Heavy Rains: వరుణుడి దరువు!
ABN , Publish Date - Aug 14 , 2025 | 04:25 AM
చినుకు వణికిస్తోంది.. వరద దడ పుట్టిస్తోంది. కొన్నాళ్లుగా రాష్ట్రంపై దట్టంగా కమ్ముకొని వదలని మేఘం ఉరుములు, మెరుపులతో మరోసారి భీకరంగా గర్జించింది.
రాష్ట్రవ్యాప్తంగా వర్షం
మంచిర్యాల జిల్లా కన్నెపల్లిలో 24, మరో రెండు చోట్ల 20 సెం.మీకి పైగా
50 మండలాల్లో 6-11 సెం.మీ.
శంషాబాద్‌లో విమానాల రాకపోకలకు అంతరాయం
3 సర్వీసుల రద్దు.. 9 దారి మళ్లింపు
నేడు, రేపు భారీ వర్షాలు
మెదక్, సంగారెడ్డి, వికారాబాద్ జిల్లాలకు రెడ్ అలర్ట్
ఈ జిల్లాలో బడులకు నేడు సెలవు
అల్పపీడనం, నైరుతి ప్రభావంతో 19వ తేదీ దాకా వర్షాలే
(ఆంధ్రజ్యోతి న్యూస్‌నెట్‌వర్క్): చినుకు వణికిస్తోంది.. వరద దడ పుట్టిస్తోంది. కొన్నాళ్లుగా రాష్ట్రంపై దట్టంగా కమ్ముకొని వదలని మేఘం ఉరుములు, మెరుపులతో మరోసారి భీకరంగా గర్జించింది. బుధవారం రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో వర్షం దంచికొట్టింది. వాగులు, ఒర్రెలు పొంగిపొర్లాయి. చెరువులు అలుగు పోశాయి. వరద ధాటికి కొన్నిచోట్ల చెరువు కట్టలు, అలుగులు తెగిపోయాయి. లోతట్టు ప్రాంతాల్లోని జనావాసాలు జలదిగ్బంధంలో చిక్కుకుపోయాయి. కొన్నిచోట్ల ఇళ్లు దెబ్బతిన్నాయి. ఇళ్లలోకి నీరు చేరడంతో జనాలు తీవ్ర ఇబ్బందులుపడ్డారు. పలుచోట్ల వరి, పత్తి పంట నీట మునిగింది. వరద ఉధృతికి వాగులు ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తుండటంతో మారుమూల గ్రామాలకు రాకపోకలు స్తంభించాయి. బుధవారం రాష్ట్రవ్యాప్తంగా 12 మండలాల్లో 11 నుంచి 19 సెం.మీ మధ్య, 50 మండలాల్లో 6 నుంచి 11 సెం.మీ మధ్య, మూడు మండలాల్లో 20 సెం.మీకు పైగా వర్షపాతం నమోదైంది. రాష్ట్రవ్యాప్తంగా ఐదు మండలాలు మినహా.. మిగతా 616 మండలాల్లో వర్షంపాతం రికార్డయింది. మంచిర్యాల జిల్లా వ్యాప్తంగా కుండపోతగా వర్షం పడింది. ఆ జిల్లాలోని కన్నెపల్లి మండలంలో 24 సెం.మీ, భీమినిలో 23.8 సెం.మీ, ఆసిఫాబాద్ జిల్లాలో 21.9 సెం.మీ వర్షపాతం నమోదైంది. హైదరాబాద్‌లో పలుచోట్ల వర్షం పడింది. అవసరమైతే తప్ప ఇళ్ల నుంచి బయటకు రావొద్దని అధికారులు ముందే హెచ్చరించడంతో జనం ఎక్కువగా ఇళ్లకే పరిమితమయ్యారు. యాదాద్రి జిల్లా భూదాన్‌పోచంపల్లి మండలంలోని రుద్రవెల్లి-జూలూరు బ్రిడ్జి వద్ద, వలిగొండ మండలం సంగెం-బోల్లేపల్లి బ్రిడ్జి వద్ద మూసీ ఉధృతంగా ప్రవహిస్తుండటంతో రాకపోకలు నిలిపివేశారు. నల్లగొండ కలెక్టరేట్ సమీపంలో డబుల్ బెడ్‌రూం ఇళ్ల కోసం ఏర్పాటు చేసిన సెప్టిక్ ట్యాంకు.. వరద తీవ్రతకు ఓ పక్కకు ఒరిగిపోయింది. మంచిర్యాల జిల్లాలో పాల్వాయి పురుషోత్తంరావు ప్రాజెక్టు బ్యాక్ వాటర్ కారణంగా కన్నెపల్లి మండలం సాలిగాంలో ఇళ్లలోకి నీరు చేరింది. మంచిర్యాల జిల్లాలోని భీమిని మండలం ఖర్జిభీంపూర్‌లో చెరువు మత్తడి తెగింది. ఆదిలాబాద్ జిల్లా తర్నం లోలెవల్ బ్రిడ్జిపై నుంచి వరద నీరు ప్రవహిస్తుండటంతో జైనథ్, బేల మండలాలకు రాకపోకలు నిలిపివేశారు. కుంటాల, పొచ్చెర, గాయత్రి, కనకాయి జలపాతాలు ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తుండటంతో మూడు రోజులపాటు సందర్శనను నిలిపివేశారు. ఉమ్మడి వరంగల్ జిలా పర్వతగిరి మండలం నారాయణపురం ఆకేరువాగులో మంగళవారం గల్లంతైన కందికట్ల ఉప్పలయ్య (65) అనే పశువులకాపరి మృతదేహం లభ్యమైంది. భూపాలపల్లి జిల్లా చిట్యాల మండల శివారులోని ఎస్సారెస్పీ కాలువకు గండిపడింది. ములుగు జిల్లా ఏటూరునాగారం మండలం దొడ్ల-మల్యాల గ్రామాల మధ్యలోని జంపన్నవాగు ఉధృతంగా ప్రవహిస్తుండటంతో కొండాయి, మల్యాల, ఐలాపురం తదితర గ్రామాలకు రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. హైదరాబాద్ యాకుత్‌పుర దగ్గర్లో గౌస్ (35) అనే వ్యక్తి ప్రమాదవశాత్తు వరద కాల్వలో పడటంతో హైడ్రా అధికారులు అతడిని బయటకు తీశారు.
శిథిలమైన స్కూలుకు తాళం
సూర్యాపేట జిల్లా ఆత్మకూరు మండలం తుమ్మల పెన్‌పహాడ్ గ్రామంలోని పాఠశాల భవనం శిథిలావస్థకు చేరుకుంది. విద్యార్థుల భద్రతను దృష్టిలో ఉంచుకొని మండల విద్యాధికారి అక్కడికొచ్చి పాఠశాలకు తాళం వేసి.. సెలవు ప్రకటించారు. పులిచింతల బ్యాక్‌వాటర్‌తో సూర్యాపేట జిల్లా మఠంపల్లి మండలం మట్టపల్లి శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయంలోకి అడుగు మేర నీరు చేరింది. ఈ నీటిని మోటార్లతో కరకట్ట ఆవలకు ఎత్తిపోస్తున్నారు.
విమానాల రాకపోకలకు అంతరాయం
వాతావరణం అనుకూలించకపోవడంతో శంషాబాద్ విమానాశ్రయంలో బుధవారం విమాన సర్వీసుల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. తొమ్మిది విమానాలను దారి మళ్లించారు. మరో మూడు విమాన సర్వీసులను రద్దు చేశారు. ఫలితంగా ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. జీఎంఆర్ అధికారుల వివరాల ప్రకారం.... ఽఢిల్లీ, అహ్మదాబాద్, కోల్‌కతా, పట్నా, గోవా, చెన్నై, ముంబై నుంచి రావాల్సిన విమానాల్లో ఐదింటిని వైజాగ్‌కు, మూడింటిని బెంగళూరుకు, ఒక విమానాన్ని తిరుపతికి మళ్లించారు. వీటిలో ఏడు విమానాలు తిరిగి శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు చేరుకున్నాయి.
హుస్సేన్‌సాగర్ ఫుల్
శ్రీశైలం ప్రాజెక్టు నుంచి ఏడు గేట్ల ద్వారా 1.89 లక్షల క్యూసెక్కుల నీరు దిగువకు వెళుతోంది. ఎగువన జూరాలలోకి 90వేల క్యూసెక్కుల వరద వస్తోంది. నాగార్జునసాగర్‌లోకి 2.28 లక్షల కూసెక్కుల నీరు వస్తుంటే అంతకుమించి 2.69 లక్షల క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు. పులిచింతలకు 3.15 లక్షల క్యూసెక్కుల వరద వస్తుంటే అంతే నీటిని బయటకు వదులుతున్నారు. వనపర్తి జిల్లా మదనాపురం మండలంలోని సరళాసాగర్ ప్రాజెక్టు నాలుగు గేట్లు తెరుచుకున్నాయి. 14వేల క్యూసెక్కుల నీరు దిగువకు విడుదలవుతోంది. గోదావరి ప్రాజెక్టులకు వరద పెరుగుతోంది. సింగూరు నీటి మట్టం గరిష్ఠస్థారుకి చేరుకుంది. ప్రాజెక్టులోకి 5వేల క్యూసెక్కుల నీరు వస్తోంది. శ్రీరాంసాగర్‌కు 12789 క్యూసెక్కులు, ఎల్లంపల్లికి 24,723 క్యూసెక్కుల వరద వస్తోంది. కాళేశ్వరం వద్ద గోదావరి 6.55 మీటర్ల ఎత్తులో ప్రవహిస్తోంది. మేడిగడ్డకు 1.57 లక్షల క్యూసెక్కుల వరద వస్తోంది. అంతే నీటిని బయటకు వదులుతున్నారు. హైదరాబాద్‌లోని హుస్సేన్‌సాగర్ పూర్తిగా నిండిపోయింది. 1704 క్యూసెక్కుల నీరు వస్తుంటే.. 869 క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు. హిమాయత్‌సాగర్ నాలుగు గేట్లు ఎత్తి 3,854 క్యూసెక్కుల నీటిని వదులుతున్నారు.
మూడు జిల్లాలకు రెడ్ అలర్ట్
బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడినట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. దీనికితోడు రాష్ట్రంపై నైరుతి రుతుపవణాలు చురుగ్గా ఉన్నాయని, ఫలితంగా రాగల నాలుగు రోజుల పాటు రాష్ట్రంలో వర్షాలు కురుస్తాయని పేర్కొంది. గురు, శుక్రవారాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడతాయని హెచ్చరించింది. గురువారం మెదక్, సంగారెడ్డి, వికారాబాద్ జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురుస్తాయని రెడ్ అలర్ట్ జారీ చేసింది. కొత్తగూడెం, భూపాలపల్లి, కామారెడ్డి, మహబూబాబాద్, మేడ్చల్, ములుగు, నిర్మల్, నిజామాబాద్, సూర్యాపేట జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్.. ఆదిలాబాద్, హన్మకొండ, హైదరాబాద్, జగిత్యాల, జనగాం, గద్వాల, కరీంనగర్, ఖమ్మం, ఆసిఫాబాద్, మహబూబ్‌నగర్, మంచిర్యాల, నాగర్‌కర్నూల్, నల్లగొండ, నారాయణపేట, పెద్దపల్లి, సిరిసిల్ల, రంగారెడ్డి, సిద్దిపేట, వనపర్తి, వరంగల్, యాదాద్రి భువనగిరి జిల్లాలకు యెల్లో అలర్ట్ జారీ చేసింది. 19వ తేదీ వరకు వర్షాలు పడతాయని పేర్కొంది. గురువారం సంగారెడ్డి, మెదక్, వికారాబాద్ జిల్లాల్లోని పాఠశాలలకు సెలవు ప్రకటించారు. భారీ వర్షం పడితే సెలవు ప్రకటించుకోవాలని రంగారెడ్డి జిల్లాలోని ప్రధానోపాధ్యాయులకు జిల్లా విద్యాధికారి సూచించారు.
గర్భిణిని తాళ్లతో దాటించి.. వరుడిని భుజంపై ఎత్తుకొని
మంచిర్యాల జిల్లా తాండూరు మండలం నర్సాపూర్ గ్రామ పరిధిలోని దొడ్డిగూడేనికి చెందిన గర్భిణికి పురిటినొప్పులు రావడంతో ఆమెను ఆస్పత్రికి తరలించే క్రమంలో మార్గమధ్యలో వాగు దాటడం కష్టమైంది. అంబులెన్స్ వచ్చినా వాగు దగ్గరే ఆగిపోవడంతో మాదారం ఎస్సై సౌజన్య, తాండూరు ఎస్సై కిరణ్ వచ్చి తాళ్ల సాయంతో గర్భిణిని వాగుదాటించి అంబులెన్స్ ఎక్కించి ఆస్పత్రికి తరలించారు. ఇక వఽధువు ఇంట జరిగే పెళ్లి కోసం బంధుమిత్రుల కోలాహలం మధ్య ఆర్భాటంగా బయటుదేరిన వరుడికి మార్గమధ్యలో వరద పోటుతో దారి మూసుకుపోయింది. కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండల కేంద్రానికి మేళతాళాల మధ్య బయలుదేరిన జగిత్యాల జిల్లా గుంజపడుగకు చెందిన వరుడు, ఆయన కుటుంబసభ్యులు, బంధుమిత్రులు ఆ మండల కేంద్ర సమీపంలోని లోలెవల్ వంతెనపై నుంచి నీరు ఉధృతంగా ప్రవహిస్తుండటంతో ఆగిపోయారు. వధువు తరఫువారొచ్చి వరుడిని భుజాలపై మోసుకొని కల్వర్టు దాటించారు.
ఈ వార్తలు కూడా చదవండి..
సోనియా గాంధీ లక్ష్యంగా సంచలన ఆరోపణలు..
రిమాండ్ పొడిగింపు.. కోర్టు వద్ద చెవిరెడ్డి హల్‌చల్
Read latest Telangana News And Telugu News