Share News

Nimmagadda Prasad: నిమ్మగడ్డ ఆస్తులు దాటించేస్తున్నారు

ABN , Publish Date - Jul 02 , 2025 | 03:51 AM

రాకియాకు, నిమ్మగడ్డ ప్రసాద్‌కు మధ్య నెలకొన్న ఆర్థిక వివాదానికి సంబంధించిన ఓ కోర్టు ధిక్కరణ పిటిషన్‌లో హైకోర్టు మంగళవారం తీర్పు రిజర్వు చేసింది.

Nimmagadda Prasad: నిమ్మగడ్డ ఆస్తులు దాటించేస్తున్నారు

  • ఇది కోర్టు ధిక్కరణ కిందకే వస్తుంది

  • హైకోర్టులో రాకియా సంస్థ పిటిషన్‌

  • తీర్పు రిజర్వు చేసిన హైకోర్టు

హైదరాబాద్‌, జూలై 1 (ఆంధ్రజ్యోతి): రాకియాకు, నిమ్మగడ్డ ప్రసాద్‌కు మధ్య నెలకొన్న ఆర్థిక వివాదానికి సంబంధించిన ఓ కోర్టు ధిక్కరణ పిటిషన్‌లో హైకోర్టు మంగళవారం తీర్పు రిజర్వు చేసింది. జగన్‌ అక్రమాస్తుల వ్యవహారంలోని వాన్‌పిక్‌ కేసుకు సంబంధించి యూఏఈలోని ఒక రాష్ట్ర ప్రభుత్వం రాస్‌ అల్‌ ఖైమాకు చెందిన రాస్‌ అల్‌ఖైమా ఇన్వె్‌స్టమెంట్‌ అథారిటీ(రాకియా)కు వ్యాన్‌పిక్‌ కేసులోనే మరో నిందితుడు నిమ్మగడ్డ ప్రసాద్‌కు మధ్య వివాదాలు ఎడతెగకుండా కొనసాగుతున్నాయి. రాజశేఖర్‌రెడ్డి హయాంలో వ్యాన్‌పిక్‌ ప్రాజెక్టులో రాకియా పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. క్విడ్‌ప్రోకోలో భాగంగానే వాన్‌పిక్‌కు భూములు కేటాయించారని సీబీఐ, ఈడీ కేసులు నమోదు చేశాయి. నిమ్మగడ్డ ప్రసాద్‌ను భాగస్వామిగా చేర్చుకున్నందుకు తమను నిమ్మగడ్డ ప్రసాద్‌ మోసం చేశారని, తన కంపెనీల ద్వారా నిధులు గోల్‌మాల్‌ చేశారని రాకియా యూఏఈ కోర్టులో నిమ్మగడ్డకు వ్యతిరేకంగా లా సూట్‌ దాఖలు చేసి గెలిచింది.


నిమ్మగడ్డ ప్రసాద్‌ నష్టపరిహారంగా రూ.600 కోట్లు చెల్లించాలని యూఏఈ కోర్టు డిక్రీ జారీ చేసింది. ఈ డిక్రీని అమలు చేయించుకోవడంలో భాగంగా రాకియా హైదరాబాద్‌లోని వాణిజ్య కోర్టులో ఎగ్జిక్యూటివ్‌ పిటిషన్‌(ఈపీ) దాఖలు చేసింది. వాణిజ్య కోర్టుకు హామీ ఇచ్చి కూడా ఆస్తులను బినామీ పేర్లతో బదిలీ చేస్తున్నారని, ఇది కోర్టు ధిక్కరణ కిందకే వస్తుందని పేర్కొంటూ తెలంగాణ హైకోర్టులో కోర్టు ధిక్కరణ వ్యాజ్యం దాఖలు చేసింది. ఈ వ్యాజ్యంపై జస్టిస్‌ కే లక్ష్మణ్‌ ధర్మాసనం సుదీర్ఘంగా విచారణ చేపట్టింది. రాకియా వాదనలు వినిపిస్తూ.. బినామీ పేర్లతో కంపెనీలను కంట్రోల్‌ చేస్తున్నారని.. ఆయన పేరుపైనే రూ.2,500 కోట్లు సదరు కంపెనీలు ఫండ్‌ రైజింగ్‌ చేపట్టాయని వెల్లడించింది. తమకు నిమ్మగడ్డ ప్రసాద్‌కు ఎలాంటి సంబంధం లేదని సదరు కంపెనీలు పేర్కొన్నాయి. వాదనలు విన్న ధర్మాసనం.. కోర్టు ధిక్కరణ వ్యాజ్యంలో తీర్పు రిజర్వు చేస్తున్నట్లు ప్రకటించింది.


శ్రీలక్ష్మి పిటిషన్‌పై విచారణ వాయిదా

హైదరాబాద్‌, జూలై 1 (ఆంధ్రజ్యోతి): ఓఎంసీ కేసులో నిందితురాలిగా ఉన్న శ్రీలక్ష్మి పిటిషన్‌పై హైకోర్టు మంగళవారం విచారణ చేపట్టింది. శ్రీలక్ష్మి తరఫున సీనియర్‌ న్యాయవాది వివేక్‌రెడ్డి వాదనలు వినిపించారు. తాను గనుల శాఖ కార్యదర్శిగా విధుల్లో చేరకముందే నిర్ణయాలన్నీ జరిగిపోయాయని, ఓఎంసీకి అన్ని అనుమతులు వచ్చాయని, ఓఎంసీకి లీజు నిర్ణయం కూడా జరిగిందని పేర్కొన్నారు. తనకంటే ముందు ఉన్న అధికారి, అప్పటి మంత్రి నిర్దోషులుగా తేలారని.. ఇక తన పాత్ర ఏమీ లేదని తెలిపారు. విచారణ గురువారానికి వాయిదా పడింది.


ఇవి కూడా చదవండి:

ఉగ్రవాదులు అరెస్ట్.. ఉలిక్కిపడ్డ రాష్ట్రం

వైఎస్ జగన్‌కు సోమిరెడ్డి వార్నింగ్

బీఆర్ఎస్ పునరుజ్జీవనం కోసం తాపత్రయపడుతోంది: సీఎం రేవంత్ రెడ్డి..

For More Telangana News and Telugu News

Updated Date - Jul 02 , 2025 | 03:51 AM