Pavan Kalyan: కాలికి కాలు, చెయ్యికి చెయ్యికి అనేలా ట్రీట్ చేస్తే... వారంతా కకావికలమే: పవన్
ABN , Publish Date - Dec 20 , 2025 | 01:47 PM
తూర్పుగోదావరి జిల్లాలోని నిర్వహించిన సభలో డిప్యూటీ సీఎం పవన్ మాట్లాడారు. ఈ సందర్భంగా వైసీపీ నేతలపై ఆయన తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. వైసీపీ నేతలు గీతలు దాటి మాట్లాడొద్దని హెచ్చరించరాయన.
తూర్పుగోదావరి, డిసెంబర్ 20: పెరవలిలో నిర్వహించిన సభలో వైసీపీపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నిప్పులు చెరిగారు. వైసీపీ నాయకులు చేసిన వ్యాఖ్యలపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. అధికారంలో ఉండగా వైసీపీకి భయపడేదిలేని, పదేళ్లుగా పార్టీ పెట్టి కూడా వెనక్కు తగ్గానని జనసేన అధినేత చెప్పుకొచ్చారు. సీట్లు అమ్ముకున్నానని తనపై విమర్శలు గుప్పించారన్న పవన్.. ప్రజల కోసమే సీట్లు తగ్గించుకున్నానని తెలిపారు. తెలుగువారి ఆత్మగౌరవం కోసం పోరాడిన బూర్గుల రామకృష్ణా రావు, పొట్టి శ్రీరాములే తనకు స్ఫూర్తి అని ఈ సందర్భంగా ఉప ముఖ్యమంత్రి స్పష్టం చేశారు.
'విభజన వల్ల నష్టపోయాం.. ఇక నష్టపోకూడదనే మేమంతా ఏకమయ్యాం. ఎవరి ప్రాణ త్యాగంతో రాష్ట్రం ఏర్పడిందో వారిని స్మరించుకోవడం మన ధ్యేయం. త్యాగజీవి పొట్టి శ్రీరాములు విగ్రహానికి దండ వేద్దామంటే ఎక్కడా విగ్రహం కనిపించలేదు. రాష్ట్రం కోసం త్యాగం చేసిన వ్యక్తిని నెల్లూరు జిల్లాకు పరిమితం చేశాం. ప్రధానిమంత్రికి ప్రపంచమంతా శత్రువుల్లా తయారయ్యారు. కొన్ని పరిణామాల వల్ల ఆయన నా సభలకూ రావడానికి ఇబ్బంది పడుతున్నారు. తెలుగు జాతి, తెలుగు ఆత్మగౌరవం అని మొదటిసారి మాట్లాడిన వ్యక్తి పొట్టి శ్రీరాములు. డొక్కా సీతమ్మ కులం చూడలేదు. అమ్మా.. ఆకలి అంటే అన్నం పెట్టారు. చిన్న పిల్లలకు గుర్తుండిపోయేలా మధ్యాహ్న భోజన పథకానికి ఆమె పేరు పెట్టాం. రాష్ట్రానికి మంచి స్పందన జరగాలనే నేను తగ్గి, కూటమితో కలిశాను' అని పవన్ పేర్కొన్నారు.
ప్రజలకు స్వచ్ఛమైన తాగునీరు అందించాలనే లక్ష్యంతో వాటర్ గ్రిడ్ పథకం చేపట్టామని ఈ సందర్భంగా పవన్ అన్నారు. 'అక్వా కల్చర్ వలన భూగర్భ జలాలు కలుషితమయ్యాయంటే నవ్వాలో, ఏడవాలో తెలియడం లేదు. రూ.7,500 కోట్లతో స్వచ్ఛమైన తాగునీరు రాష్ట్రంలో అందరికీ అందిచాలని నిర్ణయించాం. మీరు అధికారంలో ఉన్నప్పుడు మీకు నేను భయపడలేదు. మీ దౌర్జన్యాలకు భయపడలేదు. అధికారంలోకి వస్తే చంపేస్తాం.. అంటే ఏం మాట్లాడతాం. సిగ్గుందా అలాంటి మాటలు మాట్లాడడానికి? మేము అధికారంలోకి వస్తే కాంట్రాక్టర్లను జైలులో వేస్తామంటున్నారు. అలాంటి వారికి పవన్ కళ్యాణ్ భయపడడు. వారి వెనుక రౌడీలు ఉంటారని అధికారులు భయపడుతున్నారు. అటువంటి రౌడీలకు యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌లా.. కాలికి కాలు, చెయ్యికి చెయ్యి అనేలా ట్రీట్మెంట్ ఇస్తే.. వారంతా కకావికలం అయిపోతారు. మేమంతా కూర్చుని ఒక నిర్ణయం తీసుకుంటే వారు ఏమైపోతారు? పద్ధతులు మార్చుకోండి. గీతలు దాటి మాట్లాడొద్దు. అలా మాట్లాడితే.. వారి చేతుల్లో గీతలు తీసేస్తాం. పాత పద్ధతిలోనే మేముంటామని వైసీపీ నేతలు అంటే.. నేను విసిగిపోయాను. అలాంటి వారి ప్రాణాలకు గ్యారంటీ లేదు. అడ్డగోలుగా వెళతామంటే.. రోమం రోమం తీసేసి కూర్చోబెడతాం. నాయకులు చేసే పాపాలకు ప్రజలు ఇబ్బందులు పడాలా? కులాల సమూహం అని కొట్టుకుంటున్నారే గానీ.. సమూహంగా మన దేశం కోసం మాట్లాడడం లేదు' అని జనసేన అధినేత పవన్ పేర్కొన్నారు.
ఇవీ చదవండి:
కెనడా జనాభాలో తగ్గుదల.. 1946 తరువాత తొలిసారిగా..
మరిన్ని ఉక్రెయిన్ భూభాగాలను లాగేసుకుంటాం: పుతిన్ వార్నింగ్