Share News

Heavy Rain Traffic Jam: కుండపోత

ABN , Publish Date - Jul 19 , 2025 | 05:28 AM

కొద్దిరోజులుగా వచ్చీ రానట్లు పలకరించి పోతున్న వరుణుడు.. శుక్రవారం ఒక్కసారిగా విజృంభించాడు. ప్రత్యేకించి రాజధాని హైదరాబాద్‌ నగరాన్ని కుండపోతతో వణికించాడు.

Heavy Rain Traffic Jam: కుండపోత

  • హైదరాబాద్‌లో భారీవర్షం.. నగరం అతలాకుతలం

  • ప్రధాన రోడ్లను ముంచేసిన వరదలు

  • పికెట్‌లో అత్యధికంగా 11.4 సెం.మీ.

  • ఈ సీజన్‌లో ఇదే అత్యధికం

  • ట్రాఫిక్‌జామ్‌.. వాహనదారులకు నరకం

  • లోతట్టు ప్రాంతాల్లో సెల్లార్లు, ఇళ్లలోకి నీరు

  • సికింద్రాబాద్‌ ప్యాట్నీ సెంటర్‌ జలదిగ్బంధం

  • పడవల్లో సురక్షిత ప్రాంతానికి జనం

  • పలు జిల్లాల్లో వర్షాలు.. రైతుల్లో ఆనందం

  • ‘రంగారెడ్డి’లో గోడ కూలి మహిళ మృతి

  • 4 రోజులు వర్షాలు: వాతావరణ కేంద్రం

  • అధికారులూ అప్రమత్తంగా ఉండండి

  • ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సూచన

(ఆంధ్రజ్యోతి న్యూస్‌ నెట్‌వర్క్‌): కొద్దిరోజులుగా వచ్చీ రానట్లు పలకరించి పోతున్న వరుణుడు.. శుక్రవారం ఒక్కసారిగా విజృంభించాడు. ప్రత్యేకించి రాజధాని హైదరాబాద్‌ నగరాన్ని కుండపోతతో వణికించాడు. మధ్యాహ్నం 2.30 నుంచి రాత్రి 7గంటల వరకు నగరంలో వాన.. దంచికొట్టింది. మారేడ్‌పల్లి పికెట్‌లో అత్యధికంగా 11.4 సెంటీమీటర్లు, బోయిన్‌పల్లిలో 11.3 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఈ సీజన్‌లో ఇప్పటివరకు కురిసిన అత్యధిక వర్షపాతం ఇదేనని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. భారీ వర్షం కారణంగా వచ్చిన వరదలతో గ్రేటర్‌లో లోతట్టు ప్రాంతాలు అతలాకుతలం అయ్యాయి. ప్రధాన రహదారులను వరదలు ముంచేయడంతో కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. రోడ్లపై ఎక్కడికక్కడ తీవ్ర ట్రాఫిక్‌ జాం అయింది. సాయంత్రం విధులు ముగించుకొని ఇళ్లకు వెళ్లే ఉద్యోగులు 2-3 గంటలపాటు ట్రాఫిక్‌లో ఇరుక్కొని తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఉప్పల్‌, మల్కాజిగిరి, బండ్లగూడ, ముషీరాబాద్‌, కుత్బుల్లాపూర్‌, బండ్లగూడ, అంబర్‌పేట, హిమాయత్‌నగర్‌, సైదాబాద్‌, రాజేంద్రనగర్‌, గచ్చిబౌలి, కొండాపూర్‌ ప్రాంతాల్లో కురిసిన భారీ వర్షంతో ప్రధాన రహదారులు ఏకంగా చెరువులను తలపించాయి. ముసారాంబాగ్‌ బ్రిడ్జిపై భారీగా వరదనీరు నిలిచిపోవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. బేగంపేట మయూరి మార్గ్‌లోని, కుత్బుల్లాపూర్‌ వాజ్‌పేయినగర్‌లో పలు ఇళ్లలోకి వరదనీరు వచ్చి చేరింది. గచ్చిబౌలి పోలీస్‌ కమిషనరేట్‌ ఎదురుగా ప్రిన్స్‌టన్‌ మాల్‌ ఎదురుగా రోడ్డుపై నడుము లోతు వర్షపు నీరు నిలిచిపోవడంతో ఆ మార్గంలో వాహనాల రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. ఐటీ కారిడార్‌లో విధులు ముగించుకొని వెళ్లాల్సిన ఉద్యోగులు గంటల తరబడి ట్రాఫిక్‌లో చిక్కుకున్నారు. 30-45 నిమిషాల పట్టే మార్గంలో గంటన్నర నుంచి రెండు గంటల సమయం పట్టింది.

31.jpg


ఐటీ కారిడార్‌ నుంచి కోర్‌ సిటీ వెళ్లే మార్గాలైన జూబ్లీహిల్స్‌, బంజారాహిల్స్‌, మెహిదీపట్నం, బేగంపేట, సికింద్రాబాద్‌, చాదర్‌ఘాట్‌- మలక్‌పేట, ఆరాంఘర్‌, చాంద్రాయణగుట్ట ప్రాంతాల్లో కిలోమీటర్ల మేర ట్రాఫిక్‌ నిలిచిపోయింది. నాలాలు నిండుకుండల్లా ప్రవహిస్తుండటంతో వాటి సమీప ప్రాంతాలు, లోతట్లు ప్రాంతాల్లోని ప్రజలు భయాందోళన చెందుతున్నారు. సికింద్రాబాద్‌ ప్యాట్నీ నాలా పరిధిలోని ప్రాంతాలు నీట మునిగాయి. షోరూంలు, ఇళ్లలోకి నాలుగు అడుగుల మేర నీళ్లు చేరాయి. వరద నీటిలో చిక్కుకున్న వారిని హైడ్రా విపత్తు స్పందన బృందాలు (డీఆర్‌ఎఫ్‌) బోట్లలో బయటకు తీసుకువచ్చాయి. ముంపు ముప్పుపై ఫిర్యాదుల నేపథ్యంలో ప్యాట్నీ నాలాపై ఆక్రమణలను ఇటీవల హైడ్రా తొలగించింది. ఓ ఇంటి యజమాని అడ్డుకోవడంతో పనులు నిలిచిపోయాయని హైడ్రా వర్గాలు చెబుతున్నాయి. ఇదే ముంపునకు కారణమని పేర్కొన్నారు. హైడ్రా కమిషనర్‌ రంగనాథ్‌ ప్యాట్నీ ముంపు ప్రాంతాలను పరిశీలించారు. బోటులో తిరిగి సహాయక చర్యలను పర్యవేక్షించారు. కాగా, భారీ వర్షంతో రోడ్లపై ఎక్కడికక్కడ ట్రాఫిక్‌ జాం కావడంతో జనం మెట్రో రైళ్లలో ఎక్కేందుకు ఎగబడ్డారు. దీంతో రైళ్లన్నీ కిటకిటలాడాయి. ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలోనూ పలు ప్రాంతాల్లో శుక్రవారం తెల్లవారు జాము నుంచే కుండపోతగా వర్షాలు కురిశాయి. 24 గంటల్లో రంగారెడ్డి జిల్లా తలకొండపల్లి వెల్జాలలో అత్యధికంగా 150మి.మీ వర్షపాతం నమోదైంది.


270 ఫీడర్లలో విద్యుత్తు సరఫరాలో అంతరాయం

భారీ వర్షం కారణంగా గ్రేటర్‌లోని 270 ఫీడర్ల పరిధిలో విద్యుత్తు సరఫరాకు అంతరాయం కలిగింది. అయితే 200 ఫీడర్ల పరిధిలో 30 నిమిషాల్లో విద్యుత్తు సరఫరాను పునురుద్ధరించినట్లు టీజీ ఎస్పీడీసీఎల్‌ సీఎండీ ముషారఫ్‌ ఫరూఖీ తెలిపారు. క్షేత్రస్థాయిలో అధికారులు, సిబ్బంది 24 గంటలు అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. దక్షిణ డిస్కం టోల్‌ప్రీ నెంబర్‌ 1912తో పాటు సర్కిల్‌ కార్యాలయాల్లో ప్రత్యేక కంట్రోల్‌ రూంలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. వర్షం కారణంగా వాతావరణం అనుకూలించకపోవడంతో శంషాబాద్‌ అంతర్జాతీయ విమానాశ్రయానికి రావాల్సిన పలు విమాన సర్వీసులను దారి మళ్లించారు. రాంచి నుంచి రావాల్సిన ఐఎక్స్‌ 2674 విమానం, గోవా నుంచి రావాల్సిన ఇండిగో 6ఈ117 విమానాలను సైతం వైజాగ్‌కు మళ్లించారు. ఢిల్లీ నుంచి రావాల్సిన ఎయిరిండియా 2519 విమానాన్ని బెంగుళూరుకు మళ్లించారు.

గోడకూలి మహిళ మృతి..

రంగారెడ్డి జిల్లా బాలాపూర్‌ మండలం నాదర్‌గుల్‌లో భారీ వర్షానికి గోడ కూలి ఓ మహిళ మృతి చెందారు. నల్లగొండ జిల్లా అడవిదేవులపల్లి మండలం కొత్తూరు తండాకు చెందిన రమావత్‌ లక్ష్మి కుటుంబం.. నాదర్‌గుల్‌లోని ఎంవీఎ్‌సఆర్‌ ఇంజనీరింగ్‌ కాలేజీ వెనుక ఉన్న ఎల్‌ఆర్‌ ఎన్‌క్లేవ్‌ వెంచర్‌ ప్రహరీని ఆనుకొని గుడిసె వేసుకొని నివాసం ఉంటున్నారు. శుక్రవారం సాయంత్రం కురిసిన భారీ వర్షానికి లక్ష్మి గుడిసెలో నిద్రిస్తుండగా గోడకూలి ఆమెపై పడింది. దీంతో ఆమె అక్కడిక్కడే మృతి చెందారు.


అప్రమత్తంగా ఉండండి: సీఎం

హైదరాబాద్‌లో భారీ వర్షం నేపథ్యంలో అధికారులు అఽప్రమత్తంగా ఉండాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆదేశించారు. జీహెచ్‌ఎంసీ, హెచ్‌ఎండీఏ, జలమండలి, విద్యుత్తు, పోలీసు శాఖల సిబ్బంది సమన్వయంతో పనిచేయాలని సూచించారు. ఇక ఎస్డీఆర్‌ఎఫ్‌, ఎన్డీఆర్‌ఎఫ్‌, హైడ్రా బృందాలు, ఇతర విభాగాల అధికారులు అప్రమత్తంగా ఉండాలన్నారు. వర్షంతో ఇబ్బందులు పడుతున్న ప్రాంతాల ప్రజలు ఫిర్యాదు చేసిన వెంటనే స్పందించి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

4 రోజులపాటు భారీ వర్షాలు

రాష్ట్రంలో రానున్న నాలుగు రోజులు భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం తెలిపింది. ఈ నెల 22 వరకు పలు జిల్లాలకు భారీ వర్షసూచన ఉన్నట్లు పేర్కొంది. వచ్చే మంగళవారం వరకు ఎల్లో అలర్ట్‌ జారీ చేసింది. శనివారం సిద్దిపేట, రంగారెడ్డి, హైదరాబాద్‌, మేడ్చల్‌, వికారాబాద్‌, సంగారెడ్డి, మెదక్‌, కామారెడ్డి, మహబూబ్‌నగర్‌, నాగర్‌కర్నూల్‌ జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షం కురిసే అవకాశం ఉందని తెలిపింది. మిగిలిన అన్ని జిల్లాల్లోనూ ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడతాయని వెల్లడించింది. ఇక ఆదివారం రంగారెడ్డి, సంగారెడ్డి, నాగర్‌ కర్నూల్‌, వనపర్తి జిల్లాలో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ప్రకటించింది. రానున్న 48 గంటల్లో హైదరాబాద్‌ ప్రాంతంలో సాయంత్రం, రాత్రి వేళల్లో బలమైన ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం పడే అవకాశంఉందని తెలిపింది. ఇక గురువారం ఉదయం నుంచి శుక్రవారం ఉదయం వరకు రాష్ట్రంలోని 442 మండలాల్లో వర్షం పడినట్లు వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఇందులో 15 మండలాల్లో అతిభారీ వర్షం కురిసినట్లు తెలిపింది.


భువనగిరి ఆస్పత్రిలో వార్డులోకి నీరు..

యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్టలో శుక్రవారం సాయంత్రం కుండపోతగా వర్షం కురిసింది. స్థానిక సింహద్వారం నుంచి యోగానంద నిలయం, బస్టాండ్‌లో వరద ప్రవహించి జలమయం కావడంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగింది. జిల్లాకేంద్ర ఆస్పత్రిలోని జనరల్‌ వార్డు గోడకు లీకేజీ ఉండటంతో.. నీరు లోపలికి చేరి ఇన్‌పేషెంట్లు ఇబ్బంది పడ్డారు. కామారెడ్డి జిల్లా భిక్కనూరు మండల కేంద్రంతోపాటుగా పలు గ్రామాల్లో శుక్రవారం సాయంత్రం సుమారు గంటకు పైగా భారీ వర్షం కురిసింది. దీంతో రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లా వ్యాప్తంగా గురువారం అర్ధరాత్రి, శుక్రవారం ఉదయం వర్షం కురిసింది. జిల్లా అంతటా మోస్తరు నుంచి భారీ వర్షం కురవడంతో అన్నదాతలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఉమ్మడి మెదక్‌ జిల్లా వ్యాప్తంగా శుక్రవారం చిరు జల్లులు కురిశాయి.


ఇవి కూడా చదవండి
యూట్యూబ్‌లో ఆ వీడియోలపై ఆదాయం రద్దు.. కొత్త రూల్స్

ఎయిర్ పోర్టులో 10వ తరగతితో ఉద్యోగాలు..లాస్ట్ డేట్ ఎప్పుడంటే

మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Jul 19 , 2025 | 05:28 AM