High Court: ‘కాళేశ్వరం కమిషన్’ నివేదిక పరిస్థితి ఏమిటి?
ABN , Publish Date - Aug 22 , 2025 | 04:40 AM
కాళేశ్వరం ప్రాజెక్టుపై జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ఇచ్చిన నివేదిక పరిస్థితి ఏంటని హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. ‘‘నివేదికను అసెంబ్లీలో పెట్టడానికి ముందే చర్యలు తీసుకుంటారా..
అసెంబ్లీలో ప్రవేశపెట్టిన తర్వాత చర్యలా?
చర్యలు తీసుకున్న తర్వాత అసెంబ్లీలోనా?
హైకోర్టు ప్రశ్న.. నేడు వెల్లడిస్తానన్న ఏజీ
నీటిపారుదల గౌరవ సలహాదారుగా రిటైర్డ్
లెఫ్టినెంట్ జనరల్ హర్పాల్ సింగ్
హైదరాబాద్, ఆగస్టు 21 (ఆంధ్రజ్యోతి): కాళేశ్వరం ప్రాజెక్టుపై జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ఇచ్చిన నివేదిక పరిస్థితి ఏంటని హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. ‘‘నివేదికను అసెంబ్లీలో పెట్టడానికి ముందే చర్యలు తీసుకుంటారా? అసెంబ్లీలో చర్చించిన తర్వాత తీసుకుంటా రా? కమిషన్ నివేదికపై ఏంచేశారన్న వివరాలు కూ డా ఉండాలి కదా? వాటిని కూడా అసెంబ్లీలో పెడతారా? కమిషన్ నివేదిక ఇచ్చిన 6 నెలల్లో చర్యలు తీసుకోవాలని చట్టంలో ఉంది’’ అని పేర్కొంది. తమకు అత్యవసరం ఉందని.. మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలని పిటిషనర్లు పేర్కొంటున్న నేపథ్యంలో ఈ సమాచారం తమకు కీలకమని చీఫ్‌జస్టిస్ ఏకే సింగ్, జస్టిస్ మొహియుద్దీన్ ధర్మాసనం వ్యాఖ్యానించింది. ప్రభుత్వం తరఫున అడ్వొకేట్ జనరల్ సుదర్శన్‌రెడ్డి సమాధానమిస్తూ.. తన వద్ద సమాచారం లేదని, శుక్రవారం తెలియజేస్తానన్నారు.
కుట్రపూరితంగా వ్యవహరిస్తున్నారు..
కాళేశ్వరం ప్రాజెక్టులో అక్రమాలపై జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ఇచ్చిన నివేదికను కొట్టేయాలని విజ్ఞప్తి చేస్తూ మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రి హరీశ్‌రావు దాఖలు చేసిన రెండు వేర్వేరు పిటిషన్లపై చీఫ్ జస్టిస్ ఏకే సింగ్, జస్టిస్ మొహియుద్దీన్ ధర్మాసనం గురువారం విచారణ చేపట్టింది. కేసీఆర్, హరీశ్ తరఫున సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాదులు ఆర్యమ సుందరం, దామ శేషాద్రినాయుడు వాదనలు వినిపించారు. ‘‘కాళేశ్వరం కమిషన్ నివేదికను అడ్డంపెట్టుకుని మా ప్రతిష్ఠను దెబ్బతీసేలా వ్యతిరేక ప్రచారం చేయాలని చూస్తున్నారు. నివేదిక కాపీ మాకు ఇవ్వకుండానే దానిపై సీఎం, మంత్రులు మీడి యా సమావేశం నిర్వహించడంతోపాటు పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. నివేదికను అదేరోజు మీడియా మొత్తానికి ఇచ్చేశారు. పత్రికల్లో పూర్తివివరాలు బహిర్గతమవడంతోపాటు దాదాపు 100 వెబ్‌సైట్లలో సమాచారం ఉంది. మేం కూడా ప్రభుత్వ వెబ్‌సైట్ నుంచే డౌన్‌లోడ్ చేసుకున్నాం. ప్రత్యేక రాష్ట్రం కోసం నా ప్రాణాలు పణం గా పెట్టాను. రాజకీయ నేతలకు పేరు ప్రఖ్యాతులు, కీర్తి ప్రతిష్ఠలు ముఖ్యం. వాటిపై దాడి చేసి, చెడుగా చిత్రీకరించేలా కుట్రపూరితంగా వ్యవహరిస్తున్నారు. ఇప్పుడు కూ డా నివేదికను అసెంబ్లీలో పెట్టి, విమర్శలు చేయాలనేది ప్రభుత్వ ఉద్దేశం. ఒక వ్యక్తి ప్రతిష్ఠ దెబ్బతినే విధంగా నివేదిక ఇవ్వాల్సి వస్తే కమిషన్ ఆఫ్ ఎంక్వైరీ యాక్ట్ సెక్షన్ 8బీ, 8సీ ప్రకారం నోటీసులిచ్చి.. సదరు వ్యక్తికి వాదనలు వినిపించుకునే అవకాశమివ్వడంతోపాటు సాక్షులను క్రాస్‌ఎగ్జామినేషన్ చేసే అవకాశమివ్వాలి. ప్ర స్తుత కేసులో మమ్మల్ని సాక్షులుగా పిలిచి.. పూర్తి బాధ్యత మాదే అన్నట్లు నివేదిక ఇచ్చారు. కమిషన్ నివేదికలో మాకు వ్యతిరేకంగా ఉన్న విషయాలకు.. మమ్మల్ని అడిగిన వాటికి పొంతనే లేదు. ఎవరో ఇచ్చిన తప్పు డు సాక్ష్యాలకు మా వాదన వినకుం డా మమ్మల్ని ఎలా బాధ్యులను చేస్తారు? అలాంటి నివేదిక న్యాయసమీక్షకు నిలవదు. ఇందుకు సుప్రీంకోర్టు ఇచ్చిన ‘లాల్‌కృష్ణ ఆడ్వాణీ’, ‘కిరణ్‌బేడీ’, ఇదే హైకోర్టు డివిజన్ బెంచ్ ఇచ్చిన ‘విజయభాస్కర్‌రెడ్డి’ తీర్పులే ఉదాహరణ. ఆ నివేదికను కొట్టేయకపోతే మాకు తీవ్ర నష్టం జరుగుతుంది. నివేదికను అసెంబ్లీలో పెట్టకముందే మధ్యంతర ఉత్తర్వులివ్వాలి’’ అని పేర్కొన్నారు.
పిటిషనర్లకు ఇచ్చింది 8బీ నోటీసులే
రాష్ట్ర ప్రభుత్వం, కాళేశ్వరం కమిషన్ తరఫున ఏజీ సుదర్శన్‌రెడ్డి, సీనియర్ న్యాయవాది నిరంజన్‌రెడ్డి వాదనలు కొనసాగించారు. ‘‘కాళేశ్వరం కమిషన్ ఇచ్చిన నివేదికకు మంత్రిమండలి ఆమోదముద్ర వేసింది. నివేదికను అసెంబ్లీ ముందుంచి, దానిపై పూర్తిస్థాయిలో చర్చించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అప్పటివరకు కమిషన్ నివేదికను బయటపెట్టబోం. కమిషన్ నివేదిక 650 పేజీలు ఉన్నందున.. క్యాబినెట్‌కు సహాయం చేయడానికి ముగ్గురు అధికారులతో కమిటీ వేసి, దానిపై 60 పేజీల సంక్షిప్త నివేదిక తయారు చేశారు. అంతేతప్ప కమిషన్ నివేదికను బయటపెట్టలేదు. నివేదిక కాపీ ఇవ్వలేదని ఆరోపిస్తున్న పిటిషనర్లు ఇద్దరూ ఎమ్మెల్యేలే. వారిద్దరూ అసెంబ్లీకి వచ్చి పూర్తిస్థాయిలో చర్చించవచ్చు. పిటిషనర్లకు ఇచ్చింది సమన్లు కాదు. కమిషన్ ఆఫ్ ఎంక్వైరీ యాక్ట్ సెక్షన్ 8బీ నోటీసులే. అది కేసీఆర్, హరీశ్‌కూ స్పష్టంగా తెలుసు. అందుకే అన్ని పత్రాలు అడిగారు. ఏయే పత్రాలు రికార్డుల్లోకి తీసుకోవాలో చెప్పారు. వారు పేర్కొన్న గత తీర్పులు ప్రస్తుత సందర్భానికి వర్తించవు. కమిషన్ నివేదిక అడ్వైజరీ లక్షణం కలిగి ఉండి మార్గదర్శనం చేస్తుంది. దాని ఆధారంగా నిర్ణయాలు తీసుకుంటారే తప్ప ఇప్పటికిప్పుడు ఏదో అవుతుందని తొందర అవసరం లేదు’’ అని తెలిపారు.
నివేదిక ఎక్కడి నుంచి వచ్చింది?
వాదనల సందర్భంగా నివేదికలోని వివరాలు ఎక్క డి నుంచి వచ్చాయని కోర్టు ప్రశ్నించింది. పిటిషనర్ల న్యాయవాదులు సమాధానమిస్తూ.. ఈనెల 4న సర్కా రు మీడియా సమావేశం నిర్వహించి, విలేకరులకు నివేదిక ఇచ్చిందని తెలిపారు. తాము కూడా ప్రభుత్వ వెబ్‌సైట్ నుంచే డౌన్‌లోడ్ చేసుకున్నామని, కావాలంటే ఆన్‌లైన్‌లో చూడవచ్చన్నారు. ఏజీ వాదిస్తూ.. నివేదికను బయటపెట్టలేదని, అవి అధికారులు తయారుచేసిన సమ్మరీ అని పేర్కొన్నారు. నివేదికను నేరుగా అసెంబ్లీకి సమర్పిస్తామన్నారు. మరోవైపు పిటిషనర్లు సమర్పించిన కాపీల్లో స్పష్టత లేదని, కొన్ని పేజీలు కనిపించడం లేదని కోర్టు అసహనం వ్యక్తం చేసింది. స్పష్టంగా ఉండేలా కాపీలు ఇవ్వాలని ఆదేశిస్తూ.. విచారణను శుక్రవారానికి వాయిదావేసింది.
ఈ వార్తలు కూడా చదవండి..
ఎమ్మెల్యేలు ఇలా చేస్తే ఎలా.. సీఎం చంద్రబాబు ఫైర్
టీటీడీపై వైసీపీ బురద జల్లుతోంది.. జ్యోతుల నెహ్రూ ధ్వజం
Read Latest AP News and National News