Chamala Kiran Kumar Reddy: మెరిట్ కోటాలో సీఎం అయిన రేవంత్ రెడ్డి: చామల కుమార్ రెడ్డి
ABN , Publish Date - Dec 26 , 2025 | 03:50 PM
పిచ్చి ఆలోచనలు మానుకోవాలంటూ కేటిఆర్‌కు కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి హితవు పలికారు. నిర్మాణత్మక ప్రతిపక్ష పార్టీ పాత్ర పోషించాలంటూ కేటీఆర్‌కు సూచించారు. కేసీఆర్‌ను అసెంబ్లీకి తీసుకుని రావాలని కేటీఆర్‌కు స్పష్టం చేశారు.
హైదరాబాద్, డిసెంబర్ 26: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ బుద్ది, జ్ఞానం లేకుండా మాట్లాడుతున్నారని భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి మండిపడ్డారు. సీఎం రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేసిన వ్యాఖ్యలకు భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి శుక్రవారం హైదరాబాద్‌లో కౌంటర్ ఇచ్చారు. రేవంత్ రెడ్డి మెరిట్ కోటాలో సీఎం అయ్యారన్నారు. నువ్వు మేనేజ్‌మెంట్ కోటాలో రాజకీయాల్లోకి వచ్చావంటూ కేటిఆర్‌ను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. అదే కోటాలో వచ్చి సిరిసిల్ల ఎమ్మెల్యే అయి.. మంత్రి అయ్యావంటూ వ్యంగ్యంగా అన్నారు.
రేవంత్ రెడ్డి ఇండిపెండెంట్‌గా జడ్పీటీసీ, ఎమ్మెల్యేగా గెలిచారు. రెండు సార్లు ఎమ్మెల్యేగా.. ఒకసారి ఎంపీగా గెలిచి.. ప్రస్తుతం సీఎం అయ్యారని వివరించారు. మెరిట్ కోటా,పేమెంట్ కోటా, మేనేజ్‌మెంట్ కోటా ఎవరిదో తెలంగాణ ప్రజలకు తెలుసునన్నారు. పీసీసీ అధ్యక్షుడుగా రేవంత్ రెడ్డి అయిన తర్వాతనే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందని పేర్కొన్నారు. ఎప్పుడు అధికారం తమకే ఉంటుందని బీఆర్ఎస్ హయాంలో నియంత పాలన చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
బీఆర్ఎస్‌కు గుండు సున్నా..
2023 అసెంబ్లీ ఎన్నికల్లో మిమ్మల్ని రేవంత్ రెడ్డి ఓడించి ఇంటికి పంపారని చెప్పారు. 2029 అసెంబ్లీ ఎన్నికల్లో రేవంత్ రెడ్డి చేతిలో మీకు ఓటమి తప్పదని జోస్యం చెప్పారు. దమ్ముంటే రేవంత్ రెడ్డి ఛాలెంజ్ స్వీకరించాలంటూ కేటీఆర్‌ను ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. ఐరెన్ లెగ్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అని అభివర్ణించారు. 2024 పార్లమెంట్ ఎన్నికల్లో బిఆర్ఎస్ పార్టీకి గుండు సున్నా వచ్చిందని ఎద్దేవా చేశారు. హైదరాబాద్‌లో తాను ఏదో పొడిచానని చెప్పుకున్న కేటీఆర్‌ను కంటోన్మెంట్, జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో ప్రజలు ఓడగొట్టారని గుర్తు చేశారు.
పిచ్చి ఆలోచనలు మానుకోవాలి కేటీఆర్..
పిచ్చి ఆలోచనలు మానుకోవాలంటూ కేటిఆర్‌కు ఆయన హితవు పలికారు. నిర్మాణత్మక ప్రతిపక్ష పార్టీ పాత్ర పోషించాలంటూ బిఆర్ఎస్ నేతలకు సూచించారు. కేసీఆర్‌ను అసెంబ్లీకి తీసుకుని రావాలంటూ కేటీఆర్‌కు తెలిపారు. కేసీఆర్ అసెంబ్లీకి రాకపోతే ప్రధాన ప్రతిపక్ష నేత హోదాను కేటీఆర్ తీసుకోవాలని అభిప్రాయపడ్డారు. తద్వారా ప్రభుత్వానికి సలహాలు,సూచనలు ఇవ్వాలని కేటీఆర్‌కు ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి సూచించారు.
తాను బూతులు మాట్లాడతానంటూ కేటీఆర్ అంటున్నారన్నారు. కట్టే, కొట్టే, తెచ్చే అనేది మీ కుటుంబానికి వర్తిస్తుందంటూ కేటీఆర్‌కు తెలిపారు. నీళ్లు, నిధులు, నియామకాల పేరుతో తెలంగాణ ప్రజలను మీరు వంచించ లేదా? అని కేటిఆర్‌ను సూటిగా ప్రశ్నించారు. కేసీఆర్ ఉద్యమకారుడి అవతారం ఎత్తి, పిట్ట కథలు కట్టి, సీఎం పదవిని అధికారాన్ని చేపట్టి.. రాష్ట్రాన్ని అప్పుల చేసి మీ కుటుంబానికి సంపద తెచ్చారని విమర్శించారు.
హైడ్రా వల్ల నగర ప్రజలు సంతోషం
హైడ్రా చేస్తున్న పనుల పట్ల హైదరాబాద్ నగర ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారని పేర్కొ్న్నారు. బీఆర్ఎస్ హయాంలో నాలాలను కబ్జాలు చేసి ఇళ్ళు నిర్మించారని.. దాంతో వానాకాలం వస్తే ఇళ్లనీ మునిగి ప్రజలకు ఆస్తి నష్టం వాటిల్లేదన్నారు. బీఆర్ఎస్ హయాంలో కాలనీలు, పార్కులను కబ్జాలు చేసి దండుపాళ్యం ముఠాలా దోచుకున్నారని మండిపడ్డారు. మీరు కబ్జాలు చేసి దోచుకున్న వాటిని హైడ్రా కూల్చివేస్తుందని హెచ్చరించారు.
ప్రజల కోసం హైడ్రా కూల్చివేతలు చేపడుతోందని వివరించారు. బీఆర్ఎస్ హయాంలో సన్న బియ్యం, రేషన్ కార్డులు, ఇళ్ళు ప్రజలకు ఇచ్చారా..? అని కేటీఆర్‌ను ఈ సందర్భంగా ఆయన నిలదీశారు. కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయడం అంటే నగదు ఇవ్వడం కాదని.. మహిళలకు ఉపాధి, ఉద్యోగ అవకాశాలు ఇవ్వడం ద్వారా కోటి మంది మహిళలు కోటీశ్వరులు అవుతారని కేటీఆర్‌కు భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి సోదాహరణగా వివరించారు.
ఈ వార్తలు కూడా చదవండి..
రేవంత్ రెడ్డిని భీమవరం బుల్లోడు అనాలా: కేటీఆర్
విమాన ప్రయాణం.. ప్రయాణికుల్లో కలవరం
For More TG News And Telugu News