Chevella Bus Accident: చేవెళ్ల ప్రమాదం.. రాజకీయ నాయకులకు నిరసన సెగ
ABN , Publish Date - Nov 03 , 2025 | 11:21 AM
మీర్జాగూడ బస్సు ప్రమాదం ఘటన స్థలంలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. పోలీసులతో స్థానికులు వాగ్వాదానికి దిగారు. బస్సును ఇక్కడ నుంచి తొలగించవద్దని మండిపడ్డారు. అయితే.. సంఘటనా స్థలానికి చేరుకున్న స్థానిక ఎమ్మెల్యే కాలె యాదయ్యపైకి ప్రజలు రాళ్లు విసిరారు.
హైదరాబాద్: చేవెళ్ల ప్రభుత్వ ఆసుపత్రి వద్ద రాజకీయ నాయకులను మృతుల కుటుంబ సభ్యులు నిలదీశారు. చేవెళ్ల ప్రభుత్వ ఆసుపత్రికి ఎంపీ విశ్వేశ్వర్ రెడ్డి, స్థానిక ఎమ్మెల్యే కాలె యాదయ్య చేరుకున్నారు. దీంతో వారిని చూసిన మృతుల కుటుంబ సభ్యులు ఒక్కసారిగా.. ఆగ్రహానికి గురయ్యారు. రోడ్డు నిర్మాణ పనుల్లో ఎందుకు ఆలస్యం చేశారని మండిపడ్డారు. నిత్యం ఈ మార్గంలో రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో మాజీమంత్రి సబితా ఇంద్రారెడ్డి, రోహిత్ రెడ్డిలకు కూడా నిరసన సెగ తగిలింది.
మరోపైపు మీర్జాగూడ బస్సు ప్రమాదం ఘటన స్థలంలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. పోలీసులతో స్థానికులు వాగ్వాదానికి దిగారు. బస్సును ఇక్కడ నుంచి తొలగించవద్దని మండిపడ్డారు. అయితే.. సంఘటనా స్థలానికి చేరుకున్న స్థానిక ఎమ్మెల్యే కాలె యాదయ్యపై స్థానికులు రాళ్లు విసిరే ప్రయత్నం చేశారు. ఎమ్మెల్యే డౌన్.. డౌన్.. అంటూ నినాదాలు చేశారు. దీంతో ఎమ్మెల్యే తన కారు ఎక్కి సంఘటనా స్థలం నుంచి వెళ్లిపోయారు.
ఈ ప్రమాదంలో ఇప్పటివరకు 19 మంది మృతి చెందినట్లు అడిషనల్ డీజీపీ మహేష్ భగవత్ అధికారకంగా వెల్లడించారు. మృతుల్లో పది మంది మహిళలు, 8 మంది పురుషులు, ఒక చిన్నారి ఉన్నట్లు పేర్కొన్నారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని పేర్కొన్నారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం మృతల కుటుంబాలకు రూ. 5 లక్షలు ఎక్స్‌గ్రేషియా, క్షతగాత్రులకు రూ.2 లక్షల పరిహారం ప్రకటించింది. గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందిస్తున్నట్లు పేర్కొంది. పోస్టుమార్టం పూర్తయ్యాక ఒక్కో మృతదేహానికి ఒక్కో అధికారిని కేటాయించి కుటుంబ సభ్యులకు అప్పగిస్తామని అధికారులు వెల్లడించారు.
ఇవి కూడా చదవండి..
Infectious Diseases: భారత్‌లో పెరుగుతున్న అంటువ్యాధులు