Etela vs Bandi: ఈటలకు కేంద్ర మంత్రి సంజయ్ కౌంటర్
ABN , Publish Date - Jun 22 , 2025 | 12:04 PM
బీజేపీలో బండి సంజయ్‌కు.. ఈటల రాజేందర్‌కు మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. ఆ క్రమంలో ఇటీవల కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మాణంపై ఈటల రాజేందర్ చేసిన వ్యాఖ్యలపై బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
కరీంనగర్, జూన్ 22: బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్ట్‌పై మల్కాజ్‌గిరి ఎంపీ ఈటల రాజేందర్ చేసిన వ్యాఖ్యలపై కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ స్పందించారు. ఆ క్రమంలో ఈటల రాజేందర్‌కు బండి సంజయ్ పరోక్షంగా కౌంటర్ ఇచ్చారు. ఆదివారం కరీంనగర్‌లో కేంద్ర మంత్రి బండి సంజయ్ విలేకర్ల సమావేశంలో మాట్లాడుతూ.. తమ పార్టీ స్టాండ్ ఒక్కటేనన్నారు.
పార్టీ అధ్యక్షుడు అయితేనో కేంద్ర మంత్రిగా ఉంటేనో మా స్టాండ్ మారదని ఆయన కుండబద్దలు కొట్టారు. బీజేపీలో ఉంటే.. బీజేపీ స్టాండే మాట్లాడాలి కానీ వ్యక్తిగతం అంటూ ఏమీ ఉండదని అభిప్రాయపడ్డారు. బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్‌కు కాళేశ్వరం ప్రాజెక్ట్ ఏటీఎం అయిందని విమర్శించారు. కాళేశ్వరం ప్రాజెక్ట్‌పై ఈటల రాజేందర్ అభిప్రాయానికి మేము పూర్తి భిన్నమని బండి సంజయ్ పేర్కొన్నారు. మేము ఊసరవెల్లి కాదన్నారు.
కేబినెట్‌లో కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారంటే.. ఎవరూ నమ్మరన్నారు. కేసీఆర్ కేబినెట్ మీటింగ్ అంతా ఉత్తదేనని ఆయన పేర్కొన్నారు. కాళేశ్వరం, ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై సీబీఐతో విచారణ జరపాలని కేంద్రాన్ని కోరాలని ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని బండి సంజయ్ డిమాండ్ చేశారు.
ఇంతకీ కాళేశ్వరంపై బీజేపీ ఎంపీ ఈటల ఏమన్నారంటే..?
ఇటీవల ఈటల రాజేందర్ ఒక మీడియాకు ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ సందర్భంగా కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మాణం, బీఆర్ఎస్ ప్రభుత్వం, కేసీఆర్ సంబంధించిన అంశాలపై సానుకూలంగా మాట్లాడారు. బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ ఈ విధంగా వ్యాఖ్యలు చేయడంపై బీజేపీ నేతలు.. ఆ పార్టీ రాష్ట్ర అధినేత, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి దృష్టికి తీసుకు వెళ్లారు. దీంతో కిషన్ రెడ్డి స్పందించారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ ఎదుట ఎంపీ ఈటల రాజేందర్ హాజరయ్యారని.. ఈ సందర్భంగా ఆయన బీజేపీ ఎంపిగా హాజరు కాలేదని వారికి స్పష్టం చేసినట్లు తెలుస్తోంది. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో మంత్రిగా పని చేసిన ఈటల.. అలాగే ఈ విషయంపై కమిషన్‌కు వివరణ ఇచ్చారని పార్టీ శ్రేణులకు కిషన్ రెడ్డి వివరించినట్లు సమాచారం.
మరోవైపు 2013 తెలంగాణ అంసెబ్లీ ఎన్నికలకు కొన్ని నెలల ముందు కాళేశ్వరం ప్రాజెక్ట్‌లోని మూడు పిల్లర్లు కుంగాయి. ఈ వ్యవహారం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. అయితే ఈ ఎన్నికల్లో తమ పార్టీ అధికారంలోకి వస్తే ఈ వ్యవహారంపై సుప్రీంకోర్టు రిటైర్డ్ జడ్జి చేత న్యాయ విచారణ జరిపిస్తామని ప్రజలకు కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చింది. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి తెలంగాణ ఓటరు పట్టం కట్టారు. దీంతో రేవంత్ రెడ్డి సారథ్యంలో కాంగ్రెస్ పార్టీ కొలువు తీరింది.
అనంతరం రూ. లక్షల కోట్లతో నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్ట్‌పై జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్‌ను రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏర్పాటు చేసింది. మరోవైపు ఈ కమిషన్ విచారణ ఇప్పటికే దాదాపుగా పూర్తయింది. అయితే తమ విచారణకు హాజరు కావాలంటూ అప్పటి సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్, నీటి పారుదల శాఖ మంత్రి హరీశ్ రావులకు వేర్వేరుగా నోటీసులు జారీ చేసింది. ఈ కమిషన్ ముందు వీరంతా హాజరై తమ తమ వివరణ ఇచ్చిన సంగతి తెలిసిందే.
ఇక ఈ కమిషన్ విచారణ అనంతరం ఓ మీడియా సంస్థకు బీజేపీ ఎంపీ ఈటల ఇంటర్వ్యూ ఇస్తూ.. గత బీఆర్ఎస్ ప్రభుత్వానికి అనుకూలంగా వ్యాఖ్యలు చేయడంతో బీజేపీలో రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది. అదీకాక బీజేపీలో కేంద్ర మంత్రి బండి సంజయ్ వర్సెస్ ఈటల రాజేందర్, కిషన్ రెడ్డి వర్సెస్ రాజా సింగ్ అన్నట్లుగా గ్రూప్ రాజకీయాలు నడుస్తున్నాయనే ఓ చర్చ సైతం ఆ పార్టీలో కొనసాగుతున్నట్లు ఓ ప్రచారం సాగుతోంది.
ఈ వార్తలు కూడా చదవండి..
అంబటి రాంబాబుపై మళ్లీ కేసులు నమోదు
తరగతి గదిలో విద్యార్థులు.. వారి ఎదుటే ఆ ఉపాధ్యాయుడు ఏం చేశాడంటే..
For Telangana News And Telugu News