Bandi Sanjay: తెలంగాణ ప్రజలు డబుల్ ఇంజిన్ సర్కార్‌ను కోరుకుంటున్నారు: బండి సంజయ్
ABN , Publish Date - Dec 20 , 2025 | 05:40 PM
తెలంగాణాలో పాలన సాగిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వంపై కేంద్ర మంత్రి బండి సంజయ్ మండిపడ్డారు. అటు ఏపీలో కూటిమి హయాంలో అభివృద్ధి వేగంగా సాగుతోందని వ్యాఖ్యానించారు.
హైదరాబాద్, డిసెంబర్ 20: రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మాజీ సీఎం కేసీఆర్‌లపై కేంద్ర హోం శాఖ సహాయక మంత్రి, బీజేపీ నేత బండి సంజయ్ కీలక వ్యాఖ్యలు చేశారు(Bandi Sanjay Comments on Congress and KCR). తెలంగాణలో కాంగ్రెస్ పాలన.. అవినీతి మయంగా, దరిద్రంగా ఉందని ఆయన ధ్వజమెత్తారు. తల నరికినా.. పైసా లేదని సీఎం రేవంత్ అంటున్నారని.. అందువల్లే ఇక్కడి ప్రజలు ఆంధ్రప్రదేశ్‌లాగే డబుల్ ఇంజిన్ సర్కారును కోరుకుంటున్నారని విమర్శించారు. ఈసారి ఎన్నికలు ఎప్పుడొచ్చినా అధికారం తమదేనని ఆశాభావం వ్యక్తం చేశారాయన(Union Minister Bandi Sanjay).
'ఈసారి ఎప్పుడు ఎన్నికలు వచ్చినా.. తెలంగాణలో సొంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాం. బీఆర్ఎస్, బీజేపీ ఒక్కటేనని పదేళ్ల నుంచి అంటున్నారు. ఈ రెండు పార్టీలు ఎప్పుడూ కలిసి పోటీ చేయలేదు. కానీ, కాంగ్రెస్ పార్టీతో కలిసి బీఆర్ఎస్ బరిలో దిగింది. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడగానే.. అవినీతికి పాల్పడిన కేసీఆర్‌ను జైలుకు పంపుతానన్న రేవంత్ రెడ్డి మాటలు ఏమైయ్యాయి? ఫోన్ ట్యాపింగ్ కేసులో కేసీఆర్‌ను జైలుకు పంపారా? కాళేశ్వరం ప్రాజెక్ట్ అవినీతిలో జైలుకు పంపారా? డ్రగ్స్ కేసులో జైలుకు పంపారా? ఫాం హౌస్ కేసులో జైలుకు పంపారా? కాంగ్రెస్, బీఆర్ఎస్ దోస్తులు కాబట్టే కేసీఆర్ ఫ్యామిలిలో ఎవరినీ జైలుకు పంపలేదు' అని ఇరు పార్టీలపై ధ్వజమెత్తారు బండి సంజయ్.
కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీల మధ్య లోపాయికారీ ఒప్పందం ఉందని బండి సంజయ్ వ్యాఖ్యానించారు. ఎన్నికలలో ఓడిన తర్వాత కేసీఆర్ ఎక్కడా కనబడలేదని.. అయితే ఫామ్ హౌజ్ లేదా యశోదా ఆసుపత్రిలో మాత్రమే కనిపిస్తున్నారని చెప్పుకొచ్చారు. ఫామ్ హౌజ్ పాలను తెలంగాణ ప్రజలు కోరుకోవడం లేదన్న ఆయన.. పంచాయితీ ఎన్నికల్లో తమ పార్టీకి గతంలో 100 సీట్లు వస్తే.. ఇప్పుడు 600కు పైగా స్థానాలొచ్చాయన్నారు. లీకు వీరులు అన్ని పార్టీలోనూ ఉన్నారని ఈ సందర్భంగా కౌంటర్ వేశారు.
ఏపీలో కూటమి పాలనపై..
ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh)లో కూటమి పాలన అద్భుతంగా సాగుతోందని బండి సంజయ్(Bandi Sanjay) కొనియాడారు. 'ఏపిలో కూటమి పాలనకు వందకు వంద మార్కులు పడతాయి. ఈ విషయంలో అనుమానాలున్నవారు మూర్ఖులు. అలాంటివారు ఆసుపత్రికి వెళ్లి ట్రీట్మెంట్ తీసుకోవాలి. ఏపిలో అభివృద్దిపై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది' అని కూటమి పాలనపై ప్రశంసలు కురిపించారాయన.
ఇవీ చదవండి: