Ponnam Prabhakar Goud: నగరంలో మరిన్ని ఇందిరమ్మ క్యాంటీన్లు...
ABN , Publish Date - Nov 29 , 2025 | 08:50 AM
హైదరాబాద్ నగరంలో రాబోయే రోజుల్లో మరిన్ని ఇందిరమ్మ క్యాంటీన్లు ఏర్పాటు చేస్తామని నగర ఇన్‌చార్జి మంత్రి పొన్నం ప్రభాకర్‌గౌడ్ తెలిపారు. ఆయన మాట్లాడుతూ.. ఈ క్యాంటీన్లను నిరుపేద ప్రజలు అందరూ సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.
హైదరాబాద్: నగరానికి ఉపాధికోసం వచ్చే కార్మికులకు ఇందిరమ్మ క్యాంటీన్లు ఎంతగానో దోహదపడ్డాయని, ఈ క్యాంటీన్లను నిరుపేద ప్రజలు అందరూ సద్వినియోగం చేసుకోవాలని నగర ఇన్‌చార్జి మంత్రి పొన్నం ప్రభాకర్‌గౌడ్(In-charge Minister Ponnam Prabhakar Goud) కోరారు. కవాడిగూడ కల్పన థియేటర్ వద్ద, బాగ్‌లింగంపల్లిలో నూతనంగా ఏర్పాటు చేసిన ఇందిరమ్మ క్యాంటీన్‌లను శుక్రవారం మంత్రి ప్రారంభించారు. మంత్రి మాట్లాడుతూ రాబోయే రోజుల్లో మరిన్ని ఇందిరమ్మ క్యాంటీన్లను విస్తరించేందుకు చర్యలు తీసుకోవాలని జీహెచ్‌ఎంసీ అధికారులను ఆదేశించారు.
అలాగే పొదుపు మహిళా సభ్యులు మరిన్ని గ్రూపులు పెంచాలని, త్వరలో వడ్డీలేని బ్యాంక్ రుణాలు ఇప్పిస్తామని మంత్రి హామీ ఇచ్చారు. భవిష్యత్‌లో ఇందిరమ్మ క్యాంటీన్లను మహిళా పొదుపు గ్రూపు సభ్యులకు అప్పగించి, వారి ఆర్థిక స్వావలంభనకు తోడ్పాడుటును అందిస్తామని తెలిపారు. మేయర్ గద్వాల విజయలక్ష్మి మాట్లాడుతూ నగరంలో అవసరమైన చోట ఇందిరమ్మ క్యాంటీన్లు ఏర్పాటు చేసి పేదల ఆకలి తీర్చేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు.

ఎంపీ అనిల్‌కుమార్‌యాదవ్, ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠాగోపాల్ మాట్లాడుతూ నగరంలోని పేదల ఆకలి తీర్చడానికి గత ప్రభుత్వం ప్రారంభించిన భోజన కేంద్రాలను ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం కొనసాగించడం అభినందనీయమన్నారు. ఈ సందర్భంగా క్యాంటీన్ల వద్ద కార్మికులు, ప్రజలతో కలిసి మంత్రి పొన్నం, మేయర్, ఎమ్మెల్యే, ఎంపీ అల్పాహారం స్వీకరించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ మోతే శ్రీలతారెడ్డి, కార్పొరేటర్లు జి.రచనశ్రీ, కె.రవిచారి, గౌసుద్దీన్, బీఆర్‌ఎస్ నాయకులు ముఠాజైసింహ, బీజేపీ నాయకులు జి.వెంకటేష్, మాజీ కార్పొరేటర్లు, పలుశాఖల అధికారులు పాల్గొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
Read Latest Telangana News and National News