Pavan Kalyan Reacts on Bangla riots: నాడు భారతీయుల రక్తంతో విముక్తి పొందిన బంగ్లాదేశ్.. నేడు... : పవన్ కళ్యాణ్
ABN , Publish Date - Dec 20 , 2025 | 12:53 PM
బంగ్లాదేశ్‌లో ఇటీవల దీపూ చంద్రదాస్ అనే వ్యక్తి దారుణ హత్యకు గురైన ఘటనపై భారత్‌లోని పలువురు ప్రముఖులు స్పందించారు. ఒకప్పుడు భారతీయుల రక్తంతో విముక్తి పొందిన బంగ్లాదేశ్.. ఇప్పుడు అమాయక మైనార్టీల రక్తంతో తడిసిపోతోందని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు.
ఇంటర్నెట్ డెస్క్: బంగ్లాదేశ్(Bangladesh)లో ఇటీవల షరీఫ్ ఉస్మాన్ హాదీ(Sharif Osman Hadi) అనే విద్యార్థి నాయకుడు మృతి చెందడంతో ఆందోళనలు తారాస్థాయికి చేరాయి. అందులో భాగంగా దీపూ చంద్ర దాస్(Dipu Chandra Das) అనే ఓ హిందువును దారుణంగా హతమార్చారు ఆందోళనకారులు. ఈ హింస కాండపై కాంగ్రెస్ ఎంపీ ప్రియాంకా గాంధీ వాద్రా(Priyanka Gandhi Vadra), ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, బంగ్లాదేశ్ బహిష్కృత రచయిత్రి తస్లీమా నస్రీన్ వంటి వారు స్పందించారు.
చంద్రదాస్ హత్య బాధాకరం..
'బంగ్లాదేశ్‌లో హిందూ యువకుడు చంద్రదాస్‌ను నిరసనకారులు గుంపు దారుణంగా హతమార్చడం బాధాకరం. ఏ నాగరిక సమాజంలోనైనా.. కులం, మతం, గుర్తింపు ఆధారంగా వివక్ష, హింస, హత్య అనేవి మానవత్వానికి వ్యతిరేక నేరాలు' అని ఎక్స్ వేదికగా పేర్కొన్నారు ప్రియాంక. ఆ దేశంలో హిందూ, క్రైస్తవ, బౌద్ధ మైనార్టీల పట్ల పెరుగుతున్న హింసను అక్కడి అధికార యంత్రాంగం గమనించాలని, వారి భద్రతా అంశాన్ని బలంగా లేవనెత్తాలని ఆమె అన్నారు.
త్యాగాలను చరిత్ర మరవదు..
ఈ విషయమై ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్(AP Deputy CM Pavan Kalyan) మాట్లాడుతూ.. 'చరిత్ర.. త్యాగాలను గుర్తుంచుకుంటుంది. కానీ, ఒకప్పుడు భారతీయుల రక్తంతో విముక్తి పొందిన నేల.. నేడు అమాయక మైనారిటీల రక్తంతో తడిసిపోతోంది. 1971లో మన సాయుధ బలగాలు అణగారిన వర్గాలకోసం పోరాడాయి. నాడు మన సైనికులు యుద్ధం మాత్రమే చేయలేదు, ప్రస్తుత బంగ్లాదేశీయులైన లక్షలాది మంది ప్రజల గుర్తింపు, గౌరవం కోసం పోరాడారు. ఆ దేశ ఆవిర్భావం కోసం సుమారు 3,900 మంది భారత సైనికులు ప్రాణ త్యాగం చేశారు. సుమారు పదివేల మందికి పైగా గాయపడ్డారు. ఇతరులు శాంతియుతంగా జీవించడం కోసం మేం మా ప్రాణాలర్పించాం' అని చెప్పారు.
ఈ రోజుల్లో.. శాంతి అనేది ఒక పదమేనని, హింస అనేదే వాస్తవమని పవన్ పేర్కొన్నారు. బంగ్లాదేశ్‌లో 2024 ఆగస్టు నుంచి 2025 వరకు సుమారు 2,400కు పైగా హింసాత్మక ఘటనలు చెలరేగాయని ఈ సందర్భంగా ఆయన తెలిపారు. 'గతేడాది ఇస్కాన్(Isckon) ప్రభోదకుడైన చిన్మోయ్ కృష్ణదాస్(Chinmoy Krishna Das)ను అన్యాయంగా జైల్లో పెట్టడం, కమ్యూనిస్ట్ పార్టీ నాయకుడు ప్రదీప్ భౌమిక్(Pradeep Bhaumik)ను దారుణంగా కొట్టి చంపడం మన కళ్లారా చూశాం. ఇప్పుడు మైమెన్‌సింగ్‌లో చంద్రదాస్(Chandra Das)ను క్రూరంగా హతమార్చారు. 21 శతాబ్దానికే సిగ్గుచేటు కలిగించే స్థాయిలో అతను క్రూరత్వానికి గురయ్యాడు' అని పవన్(Pavan) వివరించారు.
1994లో బంగ్లాదేశ్ నుంచి తప్పించుకున్న తస్లీమా నస్రీన్(Tasleema Nasrin) అనే రచయిత్రి ఈ హత్యాకాండపై పలు ఆరోపణలు చేశారు. కర్మాగారంలో పనిచేస్తున్న చంద్రదాస్ సహోద్యోగి అయిన ఓ ముస్లిం వ్యక్తి కారణంగా.. చంద్రదాస్ హత్యకు గురయ్యాడని ఆమె చెప్పారు.
అయితే.. ఈ ఘటనపై చర్యలు తీసుకుంటామని బంగ్లా ప్రభుత్వం చెప్పింది. దేశంలో హింసకు చోటు లేదని, ఈ హేయమైన నేరానికి పాల్పడిన వారిని వదిలిపెట్టబోమని హామీ ఇచ్చింది అక్కడి ప్రభుత్వం.
ఇవీ చదవండి:
కెనడా జనాభాలో తగ్గుదల.. 1946 తరువాత తొలిసారిగా..
మరిన్ని ఉక్రెయిన్ భూభాగాలను లాగేసుకుంటాం: పుతిన్ వార్నింగ్