Hyderabad: రోజూ 300 మంది.. ప్రభుత్వ ఆస్పత్రులకు క్యూ కడుతున్న బాధితులు
ABN , Publish Date - Dec 09 , 2025 | 11:36 AM
నగరంలో.. కుక్కలు స్వైరవిహరం చేస్తున్నాయి. ఎక్కడ పడితే అక్కడ కుక్కలు దర్శనమిస్తున్నాయి. దీంతో వీధుల్లోకి వెళ్లాలంటేనే భయపడాల్సిన పరిస్థితి నెలకొంది. ఒక్క హైదరాబాద్ నగరంలోనే రోజుకూ 300 వరకు కుక్కకాటు కేసులు నమోదవుతున్నాయంటే.. ఇక పరిస్థితి ఏంటో ఇట్టే ఊహించుకోవచ్చు.
- రేబిస్ సోకితే ప్రాణాపాయం..
- అందుబాటులో వ్యాక్సిన్
హైదరాబాద్ సిటీ: కుక్క కాటు కేసులు ఆస్పత్రుల్లో ఇటీవల పెరుగుతున్నాయి. ఐపీఎంకు, ఫీవర్ ఆస్పత్రికి బాధితులు క్యూ కడుతున్నారు. ప్రభుత్వ ఆస్పత్రులకు కుక్కకాటు బాధితులు రోజుకు 300 మందికి పైగా వస్తున్నారని, ప్రైవేట్ ఆస్పత్రుల్లో ఈ సంఖ్య మరింత ఎక్కువగా ఉంటుందని వైద్యులు అభిప్రాయపడుతున్నారు. కుక్కకాటుకు గురైన వారికి నారాయణగూడ ఐపీఎంలో టీకా సదుపాయం ఉంది. నల్లకుంట ఫీవర్ ఆస్పత్రిలో టీకాలు, వ్యాక్సిన్ వేస్తున్నారు. అన్ని ప్రభుత్వ, పట్టణ ప్రాథమిక, జిల్లా ఆస్పత్రుల్లో వ్యాక్సిన్లు అందుబాటులో ఉన్నాయి.
ఫీవర్ ఆస్పత్రికి క్యూ..
ఫీవర్ ఆస్పత్రికి కుక్క కాటు బాధితుల సంఖ్య రోజు రోజుకూ పెరుగుతోంది. ఆస్పత్రిలో కుక్కకాటు వ్యాక్సిన్ ఇవ్వడంతో పాటు రేబిస్ బాధితులకు చికిత్స అందిస్తున్నట్లు వైద్యులు తెలిపారు. ఫీవర్ ఆస్పత్రిలో 2023లో 27,172 మందికి చికిత్స అందించగా, 13 మంది రేబిస్‌తో చనిపోయారు. 2024లో 29,054 మందికి చికిత్స చేయగా, 16 మంది చనిపోయారు. ఈ ఏడాది 24,705 మందికి వైద్యం అందించారు. 34 మంది రేబి్‌సతో మృతిచెందారు.
- ఫీవర్ ఆస్పత్రికి రోజుకు సగటున 60 నుంచి 80 కేసులు వస్తున్నాయి. నెలలో ఒకటి, రెండు కేసులు రేబి్‌సకు సంబంధించినవి ఉంటున్నాయి. ప్రతీ ఏడాది 20 వేలమంది టీకాలు వేసుకుంటున్నారు.
- నారాయణగూడ ఐపీఎంకు ఈ ఏడాది ఇప్పటి వరకు 33,765 మంది కుక్కకాటు బాధితులకు వ్యాక్సిన్ ఇచ్చారు. ఐపీఎంను ప్రతీనెల 2,200 నుంచి 2,600 మంది కుక్కకాటు బాధితులు ఆశ్రయిస్తున్నారు.
- హయత్‌నగర్ ఆస్పత్రిలో నెలకు 400 మంది చికిత్స పొందుతున్నారు. వనస్థలిపురం ఆస్పత్రికి నెలకు 275-300 మందికి కుక్కకాటు టీకాలు వేస్తున్నారు.
- రాజేంద్రనగర్ ఆరోగ్య కేంద్రంలో నెలకు 90-100 మంది, హయత్‌నగర్ నెలకు 300 మంది టీకాలు వేయించుకుంటున్నట్లు వైద్య వర్గాలు తెలిపాయి.

- శేరిలింగంపల్లి, కుత్బుల్లాపూర్, దుండిగల్, షాపూర్‌నగర్, సూరారం ఆరోగ్య కేంద్రాలకు రోజుకు 5 నుంచి 10 మంది కుక్కకాటు బాధితులు వెళ్తున్నారు.
- పట్టణ, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో రోజుకు పది మందికిపైగా కుక్కకాటు బాధితులు వ్యాక్సిన్లు వేయించుకుంటున్నారు.
- కింగ్‌కోఠి, అమీర్‌పేట ప్రభుత్వ జిల్లా ఆస్పత్రులు, కొండాపూర్, వనస్థలిపురం, హయత్‌నగర్ ఆస్పత్రులతోపాటు, కుత్బుల్లాపూర్, దుండిగల్, షాపూర్‌నగర్, సూరారం, శేరిలింగంపల్లి, హఫీజ్‌పేట, రాయదుర్గం ఆరోగ్య కేంద్రాలలో కుక్కకాటుకు వ్యాక్సిన్ వేస్తున్నారు.
- ఫీవర్ ఆస్పత్రికి రేబిస్ బాధితుల సంఖ్య పెరుగుతుంది. ప్రతీనెల ఒకరిద్దరు ఆస్పత్రిలో చేరుతున్నారు.
- బాధితులకు ఫీవర్ ఆస్పత్రిలో లైఫ్ సేవింగ్ టీకాలు ఇమ్యున్ గ్లోబులిన్ వ్యాక్సిన్ వేస్తున్నారు.
కుక్క కరిస్తే..
కుక్క కరిస్తే వెంటనే ఫస్ట్ ఎయిడ్ చేసుకుని వైద్యుడి వద్దకు వెళ్లి టీటీ ఇంజెక్షన్ చేయించుకోవాలి. తర్వాత టీకా, వ్యాక్సిన్ వేయించుకోవాలి. కుక్క కాటుకు గురైన వారికి యాంటీరెబీస్ వ్యాక్సిన్(ఏఆర్వీ), రేబీస్ ఇమ్యునోగ్లాబులిన్(రిగ్)వ్యాక్సిన్‌లు ఇస్తామని వైద్యులు తెలిపారు.
లక్షణాలు..
రేబిస్ ఉన్న కుక్కలకు నోటికి ఇరు వైపుల నుంచి లాలా జలం కారుతుంది. మనుషులకు సాధారణంగా ఒక వైపు నుంచి సొంగ కారుతుంది, రేబిస్ వ్యాధి ఉన్న వారిలో రెండు వైపుల నుంచి లాలా జలం వస్తుందని డాక్టర్ చెప్పారు. రేబిస్ ఉన్న వ్యక్తుల మనసత్వం ఇరిటేషన్‌గా ఉంటుంది.
చిట్కా వైద్యం వద్దు
- కుక్క కరచిన చోట కారం, పసుపు వంటివి వేసి కట్టు కట్టవద్దు
- సొంత వైద్యం, చిట్కా, నాటు వైద్యం చేయొద్దు
- కుక్క కరిసిన ప్రాంతాన్ని డెటాయిల్, సబ్బుతో శుభ్రంగా కడగాలి
- కుక్క కరిచిన భాగంలో ఆయింటిమెంట్ పెట్టాలి.
తీవ్రతను బట్టి వ్యాక్సిన్..
రేబిస్ వ్యాధి సోకితే ప్రాణానికి ముప్పు. పిచ్చికుక్క, వీధికుక్కలు, పెంపుడు కుక్కలు కరిచినా వెంటనే వైద్య చికిత్సలు తీసుకోవాలి. టీకా వేయించుకున్న తర్వాత 48 గంటల్లోగా తీవ్రతను బట్టి ఇమ్యున్ గ్లోబులిన్(రిగ్)వ్యాక్సిన్ తీసుకోవాలి. రేబిస్ వ్యాధి ఉన్న కుక్క కరిస్తే దానికి అనుగుణంగా అవసరమైన వ్యాక్సిన్ వేయించుకోకపోతే ఈ వ్యాధి బారిన పడే ప్రమాదం ఉంది. రేబీస్ సోకిన వారిలో జ్వరం, కన్ఫ్యూజన్, యాంగ్జయిటీతో పాటు హైడ్రో ఫోబియా, ఫొటో ఫోబియా, ఎయిర్ ఫోబియా ఉంటాయి.
- డాక్టర్ అర్జున్ రాజ్, చైర్మన్ సోషల్
మీడియా, ఐఎంఎ హైదరాబాద్ సిటీ బ్రాంచ్
ఈ వార్తలు కూడా చదవండి..
స్వల్పంగా పెరిగిన బంగారం ధరలు.. ఈ రోజు ఎలా ఉన్నాయంటే..
తుప్పు నష్టం రూ 8.8 లక్షల కోట్లు
Read Latest Telangana News and National News