Agricultural Damage: వేల ఎకరాల్లో పంట నష్టం
ABN , Publish Date - Aug 24 , 2025 | 03:30 AM
కల్లోల వాతావరణం శాంతించింది. రైతుల గుండెల్లో మాత్రం అశాంతే మిగిలింది. విరామం లేకుండా కొన్నిరోజుల పాటు ఉధృతంగా కురిసిన వర్షం ఇప్పుడు లేదు. కానీ ఆ వాన మిగిల్చిన విపత్తు అన్నదాతలకు కన్నీళ్లను మిగిల్చింది. భారీ వర్షం..
భారీ వర్షాలతో రాష్ట్రవ్యాప్తంగా దెబ్బతిన్న పంటలు వరి, పత్తి రైతులకు గుండెకోత
పెట్టుబడి, రెక్కల కష్టమంతా వరద పాలు.. మెడకు అప్పులు
పంట నష్టంపై ‘ఆంధ్రజ్యోతి’ క్షేత్రస్థాయి పరిశీలన
(ఆంధ్రజ్యోతి న్యూస్‌నెట్‌వర్క్): కల్లోల వాతావరణం శాంతించింది. రైతుల గుండెల్లో మాత్రం అశాంతే మిగిలింది. విరామం లేకుండా కొన్నిరోజుల పాటు ఉధృతంగా కురిసిన వర్షం ఇప్పుడు లేదు. కానీ ఆ వాన మిగిల్చిన విపత్తు అన్నదాతలకు కన్నీళ్లను మిగిల్చింది. భారీ వర్షం.. ఫలితంగా తీవ్ర వరద పోటుకు కొన్నిచోట్ల పత్తి, కంది, పెసర, మినుము, మొక్కజొన్న, మిర్చి, వేరుశనగ తదితర పంటలు పూర్తిగా తుడిచిపెట్టుకుపోయాయి. ప్రధానంగా అప్పుడే నాట్లు వేసిన దశలో ఉన్న వరి వరదకు కొట్టుకుపోయింది. నదులు, చెరువులు, కాల్వల బ్యాక్‌వాటర్ కారణంగా ఇంకొన్నిచోట్ల చేలల్లో రోజుల తరబడి నిలుస్తున్న నీటితో పచ్చని పంటలు నల్లగా మారిపోయాయి. మరికొన్ని చోట్ల వర్షం కారణంగా పంటలకు తెగుళ్లు అంటుకున్నాయి. ఇలాంటి చోట్ల.. పూత దశలో ఉన్న పత్తి, పెసర, మొక్కజొన్న తదితర పంటలకు కాత నిలుస్తుందన్న నమ్మకం సన్నగిల్లుతోంది. ఈ విధంగా రాష్ట్రవ్యాప్తంగా కొన్ని వేల ఎకరాల్లో పంటలకు తీవ్ర నష్టం జరిగింది. వేలు, లక్షల్లో పెట్టిన పెట్టుబడి.. రెక్కల కష్టం మట్టిపాలైందని.. మిత్తికి తెచ్చిన అప్పులు మెడకు చుట్టుకున్నాయని, వరదకు పొలాలు, చేల గెట్లు కొట్టుకుపోయి.. ఎక్కడికక్కడ భారీగా ఇసుక మేటలు వేయడంతో అదంతా తొలగించడం అదనపు భారం అని.. ఇది తమకు భారీ నష్టం అని, దీన్నుంచి తాము కోలుకునేదెన్నడు? అని రైతులు తలపట్టుకుంటున్నారు. వర్షం, వరద కారణంగా జరిగిన పంట నష్టంపై క్షేత్రస్థాయిలో పరిస్థితులను ‘ఆంధ్రజ్యోతి’ పరిశీలించింది. పంట నష్టంపై వ్యవసాయశాఖ అధికారులు జిల్లాల వారీగా లెక్కలు తీసేపనిలో పడ్డారు. లోతట్టు ప్రాంతాల్లో వరద నీరు ఉండటంతో అక్కడికి వెళ్లి సర్వే చేయలేకపోతున్నారు. ‘ఆంధ్రజ్యోతి’ పరిశీలనలో, అలాగే అధికారులు వెల్లడించిన వివరాల ప్రకారం..

ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా 19,791 ఎకరాల్లో వివిధ పంటలకు నష్టం జరిగింది. ఇందులో 14,532 ఎకరాల్లో పత్తి పంట నీట మునిగింది. 1823 ఎకరాల్లో కంది, 625 ఎకరాల్లో మొక్కజొన్న పంటలు దెబ్బతిన్నాయి. మహబూబ్‌నగర్, గద్వాల, వనపర్తి, నారాయణపేట జిల్లాలో 5395 ఎకరాల్లో నష్టం వాటిల్లింది. ఇందులో ఒక్క వరి పంట వాటే 2,687 ఎకరాలు. గద్వాల జిల్లా మానవపాడు పెద్దవాగు, షేక్‌పల్లి-ఆర్‌గార్లపాడు మధ్యలోని మూడు వాగులు, వడ్డేపల్లిలోని జూలకల్లు వాగు పొంగడంతో దిగువన పంటలకు భారీ నష్టం వాటిల్లింది. జనగామ జిల్లాలో ఎక్కువగా పెసర పంటకు నష్టం జరిగింది. ములుగు జిల్లా ఏటూరునాగారం, మంగపేట మండలాల్లో 710 ఎకరాల్లో పంట నష్టం జరిగింది. భూపాలపల్లి జిల్లా మహదేవ్‌పూర్ మండలంలో 200 ఎకరాల్లో, పలిమెల మండలంలో 100 ఎకరాల్లో పంటలు నీట మునిగాయి. కొత్తపేట, మహదేవ్‌పూర్, బొమ్మాపూర్, బ్రాహ్మణపల్లిలో పంట నష్టం ఎక్కువగా ఉంది. ఆసిఫాబాద్ జిల్లాలో 6,453 ఎకరాల్లో పంట నష్టం జరిగిందని అధికారులు ప్రాథమికంగా అంచనా వేసినా ఈ నష్టం 10వేల ఎకరాల వరకు ఉంటుందని భావిస్తున్నారు. పెన్‌గంగా, ప్రాణహిత, పెద్దవాగు పరీవాహక మండలాలైన కౌటాల, చింతలమానేపల్లి, బెజ్జూర్, పెంచికల్‌పేట్, దహెల్గాంలో ఎక్కువ దెబ్బతిన్నాయి. మంచిర్యాల జిల్లాలో 3,230 ఎకరాల్లో వరి, 4,832 ఎకరాల్లో పత్తి సహా మొత్తంగా 8,086 ఎకరాల్లో పంట వరదపాలైంది. ఖమ్మంజిల్లాలో కూసుమంచి, తిరుమలాయపాలెం, నేలకొండపల్లి, కారేపంల్లి, ఏన్కూరు, కొనిజర్ల మండలాల్లో పత్తి 2,500 ఎకరాల్లో, వరి 3023 ఎకరాలు సహా 5,600 ఎకరాల్లో పంటలు దెబ్బతినట్లు అధికారులు అంచనా వేశారు. నల్లగొండ జిల్లాలో 5,200 ఎకరాల్లో, సూర్యాపేట జిల్లాలో 4,800 ఎకరాల్లో వరి, పత్తి పంటలకు నష్టం జరిగింది. తుంగతుర్తి నియోజకవర్గంలో 1000 ఎకరాల్లో పంటనష్టం జరిగింది. యాదాద్రి జిల్లాలో 200 ఎకరాల్లో పంట నష్టం జరిగింది. నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా 3,817 ఎకరాల్లో పంట నష్టం జరిగింది. ఇందులో సోయాపంట వాటే 3,355 ఎకరాలు. వికారాబాద్ జిల్లాలో 5వేల ఎకరాలకు పైగా వివిధ పంటలు నీట మునిగాయి. ఇందులో పూల తోటలూ ఉన్నాయి.
ఇవి కూడా చదవండి..
నిధుల్లో న్యాయబద్ధమైన వాటా మాకివ్వడం లేదు.. కేంద్రంపై స్టాలిన్ విసుర్లు
అది సుప్రీం తీర్పు, నా వ్యక్తిగతం కాదు: హోం మంత్రికి సుదర్శన్ రెడ్డి కౌంటర్
For More National News And Telugu News