Share News

HMDA: భూముల వేలానికి హెచ్‌ఎండీఏ నగారా!

ABN , Publish Date - Aug 21 , 2025 | 04:15 AM

హైదరాబాద్‌ మహానగర అభివృద్ధి సంస్థ (హెచ్‌ఎండీఏ) మరోసారి ప్లాట్లు, స్థలాల వేలానికి సిద్ధమైంది. సుమారు రెండేళ్ల విరామం తర్వాత ఆన్‌లైన్‌లో ఈ-వేలానికి నోటిఫికేషన్‌ విడుదల చేసింది.

HMDA: భూముల వేలానికి హెచ్‌ఎండీఏ నగారా!

  • రంగారెడ్డి, మేడ్చల్‌ మల్కాజిగిరి జిల్లాలోని లేఅవుట్లలో ప్లాట్లు, ఖాళీ స్థలాల విక్రయం

  • వచ్చే నెల 17-19 వరకు ఆన్‌లైన్‌లో వేలం

  • తుర్కయంజాల్‌లో గజానికి కనీస ధర రూ. 65 వేలు, బాచుపల్లిలో 70 వేలు

  • దాదాపు రూ.700 కోట్ల ఆదాయం వస్తుందని అంచనా

  • కేపీహెచ్‌బీలో స్థలాల వేలం 7.8 ఎకరాలను రూ.547 కోట్లకు

  • కొనుగోలు చేసిన గోద్రెజ్‌ ప్రాపర్టీస్‌

హైదరాబాద్‌ సిటీ/హైదరాబాద్‌, ఆగస్టు 20 (ఆంధ్రజ్యోతి): హైదరాబాద్‌ మహానగర అభివృద్ధి సంస్థ (హెచ్‌ఎండీఏ) మరోసారి ప్లాట్లు, స్థలాల వేలానికి సిద్ధమైంది. సుమారు రెండేళ్ల విరామం తర్వాత ఆన్‌లైన్‌లో ఈ-వేలానికి నోటిఫికేషన్‌ విడుదల చేసింది. రంగారెడ్డి జిల్లాలోని తుర్కయాంజల్‌ లేఅవుట్‌లో 12 ప్లాట్లు, మేడ్చల్‌ మల్కాజిగిరి జిల్లాలోని బాచుపల్లి లేఅవుట్‌లో 70 ప్లాట్లు, రంగారెడ్డి, మేడ్చల్‌ జిల్లాల్లోని 11 ఖాళీ స్థలాలను విక్రయించనున్నట్టు ప్రకటించింది. వేలంలో పాల్గొనదలచినవారు ఆన్‌లైన్‌లో రిజిస్ట్రేషన్‌ చేసుకునే ప్రక్రియను బుధవారం ప్రారంభించింది. కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ ‘ఎంఎ్‌సటీసీ ఈకామర్స్‌’ ఆధ్వర్యంలో సెప్టెంబర్‌ 17, 18, 19 తేదీల్లో ఈ వేలం జరగనుంది. ప్లాట్లకు గజానికి కనీస ధర తుర్కయాంజల్‌లో రూ.65వేలు, బాచుపల్లిలో రూ.70వేలుగా హెచ్‌ఎండీఏ నిర్ణయించింది. తుర్కయాంజల్‌ ప్లాట్లు బహుళ అంతస్తుల భవనాలకు, బాచుపల్లిలోని ప్లాట్లు వ్యక్తిగత ఇళ్ల నిర్మాణానికి అనుగుణంగా ఉన్నాయని తెలిపింది. ఇక రంగారెడ్డి జిల్లాలో గండిపేట మండలం బైరాగిగూడ, కోకాపేట, పుప్పాలగూడ, శేరిలింగంపల్లి మండలం చందానగర్‌లలోని ఖాళీ స్థలాలను... మేడ్చల్‌ మల్కాజిగిరి జిల్లాలోని బాచుపల్లి, గండిమైసమ్మ, దుండిగల్‌ మండలంలోని బౌరంపేట్‌, మేడిపల్లి మండలంలోని చెంగిచెర్ల, కుత్బుల్లాపూర్‌ మండలంలోని సూరారంలోని ఖాళీ స్థలాలను విక్రయించనుంది. మొత్తంగా ఈ ప్లాట్లు, స్థలాల విక్రయంతో సుమారు రూ.700 కోట్లు ఆదాయం సమకూరుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు.


7.8 ఎకరాలు.. రూ.547 కోట్లు

కూకట్‌పల్లి హౌసింగ్‌ బోర్డులోని భూమి ప్రభుత్వానికి కాసుల వర్షం కురిపించింది. హౌజింగ్‌ బోర్డు బుధవారం 7.8 ఎకరాల భూమిని వేలం వేయగా.. ఎకరానికి రూ.70 కోట్ల చొప్పున మొత్తం రూ.547 కోట్లకు గోద్రెజ్‌ ప్రాపర్టీస్‌ సంస్థ దక్కించుకుంది. ఇక రాజీవ్‌ స్వగృహ కార్పొరేషన్‌కు చెందిన టౌన్‌షి్‌పలలో అసంపూర్తిగా ఉన్న 3 బహుళ అంతస్తుల భవనాల విక్రయం ద్వారా రూ.70.11 కోట్లు ఆదాయం వచ్చిందని అధికారులు తెలిపారు.


ఈ వార్తలు కూడా చదవండి..

బతుకమ్మ కుంట అభివృద్ధి పనులపై హైడ్రా ఫోకస్

హైదరాబాద్‌పై ప్రపంచ దృష్టి.. అభివృద్ధిని అడ్డుకునే వారే శత్రువులు: సీఎం రేవంత్‌రెడ్డి

Read latest Telangana News And Telugu News

Updated Date - Aug 21 , 2025 | 04:15 AM