Russian Journalist Proposal: పుతిన్ ముందే ఆ జర్నలిస్ట్ లవ్ ప్రపోజల్.. ఏమైందంటే.?
ABN , Publish Date - Dec 20 , 2025 | 11:29 AM
రష్యాకు చెందిన ఓ పాత్రికేయుడు.. ఏకంగా ఆ దేశ అధ్యక్షుడు పుతిన్ ముందే తన గర్ల్ ఫ్రెండ్‌కు ప్రపోజ్ చేశాడు. విలేకర్ల సమావేశం సందర్భంగా జరిగిన ఈ సంఘటన ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.
ఇంటర్నెట్ డెస్క్: రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్(Russian President Putin) ఎదుట ఓ ఆసక్తికర సంఘటన చోటు చేసుకుంది. లక్షలాది మంది ప్రేక్షకుల మధ్య, పుతిన్(Putin) ఎదుటే ఓ యువ పాత్రికేయుడు తన ప్రియురాలికి ప్రపోజ్ చేశాడు. ప్రస్తుతం ఈ ప్రపోజల్(Proposal)కు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుండగా.. దీనిపై నెటిజన్లు పలు రకాలుగా స్పందిస్తున్నారు.
అసలేం జరిగిందంటే.?
ఆ దేశంలో నిర్వహించిన విలేకర్ల సమావేశం సందర్భంగా.. రిపోర్టర్లు పుతిన్‌ను పలు ప్రశ్నలడిగారు. వాటన్నిటికీ ఆయన సమాధానమిచ్చారు. ఈ ప్రశ్నోత్తరాల సమయంలో యువ జర్నలిస్ట్ కిరిల్ బజనోవ్(Kirill Bazhanov) (23) వంతు వచ్చింది. ఆ సమయంలో ఎంతో ఉత్సాహంగా కనిపించిన కిరిల్.. పుతిన్ ముందే 'నేను పెళ్లి చేసుకోవాలి అనుకుంటున్నాను' అనే పోస్టర్‌ను పట్టుకుని తన ప్రియురాలికి ప్రపోజ్ చేశాడు. దీంతో ఆ సమయంలో అక్కడున్న వారంతా ఒక్కసారిగా నవ్వారు. 'నా స్నేహితురాలు దీన్ని చూస్తోంది' అని అంటూనే.. 'ఓల్గా(Olga), నువ్వు నన్ను పెళ్లి చేసుకుంటావా? ప్లీజ్ నన్ను చేస్కో.. నేను నీకు ప్రపోజ్ చేస్తున్నా' అని చెప్పాడతను. ఈ సంఘటన జరిగినంత సేపూ ఎంతో ఆసక్తికరంగా చూసిన ప్రాంగణంలోని ప్రేక్షకులు.. ఆ తర్వాత బిగ్గరగా చప్పట్లు కొట్టి వారికి అభినందనలు తెలిపారు.
ఆ తర్వాత.. కిరిల్ ప్రపోజల్‌ను అతడి స్నేహితురాలు ఓల్గా అంగీకరించినట్టు ప్రోగ్రామ్ హోస్ట్(Program Host) అదే సమావేశంలోనే ప్రకటించారు. దీంతో పుతిన్ సహా ప్రేక్షకులంతా మరోసారి ఆనందంతో చప్పట్లు కొట్టారు. ఆ వెంటనే తమ వివాహానికి పుతిన్‌ను ఆహ్వానిస్తూ.. ఓల్గా, తను ఎనిమిదేళ్లుగా కలిసి ఉంటున్నామని, కానీ ఆర్థిక ఒత్తిళ్ల కారణంగా పెళ్లి చేసుకోలేకపోతున్నామని బజనోవ్(Bazhanov) తెలిపాడు. అయితే.. వారి ఆహ్వానానికి స్పందించని పుతిన్.. బదులుగా వారికి ఆర్థిక సాయం ప్రకటించారు. 'కిరిల్.. యువ కుటుంబాల ఆర్థిక స్థితిగతుల గురించి ఆందోళన వ్యక్తం చేశాడు. అది వాస్తవమే.. ఇప్పుడు మనమంతా అతడి పెళ్లికి అవసరమైన విరాళాలు సేకరించాలి' అని చెప్పారు పుతిన్.
ఇవీ చదవండి:
కెనడా జనాభాలో తగ్గుదల.. 1946 తరువాత తొలిసారిగా..
మరిన్ని ఉక్రెయిన్ భూభాగాలను లాగేసుకుంటాం: పుతిన్ వార్నింగ్