Share News

Heavy Rains: విడవని వాన!

ABN , Publish Date - Aug 17 , 2025 | 04:47 AM

రాష్ట్రవ్యాప్తంగా ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. శనివారం పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురవగా.. కొన్ని జిల్లాల్లో మోస్తరు వానలు పడ్డాయి. చాలా చోట్ల చెరువులు, వాగులు, వంకలు పొంగిపొర్లాయి. రోడ్లు తెగిపోయాయి.

Heavy Rains: విడవని వాన!

  • ఉమ్మడి ఆదిలాబాద్‌, ఖమ్మం, వరంగల్‌, నిజామాబాద్‌ జిల్లాల్లో భారీ వర్షాలు

  • అతలాకుతలమైన ఆదిలాబాద్‌ జిల్లా ఇళ్లలోకి చేరిన నీరు.. తెగిన రోడ్లు

  • మునిగిన పంటలు.. ఇద్దరి గల్లంతు

  • నేడు రాష్ట్రంలో అత్యంత భారీ వర్షాలు!

(ఆంధ్రజ్యోతి న్యూస్‌ నెట్‌వర్క్‌): రాష్ట్రవ్యాప్తంగా ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. శనివారం పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురవగా.. కొన్ని జిల్లాల్లో మోస్తరు వానలు పడ్డాయి. చాలా చోట్ల చెరువులు, వాగులు, వంకలు పొంగిపొర్లాయి. రోడ్లు తెగిపోయాయి. లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి. జనజీవనం స్తంభించింది. వేర్వేరు చోట్ల ప్రమాదవశాత్తు ఇద్దరు గల్లంతయ్యారు. పత్తి, సోయా, కంది.. ఇతర పంటలు నీట మునిగాయి. ఉమ్మడి ఆదిలాబాద్‌, నిజామాబాద్‌, ఖమ్మం, వరంగల్‌ జిల్లాల్లో భారీ వర్షాలు కురిశాయి. ఆదిలాబాద్‌ జిల్లాలో ఏకధాటిగా 3 గంటల పాటు అతి భారీ వర్షం కురవడంతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. జిల్లాలో సాయంత్రం వరకు 10.6 సెం.మీ. సగటు వర్షపాతం నమోదైంది. అత్యధికంగా తాంసి మండలంలో 17.3 సెం.మీ. వర్షం కురిసింది. తలమడుగులో 17, మావలలో 16.6, సాత్నాలలో 15.5, ఆదిలాబాద్‌ అర్బన్‌లో 15 సెం.మీ. చొప్పున వర్షపాతం నమోదైంది. ఆదిలాబాద్‌లో పలు కాలనీలు పూర్తిగా నీట మునిగాయి. ఎస్‌డీఆర్‌ఎఫ్‌ బృందాలు వరద ముంపు ప్రాంతాల్లో సహాయక చర్యలను చేపట్టాయి. చాలా గ్రామాలకు ఉదయం నుంచి సాయంత్రం వరకు రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. జిల్లా వ్యాప్తంగా సుమారుగా 10 వేల ఎకరాల్లో పంటలు మునిగినట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. నిజామాబాద్‌, మంచిర్యాల, కామారెడ్డి, ఆసిఫాబాద్‌, నిర్మల్‌ జిల్లాల్లోనూ భారీ వర్షం పడింది.

20.jpg


మంచిర్యాలలోని రాళ్లవాగు ఉప్పొంగి ప్రవహించింది. కామారెడ్డి జిల్లాలో చాలా చోట్ల వరదల తాకిడికి రోడ్లు దెబ్బతిన్నాయి. రామారెడ్డి మండలంలో కన్నాపూర్‌ వద్ద ప్రధాన రహదారిపై రాకపోకలు నిలిపేశారు. ఆసిఫాబాద్‌లో పైకాజీనగర్‌, చెక్‌పోస్టు కాలనీలను వరద ముంచెత్తింది. చింతలమానేపల్లి, కెరమెరి మండలాల్లో లోలెవల్‌ వంతెనలు ఉప్పొంగి ప్రవహించడంతో పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో శుక్రవారం రాత్రి నుంచి శనివారం తెల్లవారు జాము వరకు పలుచోట్ల భారీ వర్షం కురిసింది. ములుగు జిల్లా గోవిందరావుపేట మండలంలో అత్యధికంగా 21.76 సెంటీమీటర్ల వర్షం పడింది. ములుగు, వరంగల్‌, భూపాలపల్లి జిల్లాల్లో భారీ వర్షాలు పడగా.. హనుమకొండ, మహబూబాబాద్‌ జిల్లాల్లో మోస్తరు వాన పడింది. బయ్యారం మండలంలో జిన్నెల వాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. మేడారం వెళ్లేదారిలో పెద్దవాగు పొంగిపొర్లింది. భూపాలపల్లి జిల్లాలోని సింగరేణి ఓపెన్‌ కాస్ట్‌ బొగ్గు గనుల్లో వర్షపు నీరు నిలిచిపోవడంతో ఉత్పత్తికి ఆటకం ఏర్పడింది. మంజీరా నీటి ప్రవాహ తాకిడికి మెదక్‌ జిల్లాలో ఏడుపాయల వనదుర్గామాత ఆలయాన్ని మూసివేశారు. ఇక మహబూబాబాద్‌ జిల్లా గంగారం మండలం ఏడుబావుల జలపాతంలో ఖమ్మం జిల్లా ఏన్కూరు మండలం జెన్నారం గ్రామానికి చెందిన ప్రేమ్‌ కుమార్‌ (23) గల్లంతయ్యాడు. నిర్మల్‌ జిల్లా కడెం మండలం కన్నాపూర్‌కు చెందిన తిప్పారెడ్డి వరద ఉధృతిలో కొట్టుకుపోయాడు. కడెంప్రాజెక్టు దిగువన నీటిలో చేపలు పడుతుండగా ప్రమాదవశాత్తు నీటిలో పడి గల్లంతయ్యాడు.


ఉమ్మడి ఖమ్మం జిల్లాలో..

ఉమ్మడి ఖమ్మం జిల్లాలో భారీ వర్షాలకు చాలా గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. ఖమ్మం జిల్లాలో మున్నేరు ఉధృతంగా ప్రవహిస్తోంది. దీంతో అక్కడి జనాన్ని పునరావాస కేంద్రాలకు పంపేలా అధికారులు ఏర్పాట్లు చేశారు. కారేపల్లి మండలంలో బుగ్గవాగు, ఏన్కూరు-కొణిజర్ల మండలంలో పగిడేరు వాగు, నిమ్మవాగు, తల్లాడ మండలంలో గంగదేవిపాడు వాగు పొంగడంతో పలు గ్రామాలకు రాకపోకలు నిలిచాయి. కొత్తగూడెం జిల్లాలో చెరువులు పొంగి పలు చోట్ల వరి, పత్తి పంటలు నీటమునిగాయి. జూలూరుపాడు మండలంలో 15 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి.

నేడు అత్యంత భారీ వర్షాలు

రాష్ట్రంలో పలు జిల్ల్లాల్లో ఆదివారం భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. సోమవారం కూడా కొన్ని జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. ఆదివారం రెడ్‌, సోమ, మంగళవారాలకు ఆరెంజ్‌ అలెర్ట్‌ ప్రకటించింది. ఆదివారం భద్రాద్రి కొత్తగూడెం, హనుమకొండ, మహబూబాబాద్‌, ములుగు, వరంగల్‌ జిల్లాల్లో అత్యంత భారీ వర్షాలు కురుస్తాయని, వాటికి రెడ్‌ అలెర్ట్‌ జారీ చేసింది. అలాగే ఆదిలాబాద్‌, జనగామ, భూపాలపల్లి, ఖమ్మం, ఆసిఫాబాద్‌, మంచిర్యాల, పెద్దపల్లి, సిద్దిపేట, సూర్యాపేట జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడతాయని, ఆయా జిల్లాలకు ఆరెంజ్‌ అలెర్ట్‌ జారీ చేసింది. మిగిలిన జిల్లాలకు యెల్లో అలెర్ట్‌ జారీ చేసింది.


మేడ్చల్‌ హైవేపై వరద నీటితో ట్రాఫిక్‌ జామ్‌

మేడ్చల్‌ టౌన్‌ : భారీ వర్షాల కారణంగా మేడ్చల్‌ పట్టణంలోని జాతీయ రహదారిపై శనివారం వరద నీరు చేరి వాహనాల రాక పోకలకు ఆటంకంగా మారింది. కిలోమీటర్ల పొడవున వాహనాలు రహదారిపై నిలిచిపోయి అటు పోలీసులకు, ఇటు జాతీయ రహదారి అధికారులకు తలనొప్పిగా మారింది. దీంతో శనివారం సాయంత్రం స్థానిక మున్సిపల్‌ అధికారులతో కలిసి వరద నీటి ప్రవాహాన్ని మళ్లించే పని చేపట్టారు. అదే సమయంలో మెదక్‌ నుంచి హైదరాబాద్‌ వైపు కారులో వెళ్తున్న హైడ్రా కమిషనర్‌ రంగనాథ్‌ కారు ఈ ట్రాఫిక్‌లో చిక్కుకుంది. ఆయన కారు దిగి చూడగా పోలీసులు, మున్సిపల్‌ సిబ్బంది వరద నీటిని తొలగించే పనిలో కనిపించారు. కమిషనర్‌ వారి దగ్గరకు వెళ్లి విషయం తెలుసుకున్నారు. ఏజీఎస్‌ వెంచర్‌ వారు నిర్మించిన ప్రహరీ కారణంగా వరద నీరు రోడ్డుపై నిలుస్తున్నట్లు అధికారులు కమిషనర్‌కు తెలిపారు. అనంతరం అధికారులు జేసీబీతో వెంచర్‌ గోడ కింద భాగాన్ని తొలగించి వరద నీరు వెంచర్‌ లోపలికి వెళ్లేలా చేశారు.


ఈ వార్తలు కూడా చదవండి..

తృటిలో తప్పిన ప్రమాదం.. విమాన ప్రయాణికులు సురక్షితం

రాహుల్ గాంధీ ఆరోపణలు.. ఎన్నికల సంఘం కీలక నిర్ణయం

మరిన్ని తెలంగాణ వార్తలు, తెలుగు వార్తలు చదవండి..

Updated Date - Aug 17 , 2025 | 04:47 AM