Flood Damage: రహదారులు.. అతలాకుతలం!
ABN , Publish Date - Aug 20 , 2025 | 04:19 AM
నల్లగొండ జిల్లా మాడుగులపల్లి మండలం చెరువుపల్లి- కేశవాపురం మధ్య ఉన్న వాగులో వరద ఉధృతికి కల్వర్టు కొట్టుకుపోయింది... వనపర్తి జిల్లా నుంచి మదనాపూర్ మండలంలో ఊకచెట్టు వాగు ఉధృతంగా ప్రవహిస్తుండడంతో రాకపోకలకు అంతరాయం కలిగింది...
ఇటీవలి వర్షాలకు ధ్వంసమైన రోడ్లు.. కొన్ని చోట్ల కొట్టుకుపోయిన పరిస్థితి
వాగుల్లో వరద ఉధృతికి దెబ్బతిన్న కల్వర్టులు
గ్రామీణ ప్రాంతాల్లో రాకపోకలకు ఇబ్బందులు
(ఆంధ్రజ్యోతి న్యూస్ నెట్‌వర్క్): నల్లగొండ జిల్లా మాడుగులపల్లి మండలం చెరువుపల్లి- కేశవాపురం మధ్య ఉన్న వాగులో వరద ఉధృతికి కల్వర్టు కొట్టుకుపోయింది... వనపర్తి జిల్లా నుంచి మదనాపూర్ మండలంలో ఊకచెట్టు వాగు ఉధృతంగా ప్రవహిస్తుండడంతో రాకపోకలకు అంతరాయం కలిగింది... కుమరం భీం జిల్లా చింతలమానేపల్లి మండలంలో గూడెం కోయపల్లి రోడ్డు నామరూపాల్లేకుండా పోయింది. ఇలా.. ఒకటి, రెండూ కాదు.. రాష్ట్రంలో వందలాది రోడ్లు తీవ్రంగా దెబ్బతిన్నాయి. వాగులు, వంకలు ఉప్పొంగి ప్రవహించడంతో వంతెనలు, కల్వర్టులు కొట్టుకుపోయాయి. దీంతో వందలాది గ్రామాలకు రాకపోకలు నిలిచిపోగా.. ప్రజలు నరకయాతన అనుభవిస్తున్నారు. నల్లగొండ జిల్లా మాడుగులపల్లి మండలంలోని చెరువుపల్లి-కేశవాపురం రోడ్డు మధ్య ఏటి వాగు వరద ఉధృతికి కల్వర్టు కొట్టుకుపోవడంతో రాకపోకలు స్తంభించాయి. శాలిగౌరారం-కట్టంగూరు రోడ్డు 20 కిలోమీటర్ల మేర గుంతలమయమై వాహనాలు నడపడానికి వీల్లేకుండా ఉంది. చందంపేట మండలం చందంపేట- పొగిళ్ల రోడ్డు సుమారు 40కిలోమీటర్ల మేర గుంతలు పడడంతో అధ్వానంగా తయారైంది. యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండలం సంగెం-బొల్లెపల్లి, రుద్రవల్లి-జూలురు లోలెవల్ వంతెనల పై నుంచి మూసీ పరవళ్లు తొక్కుతోంది. దీంతో మూసీ పరివాహక ప్రాంతాల్లోని ప్రజల రాకపోకలు నిలిచిపోయాయి.
నిజామాబాద్ జిల్లా సిరికొండ మండలం మీరాబాయి తాండా వద్ద వరద ఉధృతికి బ్రిడ్జి పక్కన ఉన్న రోడ్డు కోతకు గురికావడంతో రాకపోకలు నిలిచిపోయాయి. బోధన్ డివిజన్‌లోని కోటగిరి, వర్ని, పోతంగల్, రుద్రూర్, బోధన్ ప్రాంతంలో వర్షాల వల్ల చాలా ప్రాంతాల్లో రోడ్లు పాక్షికంగా దెబ్బతిన్నాయి. ఆదిలాబాద్ జిల్లాలో దాదాపు 103.32 కిలోమీటర్ల రోడ్లు కోతకు గురయ్యాయి. 58 కల్వర్టులు తీవ్రంగా దెబ్బతిన్నాయి. నిర్మల్ జిల్లాలో 4 వంతెనలు, 87 కిలో మీటర్ల మేర రోడ్లు దెబ్బతిన్నాయి. తాత్కాలిక మరమ్మతుల కోసం రూ.77 లక్షలు మంజూరు చేయాలని అధికారులు ప్రతిపాదనలు కోసం ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు. మహబూబ్‌నగర్- హైదరాబాద్ జాతీయ రహదారిలో అప్పన్నపల్లి ఫ్లైఓవర్‌పై పలు చోట్ల గుంతలు పడడంతో ప్రమాదభరితంగా మారింది. మహబూబ్‌నగర్ జిల్లా ఊట్కూర్ మండలం పగిడిమర్రి బ్రిడ్జిపై నుంచి నీరు పారుతుండడంతో అమీన్‌పూర్, ఓబ్లాపూర్, సామనూర్ గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. భూనేడ్- మద్దూర్ మధ్య వాగు వంతెన మీదుగా పారుతోంది. భూనేడ్- కొత్తపల్లి మధ్య బ్రిడ్జి నిర్మాణం పూర్తి కాకపోవడంతో రాకపోకలు స్తంబించాయి.
నాగర్‌కర్నూల్ జిల్లా తాడూరు మండలంలోని సిర్సవాడ వద్ద దుందుభి నది ఉధృతంగా ప్రవహిస్తుండడంతో కల్వకుర్తికి వెళ్లే రహదారి కోతకు గురైంది. వంగూరు గేటు సమీపంలో కేఎల్‌ఐ కాల్వకు గండి పడి రాకపోకలకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. వనపర్తి జిల్లాలోని సరళాసాగర్ ఆటోమెటిక్ సైఫన్లు తెరుచుకోవడంతో ఊక చెట్టు వాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. దీంతో మదనాపూర్, ఆత్మకూరు మధ్యనున్న బ్రిడ్జి మీద రాకపోకలు నిలిచిపోయాయి. మంచిర్యాల జిల్లాలో 3.12 కిలోమీటర్ల మేర రోడ్లు, 5చోట్ల కాజ్‌వేలు కోతకు గురయ్యాయి. మరమ్మతులకు 35.5లక్షలు అవసరమని అధికారులు అంచనా వేశారు. ఆసిఫాబాద్ జిల్లాలో మాలన్‌గోంది వద్ద కల్వర్టు కోతకు గురైంది. రాజూరా, బూర్గుడ గ్రామాల మధ్య కల్వర్టు కోతకు గురికావడంతో రాకపోకలకు ప్రజలు అవస్థలు పడుతున్నారు. పెంచికల్‌పేట-బెజ్జూరు మధ్య రోడ్డు గుంతలమయంగా మారింది. జిల్లా వ్యాప్తంగా 24 రోడ్లు దెబ్బతిన్నాయని అధికారులు వెల్లడించారు.
ఈ వార్తలు కూడా చదవండి...
హౌసింగ్ స్కీమ్‌లో అవినీతి.. మంత్రి ఉత్తమ్ చర్యలు
ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్న ఎన్డీఏ.. సీఎం రేవంత్ ఫైర్
For More Telangana News and Telugu News..