BRS Candidate Controversy: సునీత మాగంటి భార్య కాదు.. ప్రద్యుమ్న సంచలన ఆరోపణలు
ABN , Publish Date - Oct 22 , 2025 | 03:55 PM
బీఆర్ఎస్ అభ్యర్థి సునీత నామినేషన్‌ను రద్దు చేయాలని మాగంటి గోపీనాథ్ మొదటి భార్య తనయుడు ప్రద్యుమ్న ఈసీకి ఫిర్యాదు చేశాడు. గోపీనాథ్ భార్య మాలిని అని.. సునీత కాదని ఆరోపించారు. మాలినితో గోపీనాథ్‌కు విడాకులు అవ్వలేదని ప్రద్యుమ్న పేర్కొన్నాడు.
హైదరాబాద్, అక్టోబర్ 22: జూబ్లీహిల్స్ ఉపఎన్నికల్లో విజయం సాధించేందుకు అధికార కాంగ్రెస్, సిట్టింగ్ సీట్‌లో మళ్లీ పాగా వేసేందుకు ప్రతిపక్ష బీఆర్ఎస్ హోరాహోరీగా తలపడుతున్నాయి. ఈ క్రమంలోనే జూబ్లీహిల్స్ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి మాగంటి సునీత తన ప్రచారాన్ని ముమ్మరం చేశారు. ఆమె పిల్లలు సైతం ఎన్నికల ప్రచారం సాగిస్తున్నారు. ఇలాంటి సమయంలో బిగ్ ట్విస్ట్ ఇచ్చారు దివంగత నాయకుడు మాగంటి గోపీనాథ్ మొదటి భార్య తనయుడు ప్రద్యుమ్న. సునీత, మాగంటి గోపీనాథ్ అసలు భార్యా భర్తలే కాదని ఆరోపించారు. వీరిద్దరూ పెళ్లి చేసుకోలేదని, లివ్ ఇన్ రిలేషన్‌లో ఉన్నారంటూ బాంబ్ పేల్చారు. ఎన్నికల కమిషన్‌కు సునీత ఇచ్చిన అఫిడవిట్‌ను రద్దు చేయాలన్నారు. ఈ మేరకు ఈసీకి వినతి పత్రం అందజేశారు ప్రద్యుమ్న.
బుధవారం నాడు ఇదే అంశంపై మీడియాతో మాట్లాడిన ప్రద్యుమ్న.. సునీత మాగంటి గోపీనాథ్ భార్య కాదన్నారు. తన తల్లి మాలినితో గోపీనాథ్‌కు విడాకులు కాలేదని ప్రద్యుమ్న చెప్పుకొచ్చారు. అంతేకాదు.. విడాకులు అవకుండానే గత ఎన్నికల సమయంలోనూ గోపీనాథ్ తన అఫిడవిట్‌లో భార్య స్థానంలో సునీత పేరును పేర్కొన్నట్లు ఆరోపించారు. ఈ అంశంపై ఈసీ చర్యలు తీసుకోవాలని ప్రద్యుమ్న కోరారు.
కాగా, ఈ వ్యవహారంపై స్పందించిన ఎలక్షన్ కమిషన్.. మాగంటి గోపీనాథ్‌కు సునీత రెండో భార్య అవునా కాదా అనే విషయాన్ని తేల్చాల్సిన బాధ్యత తమది కాదని స్పష్టం చేసింది. ఈ వ్యవహారం కోర్టులో తేల్చుకోవాల్సి ఉంటుందని ఎన్నికల సంఘం అధికారులు పేర్కొన్నారు. దీంతో మాగంటి సునీత నామినేషన్‌కు లైన్ క్లియర్ అయ్యింది. అంతేకాదు.. ఆమె వేసిన నామినేషన్లను ఈసీ ఆమోదించింది.
ఇవి కూడా చదవండి...
బకాయిలు అడిగితే బ్లాక్ మెయిలా.. ప్రభుత్వంపై బండి సంజయ్ ఆగ్రహం
ఉస్మానియా ఆసుపత్రి కొత్త భవనంపై సీఎం సమీక్ష
Read Latest Telangana News And Telugu News