Jubilee Hills Bypoll: సీఎం, మంత్రులపై సీఈసీకి ఫిర్యాదు: ఎంపీ కె.ఆర్.సురేష్ రెడ్డి
ABN , Publish Date - Nov 07 , 2025 | 06:19 PM
జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు వ్యవహరిస్తున్న తీరుపై కేంద్ర ఎన్నికల సంఘానికి బీఆర్ఎస్ ఎంపీలు సురేష్ రెడ్డి, దామోదర్ రావులు ఫిర్యాదు చేశారు.
న్యూఢిల్లీ, నవంబర్ 07: జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితోపాటు ఆయన కేబినెట్ సహచరులు కోడ్ ఉల్లంఘనకు పాల్పడుతున్నారని బీఆర్ఎస్ ఎంపీ కె.ఆర్.సురేష్ రెడ్డి విమర్శించారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ.. అధికార దుర్వినియోగానికి పాల్పడుతోందని ఆయన ఆరోపించారు. అధికార పార్టీకి అనుకూలంగా పోలీసులు వ్యవహరిస్తున్నారని.. ఈ నేపథ్యంలో కేంద్ర బలగాల ఆధ్వర్యంలో ఈ ఉపఎన్నికను నిర్వహించాలని ఈసీని కోరినట్లు ఆయన తెలిపారు.
శుక్రవారం న్యూఢిల్లీలో కేంద్ర ఎన్నికల సంఘం ఉన్నతాధికారులతో బీఆర్ఎస్ ఎంపీలు కె.ఆర్.సురేష్ రెడ్డి, దామోదర్ రావు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఈ ఉప ఎన్నికల్లో అధికార కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలు వ్యవహరిస్తున్న తీరును వారికి వివరించి.. ఫిర్యాదు చేశారు. అనంతరం విలేకర్లతో ఎంపీ కె.ఆర్.సురేష్ రెడ్డి మాట్లాడుతూ.. జూబ్లీహిల్స్ ఉపఎన్నికల్లో మహిళా ఓటర్లు అధికంగా ఉన్నారని.. దాంతో అక్కడ మహిళా అధికారులను నియమించాలని సీఈసీని కోరినట్లు తెలిపారు. అలా కాకుంటే దొంగ ఓట్లు వేసే అవకాశం ఉందని ఈ సందర్భంగా ఆందోళన వ్యక్తం చేశారు.
ఎమ్మెల్యే, బీఆర్ఎస్ నేత మాగంటి గోపినాథ్ అనారోగ్యంతో మృతి చెందారు. ఈ నేపథ్యంలో జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక అనివార్యమైంది. నవంబర్ 11వ తేదీన ఈ ఉప ఎన్నిక జరగనుంది. బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు.. తమ తమ అభ్యర్థులను రంగంలోకి దింపాయి. ఈ ఉప ఎన్నికల్లో గెలుపు కోసం ఆయా పార్టీలు పక్కా వ్యూహాత్మకంగా ముందుకు వెళ్తున్నాయి. ఆ క్రమంలో అధికార పార్టీ హామీల వర్షం కురిపిస్తోంది. ఇక ప్రతిపక్షలు బీఆర్ఎస్, బీజేపీలు.. అధికార పార్టీ ఇచ్చిన హామీలు అమలు చేయలేదంటూ విమర్శలు గుప్పిస్తున్నాయి.
దీంతో ఈ మూడు పార్టీలు ఆరోపణలు, ప్రత్యారోపణలు చేసుకుంటున్నాయి. అయితే అధికార కాంగ్రెస్ పార్టీ ఈ ఉపఎన్నికల్లో గెలుపును ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. అందుకోసం మంత్రులు, అగ్రనేతలను ఈ నియోజకవర్గంలోని డివిజన్లకు ఇన్‌ఛార్జ్‌లుగా నియమించి.. గెలుపు కోసం కృషి చేయాలని పార్టీ అధిష్ఠానం ఇప్పటికే స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది.
అదీకాక రేవంత్ రెడ్డి పాలన పగ్గాలు చేపట్టిన తర్వాత రాష్ట్రంలో జరుగుతున్న తొలి ఎన్నిక ఇది.. దాంతో దీనిని అధికార పార్టీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఇక ఈ నియోజకవర్గంలో మైనార్టీ ఓట్లు.. అభ్యర్థి గెలుపుపై తీవ్ర ప్రభావం చూపుతాయి. అందు కోసం తాజాగా మాజీ క్రికెటర్ అజారుద్దీన్‌కు రేవంత్ రెడ్డి కేబినెట్‌లో చోటు కల్పించారు.
అయితే ఈ నియోజకవర్గంలో ముస్లిం ఓటర్లు అధికం కావడంతో.. మహిళలు బురఖాలో వచ్చి దొంగ ఓట్లు వేసే అవకాశం ఉందని బీఆర్ఎస్ ఎంపీలు ఆరోపిస్తున్నారు. మరోవైపు ఈ ఎన్నికల్లో ఏ పార్టీకి జూబ్లీహిల్స్ ఓటర్ పట్టం కట్టాడనేది తెలియాలంటే నవంబర్ 14వ తేదీ వరకు ఆగాల్సిందే.
ఈ వార్తలు కూడా చదవండి..
ఎయిర్‌పోర్ట్‌లో చిక్కుకుపోయిన వేలాది మంది ప్రయాణికులు..
పురుషుల్లో టెస్టోస్టెరాన్ స్థాయిలు పెరగాలంటే..
For More TG News And Telugu News