Share News

SIP - Risks: ఎస్‌ఐపీ పెట్టుబడుల ఆకర్షణలో పడి ఈ తప్పు చేయొద్దు.. ఓ ఇన్వెస్ట్‌మెంట్ సంస్థ అధికారి సూచన

ABN , Publish Date - Dec 02 , 2025 | 02:51 PM

క్రమానుగత పెట్టుబడుల విషయంలో నేటి తరం చేస్తున్న తప్పు ఏమిటో వివరిస్తూ ఓ ఇన్వెస్ట్‌మెంట్ సంస్థ ఎగ్జిక్యూటివ్ నెట్టింట పోస్టు ప్రస్తుతం వైరల్‌గా మారింది. ఎస్‌ఐపీల వెంట పరుగులుతీస్తూ ఇతర పెట్టుబడి సాధనాలను నిర్లక్ష్యం చేయొద్దని సూచించారు.

SIP - Risks: ఎస్‌ఐపీ పెట్టుబడుల ఆకర్షణలో పడి ఈ తప్పు చేయొద్దు.. ఓ ఇన్వెస్ట్‌మెంట్ సంస్థ అధికారి సూచన
SIP - Investment Tips

ఇంటర్నెట్‌ డెస్క్: మిలినీయల్స్‌లో అనేక మంది క్రమానుగత పెట్టుబడుల వైపు మళ్లుతున్నారు. దీంతో రాబడి అధికమని, భవిష్యత్తుపై భరోసా ఉంటుందని విశ్వసిస్తున్నారు. అయితే, ఎస్‌ఐపీల విషయంలో అప్రమత్తంగా ఉండాలని అన్షీ శ్రీవాస్తవ హెచ్చరించారు. 1 ఫైనాన్స్ సంస్థలో పర్సనల్ ట్రెయినింగ్ విభాగం హెడ్‌గా ఉన్న ఆమె మిలీనియల్స్ తరంలో ఉన్న కొన్ని తప్పుడు అభిప్రాయాలను తొలగించే ప్రయత్నం చేశారు.

ఎస్ఐపీల వాస్తవ పనితీరుకు, వాటిపై యువతకు ఉన్న అంచనాలకు మధ్య వ్యత్యాసం ఉంటోందని అన్షీ తెలిపారు. ఎస్‌ఐపీలపై నమ్మకం అతివిశ్వాసంగా మారిందని అన్నార. అనేక రకాల థర్డ్ పార్టీ యాప్‌లు అందుబాటులోకి రావడంతో ఎస్ఐపీలపై పెట్టుబడి మరింత సులభంగా మారిందని అన్నారు. గతాన్ని చూసుకుంటే 10 ఏళ్ల కాలపరిమితి గల ఈక్విటీ ఎస్‌ఐపీలు కూడా ఏటా జస్ట్ 6-8 శాతం లాభాలనే ఇచ్చిన దాఖలాలు ఉన్నాయని అన్నారు. 2008-2018 నాటి కాలాన్ని ఈ సందర్భంగా ఉదహరించారు. అప్పట్లో ఎఫ్‌డీల స్థాయి రాబడులు కూడా ఎస్‌ఐపీల ద్వారా రాలేదని చెప్పారు.

ఇక యువతలో అనేక మంది 18 నుంచి 20 శాతం వడ్డీ వస్తుందన్న ఆశతో స్మాల్ క్యాప్, మీడియా క్యాప్ ఫండ్స్‌పై పెట్టుబడులు కుమ్మరిస్తు్న్నారని తెలిపారు. అయితే, ఇవి ఒక్క ఏడాదిలో 40 శాతం మేర పడిపోయే ఛాన్స్ ఉందన్న విషయం మర్చిపోవద్దని హెచ్చరించారు. 2020, 2022ల్లో సరిగ్గా ఇదే జరిగిన విషయాన్ని గుర్తు చేశారు.


ఎస్‌ఐపీలు ఆర్థిక భద్రతకు గ్యారెంటీ ఏమీ కాదని కూడా శ్రీవాత్సవ హెచ్చరించారు. రిస్క్‌ తక్కువగా ఉండే ఈపీఎఫ్, ఎన్‌పీఎస్, పీపీఎఫ్ లాంటి పెట్టుబడి సాధనాలపై నిర్లక్ష్యం వద్దని కూడ సూచించారు. అసలైన భద్రతను ఇచ్చే వాటిని పక్కనపెట్టొద్దని హెచ్చరించారు. ఏటా కాంపౌండింగ్ సదుపాయం ఉండే ఈపీఎఫ్‌తో ప్రస్తుతం 8.25 శాతం వడ్డీ వస్తున్న విషయాన్ని మర్చిపోవడం విచారకరమని అన్నారు.

అయితే, ఆర్థిక క్రమశిక్షణ ఉన్న వారికి ఎస్‌ఐపీలతో మంచి లాభం కలుగుతుందని కూడా నిపుణులు చెబుతున్నారు. ఓర్పుతో ఉంటే దీర్ఘకాలంలో మంచిరాబడులు వస్తాయని అంటున్నారు. వివిధ మార్కెట్ ఆధారిత పెట్టుబడి సాధనాల మధ్య సమతౌల్యం పాటిస్తూ పెట్టుబడులు కొనసాగిస్తే జీవితానికి భద్రత లభిస్తుందని భరోసా ఇస్తున్నారు.


ఇవీ చదవండి:

ర్యాలీకి చిన్న బ్రేక్.. స్వల్పంగా తగ్గిన పుత్తడి ధరలు

భారత సంతతి వ్యక్తికి యాపిల్ సంస్థలో కీలక బాధ్యతలు

మరిన్ని బిజినెస్, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Dec 02 , 2025 | 10:50 PM