Telangana DGP: సీఎం రేవంత్ పిలుపు మేరకే మావోలు లొంగిపోయారు: డీజీపీ శివధర్ రెడ్డి
ABN , Publish Date - Dec 19 , 2025 | 03:21 PM
41 మంది మావోయిస్టులు పోలీసుల ముందు లొంగిపోయారని తెలంగాణ డీజీపీ శివధర్ రెడ్డి తెలిపారు. 24 ఆయుధాలతో వీరంతా సరెండర్ అయినట్లు చెప్పారు.
హైదరాబాద్, డిసెంబర్ 19: తెలంగాణలో భారీగా మావోయిస్టులు పోలీసుల ఎదుట లొంగిపోయారు. దాదాపు 41 మంది మావోయిస్టులు ఈరోజు (శుక్రవారం) డీజీపీ శివధర్ రెడ్డి ముందు సరెండర్ అయ్యారు. మావోయిస్టులు లొంగిపోవడంపై డీజీపీ మీడియాతో మాట్లాడుతూ... 24 ఆయుధాలతో 41 మంది మావోయిస్టులు పోలీసుల ముందు లొంగిపోయినట్లు తెలిపారు. ఏకే-47లు 3, ఎల్‌ఎమ్‌జీ 1, ఎస్‌ఎల్‌ఆర్ రైఫిళ్లు 5, ఇన్సాస్ రైఫిళ్ళు 7, బీజీఎల్ గన్ 1, 303 రైఫిళ్ళు 4, సింగిల్ షాట్ రైఫిల్ 1 , ఎయిర్ గన్స్ 2 మొత్తం 24 ఆయుధాలను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. లొంగిపోయిన 41 మందిలో ఇద్దరు తెలంగాణ వారు కాగా.. 39 మంది ఛత్తీస్‌గఢ్‌కు చెందిన వారు ఉన్నారన్నారు.
అలాగే 11 మంది గెరిల్లా ఆర్మీ బెటాలియన్ చెందిన వారు ఉన్నట్లు తెలిపారు. 24 ఏళ్లుగా అండర్ గ్రౌండ్‌లో ఉన్న తెలంగాణకు చెందిన ఎర్రోల్ల రవి అలియాస్ సంతోష్, ప్రవీణ్ లొంగిపోయారని అన్నారు. అలాగే కనికారుపు ప్రభంజన్ పార్టీ సభ్యుడు, పీడీఎస్ సభ్యుడు, రెండో రీజినల్ కమాండ్ ఆఫ్ తెలంగాణకు చెందిన 5 మంది, కొత్తగూడెం, అల్లూరు సీతరామరాజు డీవీసీ స్టేట్ కమిటీ క్యాడర్‌కు చెందిన నలుగురు సరెండర్ అయినట్లు చెప్పారు. అమరవీరుల దినోత్సవం సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చిన పిలుపు మేరకు మావోయిస్టులు లొంగుపోయారని డీజీపీ వెల్లడించారు.
ప్రాణాలు కాపాడుకోడానికి తెలియని ప్రదేశాలకు వెళ్లాలని మావోయిస్టు పార్టీ ఒత్తిడి చేసిందని.. ఇలాంటి పరిస్థితుల్లో వేరే ప్రాంతాలకు వెళ్లడం కష్టంగా భావించి మావోలంతా లొంగిపోయినట్లు తెలిపారు. డివిజనల్ కమిటీ సభ్యులకు రూ. 4 లక్షలు, సభ్యులకు రూ.4 లక్షల రివార్డు అందజేస్తున్నామన్నారు. ఆయుధాలతో లొంగిపోతే వారికి మరింత నగదును రివార్డ్స్ కింద అందజేస్తున్నామని చెప్పారు. కోటి 47 లక్షల రివార్డ్స్ అందిస్తున్నామని.. తక్షణ సహాయం కింద రూ.25 వేలు ఇస్తున్నట్లు తెలిపారు. తెలంగాణాలో ఈ ఏడాది 509 మంది మావోయిస్టులు లొంగిపోయారన్నారు. తెలంగాణకు చెందిన 54 మంది ఇంకా అజ్ఞాతంలో ఉన్నట్లు గుర్తించినట్లు తెలిపారు. ఇందులో 5 మంది సెంట్రల్ కమిటీలో ఉన్నారని , 8 మంది స్టేట్ కమిటీలో ఉన్నారన్నారు. అలాగే 13 మంది డివిజన్ కమిటీ , 12 మంది కిందిస్థాయిలో సభ్యులుగా ఉన్నట్లు చెప్పారు. వీరిలో 48 మంది వేరే రాష్ట్రాల్లో పని చేస్తున్నారని.. ఏడుగురు మాత్రమే తెలంగాణలో ఉన్నట్లు గుర్తించినట్లు డీజీపీ శివధర్ రెడ్డి పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి...
ఐటీ ఉద్యోగులే టార్గెట్‌గా గంజాయి సరఫరా.. చెక్ పెట్టిన పోలీసులు
సంక్షేమం పక్కనపెట్టి ఫుట్‌బాల్‌పై రూ.10 కోట్లు ఖర్చు.. సీఎం రేవంత్‌పై కవిత విమర్శలు
Read Latest Telangana News And Telugu News