Share News

Harish Rao: హరీశ్‌రావు పాదయాత్ర

ABN , Publish Date - Feb 12 , 2025 | 04:19 AM

బీఆర్‌ఎస్‌ సీనియర్‌ నేత, ఎమ్మెల్యే హరీశ్‌రావు త్వరలో పాదయాత్ర చేపట్టనున్నారు. సంగమేశ్వర, బసవేశ్వర ఎత్తిపోతల ప్రాజెక్టుల పనులను పూర్తి చేయాలనే డిమాండ్‌తో, ఆ ప్రాజెక్టుల నిర్దేశిత ఆయకట్టు ప్రాంతాల్లో ఆయన ఈ యాత్ర చేపడుతున్నారు.

Harish Rao: హరీశ్‌రావు పాదయాత్ర

  • సంగమేశ్వర, బసవేశ్వర ప్రాజెక్టుల్ని పూర్తి చేయాలనే డిమాండ్‌తో..

  • ఆ ప్రాజెక్టుల ఆయకట్టు ప్రాంతాల్లో వారం రోజులు.. 130 కి.మీ.

  • స్థానిక ఎన్నికల షెడ్యూల్‌ ఆధారంగా పాదయాత్ర తేదీలు

  • గ్రామాల్లో రోజుకో సభ.. చివరి రోజు కేసీఆర్‌ హాజరు

హైదరాబాద్‌/సంగారెడ్డి, ఫిబ్రవరి 11 (ఆంధ్రజ్యోతి): బీఆర్‌ఎస్‌ సీనియర్‌ నేత, ఎమ్మెల్యే హరీశ్‌రావు త్వరలో పాదయాత్ర చేపట్టనున్నారు. సంగమేశ్వర, బసవేశ్వర ఎత్తిపోతల ప్రాజెక్టుల పనులను పూర్తి చేయాలనే డిమాండ్‌తో, ఆ ప్రాజెక్టుల నిర్దేశిత ఆయకట్టు ప్రాంతాల్లో ఆయన ఈ యాత్ర చేపడుతున్నారు. రెండేళ్ల క్రితం 2022 ఫిబ్రవరి 21న నారాయణఖేడ్‌లో అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఈ ప్రాజెక్టులకు శంకుస్థాపన చేశారు. కాగా, ఇటీవల ఎర్రవల్లిలోని ఫామ్‌హౌ్‌సలో తనను కలిసిన పార్టీ నేతలతో కేసీఆర్‌ మాట్లాడుతూ.. సంగమేశ్వర, బసవేశ్వర ప్రాజెక్టులను కాంగ్రెస్‌ ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందన్నారు. ఈ ప్రాజెక్టుల కోసం పోరాడదామని శ్రేణులకు సూచించారు. ఈ బాధ్యతను సీనియర్‌ నేత హరీశ్‌రావుకు అప్పగించారు. అందుకు అనుగుణంగానే హరీశ్‌రావు పాదయాత్రకు సిద్ధమయ్యారు. స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్‌ మేరకు పాదయాత్ర తేదీలను ప్రకటించనున్నారు. ఎన్నికల షెడ్యూల్‌ త్వరలో వెలువడితే.. ఎన్నికల తర్వాత పాదయాత్ర ప్రారంభిస్తారు. ఎన్నికలు ఏప్రిల్‌, మేలో ఉంటే.. ఈ నెలలోనే పాదయాత్ర మొదలుపెడతారు. ప్రతి రోజూ సుమారు 18 నుంచి 20 కిలోమీటర్ల మేర యాత్ర కొనసాగుతుంది. ఆరు రోజులపాటు సుమారు 130 కిలోమీటర్ల యాత్ర కొనసాగించేలా షెడ్యూల్‌ రూపొందిస్తున్నారు. సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్‌, అందోల్‌, సంగారెడ్డి, జహీరాబాద్‌ నియోజకవర్గాల్లో ఈ పాదయాత్ర సాగుతుంది. సర్వే పూర్తయి భూసేకరణ దశలో నిలిచిపోయిన సంగమేశ్వర, బసవేశ్వర ఎత్తిపోతల ప్రాజెక్టుల పనులను వెంటనే ప్రారంభించి జిల్లాలోని 397 గ్రామాల్లో దాదాపు 4లక్షల ఎకరాలకు సాగునీటిని అందించాలని హరీశ్‌రావు కోరుతున్నారు.


సంగమేశ్వర ఆలయం వద్ద ప్రారంభం..

హరీశ్‌రావు పాదయాత్రను ఝరాసంగం మండలం కేతకి సంగమేశ్వర ఆలయం వద్ద ప్రారంభించి నారాయణఖేడ్‌లోని బసవేశ్వర విగ్రహం వద్ద ముగించనున్నట్లు సమాచారం. దాదాపు వారం రోజులపాటు పాదయాత్ర సాగేలా, ప్రతిరోజూ ఒక సభ నిర్వహించేలా రూట్‌మ్యాప్‌ సిద్ధం చేస్తున్నారు. పాదయాత్ర ముగింపు రోజు భారీ బహిరంగ సభ నిర్వహించనున్నట్లు, దీనికి బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ హాజరు కానున్నట్లు సమాచారం. ఎత్తిపోతల ప్రాజెక్టుల పనులను ప్రారంభించే డిమాండ్‌తోపాటు ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగట్టేందుకు కూడా ఈ పాదయాత్రను హరీశ్‌రావు వినియోగించుకోనున్నట్లు చెబుతున్నారు.


ఈ వార్తలు కూడా చదవండి..

తిరుపతి జిల్లా: నారావారిపల్లెలో విషాదం

ప్రభుత్వం నిరుపేదల గురించి ఆలోచించదా..: హరీష్‌రావు

ఏపీతో మూడు రాష్ట్రాలతో పోటీ

మనసులో మాట చెప్పిన రఘురామ..

Read Latest AP News and Telugu News

Read Latest Telangana News and National News

Read Latest Chitrajyothy News and Sports News

Updated Date - Feb 12 , 2025 | 04:19 AM