, అక్టోబర్ 27: రేవంత్ రెడ్డి క్యాబినెట్ కచ్చితంగా దండుపాళ్యం ముఠానే అని మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు పునరుద్ఘాటించారు. ఒక్క సారి కాదు పదిసార్లు తాను ఇదే మాట అంటానని ఆయన స్పష్టం చేశారు. ఉన్న విషయం మాట్లాడితే కొందరు మంత్రులకు ఉలుకు ఎందుకు? అని ఆయన ప్రశ్నించారు. సోమవారం హైదరాబాద్ తెలంగాణ భవన్‌లో ముధోల్ నియోజకవర్గానికి చెందిన బీజేపీ నేత సిందే దీక్షిత్‌తో పాటు ఆయన అనుచరులు బీఆర్ఎస్ పార్టీలో చేరారు. వారికి కండువా కప్పి.. పార్టీలోకి ఆహ్వానించారు.
అనంతరం మాజీ మంత్రి హరీశ్ రావు మాట్లాడుతూ.. మంత్రుల పంచాయతీల పరిష్కారం కోసమే క్యాబినెట్ సమావేశాలు పెట్టుకుంటున్నారని విమర్శించారు. దక్కన్ యాజమాన్యాన్ని తుపాకీతో బెదిరించిన వ్యవహారంలో నిగ్గు తేల్చేందుకు సీబీఐ విచారణకు సిద్ధమా..? అంటూ సీఎం రేవంత్ రెడ్డికి ఆయన సవాల్ విసిరారు. దమ్ముంటే జ్యుడీషియల్ విచారణ జరపాలంటూ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
సీఎం రేవంత్ రెడ్డి ఒక్క భవనం కూడా కట్ట లేదు కానీ కటింగ్ మాస్టర్‌గా మారారంటూ ఎద్దేవా చేశారు. కేసీఆర్ సంక్షేమ పథకాలకు కటింగ్ పెట్టడం, కేసీఆర్ కట్టిన భవనాలకు రిబ్బన్ కట్ చేయడం రేవంత్ రెడ్డి పని అంటూ హరీశ్ రావు వ్యంగ్యంగా అన్నారు. ఈ ప్రభుత్వ హయాంలో ఆదిలాబాద్ జిల్లాలో పెండింగ్ ప్రాజెక్టుల విషయంలో ఒక్క అడుగు కూడా ముందుకు పడ లేదని విమర్శించారు.
పామాయిల్ ఫ్యాక్టరీ సైతం వెనక్కి పోయిందన్నారు. ఇథనాల్ ఫ్యాక్టరీ వద్దన్న రైతులపై కాంగ్రెస్ ప్రభుత్వం కేసులు పెట్టిందని ఆరోపించారు. యూరియా బస్తా ఇవ్వలేని అసమర్థ సర్కార్ ఇదంటూ ఆయన మండిపడ్డారు. యూరియా బస్తాల కొరతతో పంట దిగుబడి తగ్గే ప్రమాదం ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. రేవంత్ రెడ్డి పాలనలో అన్ని సగం...సగం, ఆగం...ఆగం అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
కరెంటు సైతం సరిగ్గా ఇవ్వలేక పోతున్నారని విమర్శించారు. రేవంత్ రెడ్డి పాలనపై ప్రజలు ఆగ్రహంగా ఉన్నారని పేర్కొన్నారు. బీఆర్ఎస్ కార్యకర్తలు ప్రజల అభిప్రాయాలకు అనుగుణంగా పనిచేయాలని సూచించారు. స్థానిక ఎన్నికలు ఎప్పుడు జరిగినా బీఆర్ఎస్ విజయం సాధించేలా పని చేయాలంటూ కార్యకర్తలకు హరీశ్ రావు పిలుపునిచ్చారు. నిర్మల్ జిల్లాలోని అన్ని సీట్లు బీఆర్ఎస్ గెలవాలని పార్టీ శ్రేణులకు ఈ సందర్భంగా హరీశ్ రావు దిశానిర్దేశం చేశారు.
ఈ వార్తలు కూడా చదవండి..
కట్టింగ్ మాస్టర్‌గా మారిన సీఎం రేవంత్ రెడ్డి
రైళ్లు రద్దుపై రైల్వే శాఖ కీలక నిర్ణయం.. ప్రయాణికులకు కీలక సూచన
For More TG News And Telugu News