Share News

Corrosion Loss India: తుప్పు నష్టం రూ 8.8 లక్షల కోట్లు

ABN , Publish Date - Dec 09 , 2025 | 06:25 AM

వాతావరణపరమైన కారణాలతో వాహనాలు, పరిశ్రమలు, మౌలిక వసతులకు తుప్పు పట్టడం ద్వారా ఏటా జీడీపీలో 5 శాతం లేదా 10 వేల కోట్ల డాలర్ల (రూ.8.8 లక్షల కోట్లు) నష్టం వాటిల్లుతోందని వివిధ అధ్యయనాల్లో...

Corrosion Loss India: తుప్పు నష్టం రూ 8.8 లక్షల కోట్లు

న్యూఢిల్లీ: వాతావరణపరమైన కారణాలతో వాహనాలు, పరిశ్రమలు, మౌలిక వసతులకు తుప్పు పట్టడం ద్వారా ఏటా జీడీపీలో 5 శాతం లేదా 10 వేల కోట్ల డాలర్ల (రూ.8.8 లక్షల కోట్లు) నష్టం వాటిల్లుతోందని వివిధ అధ్యయనాల్లో తేలింది. వాహనాలు, మౌలిక వసతులు, పారిశ్రామిక వ్యవస్థలను తుప్పు తీవ్రంగా ప్రభావితం చేస్తున్నట్టు నిపుణులు చెబుతున్నారు. తుప్పు కారణంగా సాధారణ కార్ల యజమానులకు వాహనం కొన్న తర్వాత కొద్ది సంవత్సరాలకే మరమ్మత్తు బిల్లులు పెరిగిపోతున్నాయి. వాహనాల నాణ్యత వేగంగా దిగజారి రీసేల్‌ విలువ గణనీయం గా పడిపోతోంది. ఆ రకంగా వారిపై విపరీతమైన భారం పడుతోందని నిపుణులు తెలిపారు. వాహనాలకు గాల్వనైజ్డ్‌ స్టీల్‌ (తుప్పు నుంచి రక్షణ కల్పించే నాణ్యత గల ఉక్కు) ఉపయోగించే విషయంలో దేశీయ, ఎగుమతి మార్కెట్లకు ఒకే తరహా నిబంధనలుండాలని వారు సూచిస్తున్నారు. యూరప్‌, జపాన్‌, ఉత్తర అమెరికా, ఆఫ్రికా మార్కెట్లకు ఎగుమతి చేయడానికి ఉత్పత్తి చేసే వాహనాల్లో 70ు, ఆ పై బడిన స్థాయిలో గాల్వనైజ్డ్‌ స్టీల్‌ ఉపయోగిస్తున్నారని, దానికి అదనంగా ఆరున్నర సంవత్సరాల యాంటీ కరోజన్‌ వారెంటీలు ఇస్తున్నారని వారన్నారు. అదే భారత మార్కెట్‌ కోసం తయారుచేసే కార్లలో గాల్వనైజ్డ్‌ స్టీల్‌ వినియోగం చాలా తక్కువగా ఉంటోందని, ఇక వారెంటీ అయితే నామమాత్రంగా కూడా కల్పించడంలేదని వారు చెప్పారు. గాల్వనైజ్డ్‌ స్టీల్‌తో తయారుచేసే వాహనాలకు అదనంగా అయ్యే వ్యయం 0.1ు కన్నా తక్కువేనని, కాని మరమ్మత్తుల కోసం చేసే వేలాది రూపాయల వ్యయాన్ని నివారించగలుగుతారని అంటున్నారు. వాహనాలకు తుప్పు పట్టడం వల్ల చాసిస్‌, సస్పెన్షన్‌ మౌంట్లు, జాయింట్లు బలహీనమై ప్రయాణికుల భద్రతకు కూడా ముప్పు ఏర్పడుతుందని వారు హెచ్చరించారు. అయితే సెంట్రల్‌ మోటార్‌ వాహనాల నిబంధనలు (సీఎంవీఆర్‌) గాని, భారత ప్రమాణాల సంస్థ నిబంధనలు గాని వాహనాలకు తుప్పు నిరోధక స్థాయిలు లేదా గాల్వనైజేషన్‌ ఉక్కు వినియోగ శాతా న్ని నిర్ధారించకపోవడం విచారకరమని వారంటున్నారు. జింక్‌ కోటింగ్‌ వేసిన ఉక్కు షీట్లు కార్ల బాడీని తుప్పు నుంచి రక్షిస్తాయని ఇండియా లెడ్‌ జింక్‌ డెవల్‌పమెంట్‌ అసోసియేషన్‌ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ ఎల్‌.పుహళేంది అన్నారు.

ఇవీ చదవండి:

ఏఐతో లేఆఫ్స్ భయాలు.. ఐబీఎమ్ సీఈఓ కీలక కామెంట్స్

ఎస్‌ఐపీ పెట్టుబడుల ఆకర్షణలో పడి ఈ తప్పు చేయొద్దు.. ఓ ఇన్వెస్ట్‌మెంట్ సంస్థ అధికారి సూచన

మరిన్ని బిజినెస్, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Dec 09 , 2025 | 06:25 AM