H-City Project: హెచ్-సిటీలో.. 2400 కోట్ల ప్రాజెక్టులు
ABN , Publish Date - Feb 15 , 2025 | 04:11 AM
రాజధాని నగరంలో ప్రధాన కూడళ్లు, మార్గాల్లో సిగ్నల్ చిక్కులు లేని ప్రయాణం, ట్రాఫిక్ ఇబ్బందులకు చెక్ పెట్టేలా ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపడుతున్న ప్రాజెక్టుల్లో కీలక అడుగు పడుతోంది.

పురపాలక శాఖ గ్రీన్ సిగ్నల్
నెలాఖరులోపు టెండర్లకు రంగం సిద్ధం
సీఎం సమీక్షించిన మర్నాడే నిర్ణయం
ట్రాఫిక్ సమస్యలకు చెక్ పెట్టేందుకు..
10 ప్రాంతాల్లో 13.56 కి.మీ. వంతెనలు
6 చోట్ల 6.58 కి.మీ. రహదారుల విస్తరణ
కేబీఆర్ పార్కు చుట్టూ వంతెనలకు మోక్షం!
హైదరాబాద్ సిటీ, ఫిబ్రవరి 14 (ఆంధ్రజ్యోతి): రాజధాని నగరంలో ప్రధాన కూడళ్లు, మార్గాల్లో సిగ్నల్ చిక్కులు లేని ప్రయాణం, ట్రాఫిక్ ఇబ్బందులకు చెక్ పెట్టేలా ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపడుతున్న ప్రాజెక్టుల్లో కీలక అడుగు పడుతోంది. హైదరాబాద్ సిటీ ఇన్నోవేటివ్ ట్రాన్స్‌ఫర్మేటివ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ (హెచ్-సిటీ) ప్రాజెక్టుల్లో రూ.2400 కోట్ల పనులకు టెండర్లు పిలిచేందుకు పురపాలక శాఖ పచ్చజెండా ఊపింది. ఈ పనులకు సంబంధించి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సమీక్ష నిర్వహించిన మరునాడే టెండర్లపై నిర్ణయం తీసుకుంది. దీంతో పది ప్రాంతాల్లో 13.56 కిలోమీటర్ల మేర వంతెనలు, ఆరు ఏరియాల్లో 6.58 కిలోమీటర్ల మేర రహదారుల విస్తరణ పనులకు నెలాఖరులోపు టెండర్ నోటిఫికేషన్ ప్రకటించేందుకు జీహెచ్‌ఎంసీ రంగం సిద్ధం చేస్తోంది. పలు ప్రాంతాల్లో వంతెనలు, అండర్‌పా్‌సలు, రహదారుల విస్తరణ పనులకు రూ.7,032 కోట్లతో ప్రభుత్వం గతంలోనే పాలనా పరమైన అనుమతులు జారీ చేసింది. ఈ మేరకు దశల వారీగా ప్రాజెక్టులు చేపట్టనుండగా.. ట్రాఫిక్ జామ్ సమస్య ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో మొదటి విడత పనులు చేయాలని నిర్ణయించారు. తొలి విడతలో మొత్తం 16 చోట్ల 20.14 కిలోమీటర్ల మేర రూ.2400 కోట్లతో ప్రాజెక్టుల నిర్మాణం ప్రారంభించనున్నారు. ఆయా ప్రాజెక్టుల కోసం ఇప్పటికే క్షేత్రస్థాయిలో ఆస్తుల సేకరణ ప్రక్రియ ప్రారంభమైంది. రహదారి అభివృద్ధి ప్రణాళిక(ఆర్‌డీపీ)ను సిద్ధం చేసిన అధికారులు.. పలు మార్గాల్లో రోడ్డు విస్తరణ కోసం మార్కింగ్ కూడా చేశారు. ఏకకాలంలో అటు ఆస్తుల సేకరణ, టెండర్ ప్రక్రియ కొనసాగించాలని నిర్ణయించారు. ప్రాజెక్టుల పనులు వీలైనంత త్వరగా ప్రారంభించాలని సీఎం ఆదేశించారు. పనులు జరుగుతున్న సమయంలో పౌరులకు ఎక్కువ ఇబ్బందులు కలగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. దీంతో తదనుగుణంగా క్షేత్రస్థాయిలో పనులు చేపట్టేలా అధికారులు కసరత్తు చేస్తున్నారు.
కేబీఆర్ పార్కు చుట్టూ..
కోర్ ఏరియాలోని పలు ప్రాంతాల నుంచి ఐటీ కారిడార్ వైపు రాకపోకలు సాగించేవారు కేబీఆర్ పార్కు చుట్టూ ఉన్న జంక్షన్లలో ఇబ్బందులు పడుతున్నారు. దీంతో పార్కు చుట్టూ ఉన్న ఆరు చౌరస్తాల్లో సిగ్నల్ చిక్కులు లేని ప్రయాణం కోసం వంతెనలు, అండర్‌పా్‌సల నిర్మాణాన్ని జీహెచ్‌ఎంసీ ప్రతిపాదించింది. తక్కువ ఆస్తుల సేకరణ, వేగంగా పనులు జరిగేలా స్టీల్ వంతెనలు నిర్మించనున్నారు. దీంతో అంచనా వ్యయం రూ.860 కోట్ల నుంచి రూ.1,090 కోట్లకు పెరిగింది. రెండు ప్యాకేజీలుగా ఇక్కడి ప్రాజెక్టుల కోసం టెండర్లు పిలవనున్నారు. కేబీఆర్ పార్కు జాతీయ ఉద్యానవనం కావడం, ప్రా జెక్టుల కోసం చెట్లు తొలగిస్తే పర్యావరణంపై ప్రభా వం పడుతుందంటూ పలువురు కోర్టుకు వెళ్లడంతో రోడ్డు విస్తరణ ప్రణాళికను అధికారులు మార్చారు. పార్కు వైపు వాక్‌వేలోని చెట్లనూ ముట్టుకోవద్దని నిర్ణయించారు. సెంట్రల్ మీడియన్, మరోవైపు ఉన్న 1942 చెట్లను తొలగించాల్సి ఉంటుందని గుర్తించారు. ప్రస్తుతం కేసు కోర్టు విచారణలో ఉండగా.. పార్కు వైపు సేకరణ లేని దృష్ట్యా.. టెండర్ ప్రక్రియ ప్రారంభించాలని ప్రభుత్వ అడ్వకేట్ జనరల్ బల్దియాకు సూచించినట్టు తెలిసింది. సర్కారు కూడా గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో త్వరలో బిడ్‌లు ఆహ్వానిస్తామని ఓ అధికారి తెలిపారు. ప్రాజెక్టుల్లో భాగంగా బంజారాహిల్స్ విరించి చౌరస్తా నుంచి జూబ్లీ చెక్‌పోస్ట్ చౌరస్తా వరకు ఆర్‌డీపీ సిద్ధమైంది. ఈ మార్గంలో 303 ఆస్తులను మార్కింగ్ చేయగా.. 45 మంది వరకు సుముఖత వ్యక్తం చేసినట్టు పట్టణ ప్రణాళికా విభాగం వర్గాలు చెబుతున్నాయి. మాజీ మంత్రి జానారెడ్డి, ప్రముఖ నటుడు నందమూరి బాలకృష్ణ తదితర ప్రముఖులు తమ ఆస్తుల సేకరణకు సానుకూలంగా స్పందించినట్టు తెలిసింది.
రూ.837 కోట్లతో వంతెనలు..
ఐటీ కారిడార్‌లోని పలు ప్రాంతాల్లో మరిన్ని వంతెనలు, అండర్‌పా్‌సలు అందుబాటులోకి రానున్నాయి. ఖాజాగూడ, ఐఐఐటీ, విప్రో జంక్షన్ల వద్ద రూ.837 కోట్లతో ఫ్లై ఓవర్లు, గ్రేడ్ సెపరేటర్లు నిర్మించనున్నారు. దీంతో ఆయా మార్గాల్లో వాహనాల రాకపోకలు సులువు కానున్నాయి. సైబారాబాద్ సీపీ కార్యాలయం నుంచి గచ్చిబౌలి జంక్షన్ వరకు పాత ముంబై రహదారిని 215 అడుగులు, గచ్చిబౌలి- మియాపూర్ రహదారిలోని అంజయ్యనగర్ నుంచి రాంకీ టవర్స్ వరకు 150 అడుగుల మేర రోడ్లను రూ.70 కోట్లతో విస్తరించనున్నారు. చాంద్రాయణగుట్ట నియోజకవర్గంలో అజీమ్ హోటల్ నుంచి చర్చ్ గేట్, లక్కీ స్టార్ హోటల్ నుంచి హఫీజ్‌బాబా నగర్, తులసినగర్ నుంచి గౌస్‌నగర్, చాంద్రాయణగుట్ట ఎక్స్ రోడ్ నుంచి చాంద్రాయణగుట్ట పోలీ్‌సస్టేషన్ మీదుగా బార్కస్ వరకు రూ.320 కోట్లతో రహదారులను విస్తరించనున్నారు. ఈ పనులకు టెండర్ నోటిఫికేషన్ ప్రకటిస్తారు.
త్వరలో టెండర్లు పిలవనున్న ప్రాజెక్టులు..
నియోజకవర్గం వంతెన/అండర్‌పాస్ పొడవు
(పార్లమెంటు/అసెంబ్లీ) నిర్మించే జంక్షన్ కి.మీలలో
సికింద్రాబాద్/ జూబ్లీహిల్స్ చెక్‌పోస్ట్ 2.25
ఖైరతాబాద్ కేబీఆర్ పార్కు, ముగ్ద 1.49
రోడ్ నెంబర్-45 0.79
ఫిల్మ్‌నగర్ 1.03
మహారాజా అగ్రసేన్ 1.00
కేన్సర్ ఆస్పత్రి 0.87
చేవెళ్ల/ ఖాజాగూడ 1.52
శేరిలింగంపల్లి ఐఐఐటీ 3.25
విప్రో 1.05
మల్కాజిగిరి/ పైపులైన్ రోడ్ 0.31
కుత్బుల్లాపూర్ ఫాక్స్ సాగర్ నాలాపై (బ్రిడ్జి)
మొత్తం 13.56
రహదారి విస్తరణ...
నియోజకవర్గం కారిడార్ పొడవు
(పార్లమెంటు/అసెంబ్లీ) కి.మీలలో
చేవెళ్ల/శేరిలింగంపల్లి సైబరాబాద్ సీపీ ఆఫీస్ నుంచి
గచ్చిబౌలి జంక్షన్ వరకు 210 అడుగులు 0.985
అంజయ్యనగర్ నుంచి రాంకీ టవర్స్
150 అడుగులు 0.8
హైదరాబాద్/ అజీమ్ హోటల్ నుంచి చర్చి గేట్
చాంద్రాయణగుట్ట 80 అడుగులు 0.65
లక్కీ స్టార్ హోటల్ నుంచి హఫీజ్‌బాబా
నగర్ వయా పూల్‌బాగ్ 60, 40 అడుగులు 1.2
తులసినగర్ నుంచి గౌస్ నగర్ 100 అడుగులు 2.5
చాంద్రాయణగుట్ట ఎక్స్ రోడ్ నుంచి
బార్కస్ రోడ్ 60 అడుగులు 0.45
మొత్తం 6.585
గ్రాండ్ టోటల్ 20.145
ఈ వార్తలు కూడా చదవండి..
తిరుపతి జిల్లా: నారావారిపల్లెలో విషాదం
ప్రభుత్వం నిరుపేదల గురించి ఆలోచించదా..: హరీష్‌రావు
Read Latest AP News and Telugu News
Read Latest Telangana News and National News
Read Latest Chitrajyothy News and Sports News