IT Layoffs - Reasons: ఏఐతో లేఆఫ్స్ భయాలు.. ఐబీఎమ్ సీఈఓ కీలక కామెంట్స్
ABN , Publish Date - Dec 07 , 2025 | 05:45 PM
ఏఐతో లేఆఫ్స్ పెరుగుతున్నాయన్న భయాల నడుమ ఐబీఎమ్ సీఈఓ అరవింద్ కృష్ణ కీలక వ్యాఖ్యలు చేశారు. కరోనా సంక్షోభ సమయంలో పెద్ద ఎత్తున జరిగిన ఉద్యోగ నియామకాలకు ప్రస్తుతం దిద్దుబాట్లు చూస్తున్నామని అన్నారు. ఏఐతో ప్రభావం కొంత ఉన్నప్పటికీ అదొక్కటే ప్రధాన కారణం కాదని అన్నారు.
ఇంటర్నెట్ డెస్క్: టెక్ రంగంలో కొనసాగుతున్న లేఆఫ్స్ ఐటీ ఉద్యోగులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. ఏఐ వినియోగం పెరగడం ఈ పరిస్థితికి ఓ ప్రధాన కారణమన్న కథనాలు మీడియాలో కనిపిస్తున్నాయి. ఈ అంశంపై ఐబీఎమ్ సంస్థ సీఈఓ అరవింద్ కృష్ణ తాజా ఇంటర్వ్యూలో స్పందించారు (IBM CEO On Layoffs)
టెక్ రంగంలో లేఆఫ్స్‌కు ప్రధాన కారణం కృత్రిమ మేథ అన్న భావన పొరపాటని ఐబీఎమ్ సీఈఓ అరవింద్ కృష్ణ (Aravind Krishna) స్పష్టం చేశారు. 2020-23 మధ్య కాలంలో కంపెనీలు భారీ స్థాయిలో ఉద్యోగులను నియమించుకున్నాయని అన్నారు. నాటి పరిణామాల ఫలితంగా నేడు దిద్దుబాట్లు చూస్తున్నామని చెప్పారు. ఏఐ ప్రభావం కూడా కొంత ఉందని అంగీకరించారు. అయితే, ఇవి కొత్త సాంకేతికతకు అనుగుణంగా మార్కెట్‌లో జరుగుతున్న మార్పులగా అభివర్ణించారు. ఈ పరిణామం ఏమీ విపత్తు కాదని తేల్చి చెప్పారు.
‘మీరు నాటి లెక్కలను చూస్తే అప్పట్లో భారీగా ఉద్యోగ నియామకాలు జరిగాయి. కరోనా సమయంలో, ఆ మరుసటి ఏడాది నియామకాలు భారీగా పెరిగాయి. కొన్ని కంపెనీల్లో ఉద్యోగుల సంఖ్య 30 శాతం, 40 శాతం, మరికొన్నింటిలో ఏకంగా 100 శాతం మేర పెరిగింది. ఆ తరువాతి కాలంలో డిమాండ్ తగ్గింది. కంపెనీల ప్రాధాన్యతలు మారాయి. ఈ పరిస్థితుల్లో దిద్దుబాట్లు సహజమే. ఏ వ్యాపారమూ పూర్తి సమగ్రమంగా ఉండదు. విస్తరణ పరిమితి దాటినప్పుడు దిద్దుబాట్లు కూడా తప్పవు. మళ్లీ డిమాండ్‌కు, అభివృద్ధికి మధ్య సమతౌల్యం వస్తుంది’ అని అన్నారు.
ఏఐ ప్రభావం కూడా కొంత ఉందని ఆయన వివరించారు. రాబోయే రెండు మూడేళ్లల్లో ఏఐ వల్ల అమెరికాలో 10 శాతం వరకూ జాబ్స్ ప్రభావితమవుతాయని అన్నారు. మీడియా వార్తల్లో కనిపిస్తున్నట్టు ప్రళయం ఏమీ రాదని తేల్చి చెప్పారు. ఏఐ ప్రభావం కొన్ని రంగాలపై ఎక్కువగా ఉంటుందని వివరించారు. కృత్రిమ మేధ వల్ల ఉత్పాదకత పెరుగుతుందని, ఉద్యోగ సృష్టి జరుగుతుందని అన్నారు. ఏఐ వినియోగం పెరిగే కొద్దీ ఓవర్‌సైట్, స్ట్రాటజీ, ప్రాడక్ట్ డిజైన్, తదితర విభాగాల్లో అవకాశాలు అందుబాటులోకి వస్తాయన్నారు.
ఇవీ చదవండి:
ఎస్‌ఐపీ పెట్టుబడుల ఆకర్షణలో పడి ఈ తప్పు చేయొద్దు.. ఓ ఇన్వెస్ట్‌మెంట్ సంస్థ అధికారి సూచన
భారత సంతతి వ్యక్తికి యాపిల్ సంస్థలో కీలక బాధ్యతలు
మరిన్ని బిజినెస్, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి