Share News

BRS Vs Congres: హరీష్‌ను రమ్మంటే వారిని పంపుతామంటారా?.. మంత్రి అడ్లూరి ఆగ్రహం

ABN , Publish Date - Oct 27 , 2025 | 12:11 PM

హరీష్ రావు చర్చకు వస్తే వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నానని మంత్రి అడ్లూరి స్పష్టం చేశారు. అయితే హరీష్‌ను చర్చకు రమ్మంటే మాజీ ఎమ్మెల్యేలను పంపుతా అంటారా అంటూ మండిపడ్డారు.

BRS Vs Congres: హరీష్‌ను రమ్మంటే వారిని పంపుతామంటారా?.. మంత్రి అడ్లూరి ఆగ్రహం
BRS Vs Congres

హైదరాబాద్, అక్టోబర్ 27: అధికారపక్షం, ప్రధాన ప్రతిపక్షం సవాళ్లు ప్రతిసవాళ్లతో తెలంగాణలో రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది. పదేళ్ల బీఆర్‌ఎస్‌ పాలన, రెండేళ్ల కాంగ్రెస్ పాలనపై చర్చకు సిద్ధమా అంటూ మాజీ మంత్రి హరీష్‌రావుకు (Former Minister Harish Rao) మంత్రి అడ్లూరి లక్ష్మణ్ (Minister Adluri Laxman) సవాల్ విసిరిన విషయం తెలిసిందే. ఈరోజు (సోమవారం) అంబేద్కర్ విగ్రహం వద్దకు వస్తే చర్చిద్దామంటూ మంత్రి సవాల్ విసిరారు. అయితే ఇదే విషయంపై మంత్రి అడ్లూరికి మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్, బీఆర్‌ఎస్‌ నేతలు ఛాలెంజ్ చేశారు. చర్చకు రావాలని పట్టుబడ్డారు.


ఈ వ్యవహారంపై తాజాగా మంత్రి అడ్లూరి మాట్లాడుతూ.. సవాలు విసిరితే హరీష్ రావు తోక ముడిచి పారిపోయారంటూ ఎద్దేవా చేశారు. హరీష్ రావు బండారాన్ని వాళ్ళ మరదలు కవితనే బయటపెడుతోందన్నారు. హరీష్ రావు చర్చకు వస్తే వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నానని మంత్రి స్పష్టం చేశారు. అయితే హరీష్‌ను చర్చకు రమ్మంటే మాజీ ఎమ్మెల్యేలను పంపుతా అంటారా అంటూ మండిపడ్డారు. కేసీఆర్‌ను హరీష్ రావు వెన్నుపోటు పొడిచే ప్రయత్నం చేశారని ఆరోపించారు. హరీష్ రావు నోటికి ఎంత వస్తే అంత మాట్లాడుతున్నారని.. హరీష్ మాట్లాడిన మాటలు నిరూపించగలరా అని ప్రశ్నించారు. హరీష్ రావు తక్షణమే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ మంత్రులు బందిపోటు దొంగలంటూ వ్యాఖ్యలు చేశారు. అబద్దాన్ని పది సార్లు చెప్తే నిజమవుతుందని హరీష్ అనుకుంటున్నారని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.


మా నాయకుడు వస్తాడు: హరీష్

మరోవైపు హరీష్‌రావు కూడా దీనిపై స్పందిస్తూ.. మంత్రి అడ్లూరితో చర్చకు తమ నాయకుడు కొప్పుల ఈశ్వర్ వస్తారన్నారు. కొప్పుల ఈశ్వర్ తో చర్చకు కాంగ్రెస్ నేతలు చర్చకు రెడీగా ఉండాలన్నారు. కేబినెట్‌లో మంత్రుల పంచాయితీలు జరిగాయని అన్ని మీడియాలో కూడా వచ్చిందని తెలిపారు. కేబినెట్‌లో ముఖ్యమంత్రి, మంత్రులు ఒకరిపై ఒకరు దూషించుకున్నారన్న తన వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నానని వెల్లడించారు. ఆటో డ్రైవర్లకు ఇచ్చిన హామీల అమలులో కాంగ్రెస్ సర్కార్ విఫలమైందన్నారు. ఆటో డ్రైవర్ల సమస్యలు తెలుసుకోవటానికే ఆటోలో ప్రయాణం అని మాజీ మంత్రి హరీష్ రావు వెల్లడించారు.


ఇవి కూడా చదవండి

బస్సు దగ్ధం ఘటన.. డెడ్‌బాడీస్ అప్పగింత పూర్తి

ముంచుకొస్తున్న మొంథా.. మూడు రోజులు సెలవులు

Read latest AP News And Telugu News

Updated Date - Oct 27 , 2025 | 01:02 PM