Share News

Road Accident: అమెరికాలో రోడ్డు ప్రమాదం హైదరాబాద్‌ యువతి దుర్మరణం

ABN , Publish Date - Aug 13 , 2025 | 05:31 AM

ఉన్నత విద్య కోసం హైదరాబాద్‌ నుంచి అమెరికా వెళ్లిన ఓ యువతి అక్కడ జరిగిన రోడ్డు ప్రమాదంలో మరణించింది.

Road Accident: అమెరికాలో రోడ్డు ప్రమాదం హైదరాబాద్‌ యువతి దుర్మరణం

  • రోడ్డుపై నడిచి వెళుతుండగా ఢీకొట్టిన ట్రక్కు

దుండిగల్‌, సిద్దిపేట రూరల్‌, ఆగస్టు 12 (ఆంధ్రజ్యోతి): ఉన్నత విద్య కోసం హైదరాబాద్‌ నుంచి అమెరికా వెళ్లిన ఓ యువతి అక్కడ జరిగిన రోడ్డు ప్రమాదంలో మరణించింది. సిద్దిపేట జిల్లా రావురూకలకు చెందిన లక్కర్సు శ్రీనివాస్‌ వర్మ, హేమలత దంపతులకు శ్రీజవర్మ(23), శ్రియ వర్మ కుమార్తెలున్నారు. 16 ఏళ్ల క్రితం హైదరాబాద్‌ వచ్చిన ఈ కుటుంబం గండిమైసమ్మలోని బాలాజీనగర్‌లో ప్రస్తుతం నివాసముంటోంది. శ్రీనివాస్‌ బొరంపేటలోని ఓక్రిడ్జ్‌ పాఠశాలలో ట్రాన్స్‌పోర్ట్‌ ఇన్‌చార్జిగా పనిచేస్తుండగా హేమలత ఓ ప్రైవేటు సంస్థలో పని చేస్తున్నారు. ఇక, దుండిగల్‌లోని ఏరోనాటికల్‌ కళాశాలలో ఇంజనీరింగ్‌ పూర్తి చేసిన శ్రీజ వర్మ ఎంఎస్‌ చదివేందుకు మూడేళ్ల క్రితం అమెరికా వెళ్లారు. అక్కడ చదువు పూర్తి చేసుకున్న శ్రీజ.. ప్రస్తుతం ఉద్యోగ ప్రయత్నంలో ఉన్నారు.


స్నేహితులతో కలిసి షికాగోలో నివాసముంటున్న శ్రీజ వర్మ.. సోమవారం రాత్రి తొమ్మిది గంటలప్పుడు(అమెరికా కాలమాన ప్రకారం) స్నేహితురాలితో కలిసి రెస్టారెంట్‌కు నడిచి వెళ్తుండగా వెనుక నుంచి వచ్చిన ఓ ట్రక్కు ఢీకొనడంతో ప్రాణాలు కోల్పోయారు. అయితే, ఎప్పట్లాగే శ్రీనివాస్‌ వర్మ.. మంగళవారం ఉదయం శ్రీజకు ఫోన్‌ చేయగా ఆమె స్పందించలేదు. దీంతో శ్రీజ స్నేహితులకు ఫోన్‌ చేయగా కుమార్తె మరణవార్త తెలిసింది. కూతురి హఠాన్మరణంతో శ్రీనివాస్‌ వర్మ దంపతులు తీవ్ర శోకంలో మునిగిపోయారు. కాగా, శ్రీజ వర్మ మృతదేహాన్ని స్వదేశానికి రప్పించేందుకు సాయం చేయాలని శ్రీనివాస్‌ వర్మ దంపతులు రాష్ట్ర ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు.


ఈ వార్తలు కూడా చదవండి..

బీసీ గర్జన సభను మరోసారి వాయిదా వేసిన బీఆర్ఎస్

మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం.. సీఎం చంద్రబాబు కీలక సూచనలు

Read Latest Telangana News And Telugu News

Updated Date - Aug 13 , 2025 | 05:31 AM