Share News

High Court Fiber Cables: ఎయిర్‌టెల్‌ కేబుళ్ల తొలగింపు ఆపండి

ABN , Publish Date - Aug 21 , 2025 | 03:57 AM

విద్యుత్‌ స్తంభాలకు అనుసంధానంగా ఉన్న ఎయిర్‌టెల్‌ ఆప్టికల్‌ ఫైబర్‌ కేబుళ్ల తొలగింపు ప్రక్రియను నిలిపేయాలంటూ హైకోర్టు బుధవారం మధ్యంతర ఉత్తర్వులు జారీచేసింది.

High Court Fiber Cables: ఎయిర్‌టెల్‌ కేబుళ్ల తొలగింపు ఆపండి

  • రాష్ట్ర హైకోర్టు మధ్యంతర ఆదేశాలు

  • బీఆర్‌కే భవన్‌కూ కేబుల్‌ కట్‌

  • 31 ప్రభుత్వ సైట్ల సర్వర్‌ డౌన్‌.. పునరుద్ధరణ

హైదరాబాద్‌, హైదరాబాద్‌ సిటీ, ఆగస్టు 20 (ఆంధ్రజ్యోతి): విద్యుత్‌ స్తంభాలకు అనుసంధానంగా ఉన్న ఎయిర్‌టెల్‌ ఆప్టికల్‌ ఫైబర్‌ కేబుళ్ల తొలగింపు ప్రక్రియను నిలిపేయాలంటూ హైకోర్టు బుధవారం మధ్యంతర ఉత్తర్వులు జారీచేసింది. అయితే కేబుల్‌ వైర్ల కారణంగా కరెంట్‌షాక్‌తో చనిపోయిన వారి ప్రాణాలకు ఎవరు బాధ్యత వహిస్తారని ప్రశ్నించింది. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు టీజీఎస్పీడీసీఎల్‌ తమ కేబుళ్లను తొలగించడాన్ని సవాల్‌ చేస్తూ.. భారతీ ఎయిర్‌టెల్‌ బుధవారం హైకోర్టులో లంచ్‌మోషన్‌ పిటిషన్‌ దాఖలు చేసింది. ఈ పిటిషన్‌పై మధ్యాహ్నం తర్వాత జస్టిస్‌ నగేశ్‌ భీమపాక ధర్మాసనం విచారణ చేపట్టింది. ఎయిర్‌టెల్‌ తరఫున.. సీనియర్‌ న్యాయవాది ఎస్‌.రవి వాదనలు వినిపించారు. టెలీకమ్యూనికేషన్స్‌ యాక్ట్‌-2023, సంబంధిత రూల్స్‌-2024 ప్రకారం టీజీఎస్పీడీసీఎల్‌కు రూ.21 కోట్లు అద్దెగా చెల్లించామని పేర్కొన్నారు. ఈ ఒప్పందం అమలులో ఉండగా.. ఎలాంటి నోటీసు ఇవ్వకుండా అకస్మాత్తుగా కేబుల్స్‌ తొలగింపునకు ఆదేశాలు జారీచేశారని.. దీనివల్ల హాస్పిటళ్లు, కోర్టులు సహా లక్షల మంది వినియోగదారులకు ఇంటర్‌నెట్‌ సేవలు నిలిచిపోయాయని ఆయన వివరించారు. ఈ వాదనలు విన్న ధర్మాసనం.. వివరణ ఇవ్వాలని టీజీఎస్పీడీసీఎల్‌ ఛైర్మన్‌, ఎండీలకు నోటీసులు జారీచేసింది.


అత్యవసరమైన ఇంటర్‌నెట్‌ సేవలను, టెలికాం మౌలికసదుపాయాలను ఏకపక్షంగా తొలగించడం సమంజసం కాదని.. కేంద్ర ప్రభుత్వం సైతం అకస్మాత్తుగా సేవలకు అంతరాయం కలిగించరాదంటూ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరిందని ధర్మాసనం వ్యాఖ్యానించింది. ఎయిర్‌టెల్‌ కేబుళ్లను కట్‌ చేయరాదన్న తమ ఆదేశాలను తక్షణం టీజీఎస్పీడీసీఎల్‌ అధికారులకు తెలియజేయాలని ఆ సంస్థ న్యాయవాదికి ఆదేశాలు జారీచేసింది. తదుపరి విచారణను ఈనెల 22కు వాయిదా వేసింది. కాగా.. కేబుళ్ల తొలగింపు కార్యక్రమం నేపథ్యంలో హైదరాబాద్‌లోని ఫైబర్‌ నెట్‌వర్క్‌ కంపెనీలు జాగ్రత్త పడుతున్నాయి. తమ కేబుళ్ల కోసం ప్రత్యేకంగా స్తంభాల ఏర్పాటుకు అనుమతి తీసుకుంటున్నాయి. ముషీరాబాద్‌ సర్కిల్‌లో 1333 స్తంభాల ఏర్పాటుకు అనుమతి ఇవ్వాలని కోరుతూ భారతి ఎయిర్‌టెల్‌ లిమిటెడ్‌ ఇప్పటికకే దరఖాస్తు చేసింది. ఒక్కో స్తంభానికీ ఏటా రూ.1000 చొప్పున జీహెచ్‌ఎంసీకి సదరు సంస్థ చెల్లించాల్సి ఉంటుంది. అయితే.. ఈ స్తంభాల ఏర్పాటు ప్రతిపాదనలను గురువారం జరిగే స్టాండింగ్‌ కమిటీ భేటీలో ప్రస్తావించనున్నారు. కమిటీ అభిప్రాయం మేరకు దీనిపై ఒక నిర్ణయం తీసుకోనున్నారు.


నిలిచిన సేవలు..

ఇటీవల జరిగిన ప్రమాదం నేపథ్యంలో నగరవ్యాప్తంగా విద్యుత్‌ స్తంభాలకు ఉన్న ఆప్టికల్‌ ఫైబర్‌ కేబుళ్లను అధికారులు తొలగిస్తున్న నేపథ్యంలో.. బీఆర్కే భవన్‌కు వచ్చే బీఎ్‌సఎన్‌ఎల్‌ ఇంటర్నెట్‌ కేబుల్‌ కూడా కట్‌ అయింది. దీంతో రాష్ట్రప్రభుత్వానికి చెందిన వివిధ శాఖల వెబ్‌సైట్ల సర్వర్లు బుధవారం డౌన్‌ అయ్యాయి. అప్రమత్తమైన అధికారులు రాత్రి 9 గంటలకల్లా ఇంటర్నెట్‌ను పునరుద్ధరించి సమస్యను పరిష్కరించారు. మరోవైపు.. దక్షిణ డిస్కం చేపట్టిన కేబుల్‌ కటింగ్‌ పనులను వెంటనే ఆపాలని కోరుతూ తెలంగాణ ఇంటర్నెట్‌ సర్వీస్‌ ప్రొవైడర్స్‌ అసోసియేషన్‌ డిమాండ్‌ చేసింది. ఖైరతాబాద్‌లోని దక్షిణ తెలంగాణ విద్యుత్‌ పంపిణీ సంస్థ ప్రధాన కార్యాలయంలో బుధవారం అసోసియేషన్‌ నేతలు చర్చలు నిర్వహించారు. ఈ ప్రక్రియతో తాము అందించే సేవలకు తీవ్ర విఘాతం కలుగుతుందని ఆందోళన వెలిబుచ్చారు. విద్యుత్‌ స్తంభాలపై అనవసరంగా ఉన్న తీగల తొలగింపునకు తమకు కొంత సమయం కావాలని అడిగారు. చర్చల సమయంలో తమ డిమాండ్లకు సరేనని ఒప్పుకొని.. తర్వాత మళ్లీ తీగలు తొలగిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇదే తీరు కొనసాగిస్తే రాష్ట్రవ్యాప్తంగా కేబుల్‌, ఇంటర్‌నెట్‌ సేవలు నిలిపివేసి పెద్ద ఎత్తున ధర్నా చేస్తామని హెచ్చరించారు.


ఈ వార్తలు కూడా చదవండి..

బతుకమ్మ కుంట అభివృద్ధి పనులపై హైడ్రా ఫోకస్

హైదరాబాద్‌పై ప్రపంచ దృష్టి.. అభివృద్ధిని అడ్డుకునే వారే శత్రువులు: సీఎం రేవంత్‌రెడ్డి

Read latest Telangana News And Telugu News

Updated Date - Aug 21 , 2025 | 03:57 AM