Share News

Heavy Rainsఫ గోదావరి, కృష్ణ.. ఉగ్రరూపం

ABN , Publish Date - Aug 20 , 2025 | 04:12 AM

ఎగువన మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్‌, కర్ణాటకతోపాటు రాష్ట్రంలోనూ భారీ వర్షాలు పడుతుండడంతో గోదావరి, కృష్ణ నదులు ఉగ్రరూపం దాల్చాయి. భూపాలపల్లి జిల్లా మహదేవపూర్‌ మండలంలోని మేడిగడ్డ బ్యారేజీ వద్ద గోదావరి ప్రవాహం 6.65లక్షల క్యూసెక్కులకు చేరింది.

Heavy Rainsఫ గోదావరి, కృష్ణ.. ఉగ్రరూపం

  • మేడిగడ్డకు 6.65 లక్షల క్యూసెక్కులు

  • ఎస్సారెస్పీ 39 గేట్ల ద్వారా నీటి విడుదల

  • శ్రీశైలంకు 3.90 లక్షల క్యూసెక్కుల వరద

  • సాగర్‌ నుంచి 4 లక్షల క్యూసెక్కుల విడుదల

  • రాష్ట్రాన్ని వీడని వాన.. రాకపోకలకు బ్రేక్‌

  • భువనగిరిలో వాగులో చిక్కి ఇద్దరి మృతి

  • మహారాష్ట్రలో కొనసాగుతున్న

  • వర్షబీభత్సం.. థానేలో 8 మంది మృతి

(ఆంధ్రజ్యోతి న్యూస్‌నెట్‌వర్క్‌): ఎగువన మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్‌, కర్ణాటకతోపాటు రాష్ట్రంలోనూ భారీ వర్షాలు పడుతుండడంతో గోదావరి, కృష్ణ నదులు ఉగ్రరూపం దాల్చాయి. భూపాలపల్లి జిల్లా మహదేవపూర్‌ మండలంలోని మేడిగడ్డ బ్యారేజీ వద్ద గోదావరి ప్రవాహం 6.65లక్షల క్యూసెక్కులకు చేరింది. ములుగు జిల్లా వాజేడు మండలంలోని పేరూరు వద్ద గోదావరి నీటి మట్టం 16.10 మీటర్లకు చేరడంతో మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. మంగపేట మండలం కమలాపురంలోని ఇన్‌టేక్‌వెల్‌ వద్ద గోదావరి నీటిమట్టం 8.30 మీటర్లకు చేరడంతో లోతట్టు ప్రాంతాల ప్రజలు అపమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. ఇక, ఎగువన ఉన్న శ్రీరాంసాగర్‌ ప్రాజెక్టులోకి 1.75లక్షల క్యూసెక్కుల వరద వస్తుండగా, 39 గేట్లను ఎత్తి 2.75లక్షల క్యూసెక్కులను గోదావరిలోకి విడుదల చేస్తున్నారు. భద్రాచలం వద్ద గోదావరి బుధవారం నాటికి మొదటి ప్రమాద హెచ్చరిక స్థాయికి (43అడుగులకు) చేరే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. కర్ణాటకలో కురుస్తున్న వర్షాలతో కృష్ణ, భీమా, తుంగభద్ర నదులకు వరద పెరుగుతోంది. శ్రీశైలం ప్రాజెక్టుకు అత్యధికంగా 3.90లక్షల క్యూసెక్కుల ప్రవాహం వచ్చి చేరుతోంది. దీంతో పది గేట్లను 14అడుగుల మేర ఎత్తి 3,44,750 క్యూసెక్కులను విడుదల చేస్తున్నారు. అదేవిధంగా కుడి, ఎడమ విద్యుత్‌ కేంద్రాల ద్వారా 65,436 క్యూసెక్కులను వదులుతున్నారు. నాగార్జున సాగర్‌ ప్రాజెక్టుకు 4,10,186 క్యూసెక్కుల వరద వస్తుండగా, 26 గేట్లు ఎత్తి అంతే స్థాయిలో నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు.


కాగా, బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాల్లో మంగళవారం కూడా భారీ వర్షం కురిసింది. భూపాలపల్లి జిల్లాలో ఎడతెరపి లేకుండా వర్షం కురవడంతో సింగరేణి ఓసీ-2, ఓసీ-3లో బొగ్గు ఉత్పత్తికి అంతరాయం ఏర్పడింది. వందలాది ఎకరాల్లో పత్తి పంట నీట మునిగింది. కలెక్టర్‌ రాహుల్‌ శర్మ, ఎస్పీ కిరణ్‌ ఖరే మహాముత్తారం మండలంలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించి పరిస్థితిని పరిశీలించారు. టేకులగూడెం వద్ద భూపాలపట్నం-హైదరాబాద్‌ 163వ జాతీయ రహదారిపైకి వరద పోటెత్తింది. దీంతో తెలంగాణ-ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రాలకు రాకపోకలు నిలిచిపోయాయి. పెద్దపల్లి జిల్లాలో గోదావరి ప్రవాహం పెరుగుతుండడంతో తీర ప్రాంత ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు. కొత్తగూడెం, ఇల్లెందు, మణుగూరు ఏరియాల్లోనూ 47,743 టన్నుల బొగ్గు ఉత్పత్తికి అంతరాయం ఏర్పడింది. మంజీరా ఉధృతితో ఆరో రోజూ వన దుర్గ మాత ఆలయం జలదిగ్బంధంలోనే ఉంది. సంగారెడ్డి జిల్లాలోని జహీరాబాద్‌, ఆందోల్‌, నారాయణఖేడ్‌, పటాన్‌చెరు, హత్నూర, పుల్కల్‌ ప్రాంతాల్లో వర్షం కురిసింది. సిద్దిపేట జిల్లా గజ్వేల్‌ మండలంలోని దిలాల్‌పూర్‌ వద్ద కెనాల్‌ కట్ట తెగిపోయింది. భువనగిరికి చెందిన మత్స్యకార్మికుడు వెంకటేశ్‌(40), తాజ్‌పూర్‌కు చెందిన జహంగీర్‌(52) చిన్నేటి వాగులో చేపలు పడుతుండగా, వరద ఉధృతికి కొట్టుకుపోయి.. మృతి చెందారు.


నేడు 4 జిల్లాల్లో భారీ వర్షాలు

రాష్ట్రంలోని నాలుగు జిల్లాల్లో బుధవారం భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, మహబూబాబాద్‌ జిల్లాలకు ఎల్లో అలెర్ట్‌ జారీ చేసింది. మిగిలిన అన్ని జిల్లాల్లోనూ ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. కాగా, 24 గంటల్లో ములుగు జిల్లా ఏటూరునాగారంలో అత్యధికంగా 18.9సెంటీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు పేర్కొంది.


ఈ వార్తలు కూడా చదవండి...

హౌసింగ్ స్కీమ్‌లో అవినీతి.. మంత్రి ఉత్తమ్ చర్యలు

ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్న ఎన్డీఏ.. సీఎం రేవంత్ ఫైర్

For More Telangana News and Telugu News..

Updated Date - Aug 20 , 2025 | 04:12 AM