Share News

Harish Rao: ఆటో డ్రైవర్లకు ఇస్తామన్న 12 వేల భృతి ఏది?

ABN , Publish Date - Jun 28 , 2025 | 04:31 AM

ఎన్నికలకు ముందు ఆటో డ్రైవర్లకు ఏడాదికి రూ.12,000 భృతి ఇస్తామని హామీ ఇచ్చి.. అధికారంలోకి వచ్చాక ఆ ఊసే ఎత్తకుండా వారిని మోసం చేశారని ప్రభుత్వంపై బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే హరీశ్‌రావు ధ్వజమెత్తారు.

Harish Rao: ఆటో డ్రైవర్లకు ఇస్తామన్న 12 వేల భృతి ఏది?

  • ఎన్నికల్లో ఇచ్చిన హామీ ఊసే లేదేం?

  • ఏడాదిన్నరలో 142 మంది ఆత్మహత్య

  • ఇవన్నీ ప్రభుత్వ హత్యలే :హరీశ్‌

హైదరాబాద్‌, జూన్‌ 27 (ఆంధ్రజ్యోతి): ఎన్నికలకు ముందు ఆటో డ్రైవర్లకు ఏడాదికి రూ.12,000 భృతి ఇస్తామని హామీ ఇచ్చి.. అధికారంలోకి వచ్చాక ఆ ఊసే ఎత్తకుండా వారిని మోసం చేశారని ప్రభుత్వంపై బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే హరీశ్‌రావు ధ్వజమెత్తారు. శుక్రవారం పటాన్‌చెరువు ఆటోడ్రైవర్ల సంఘం ప్రతినిధులు హరీశ్‌ను కలిశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వచ్చిన 18 నెలల వ ్యవధిలో 142 మంది ఆటో డ్రైవర్లు ఆత్మహత్య చేసుకున్నారని, ఇవి ముమ్మాటికీ రేవంత్‌ ప్రభుత్వం చేసిన హత్యలే అని ఆరోపించారు. ఆటో డ్రైవర్ల సంక్షేమానికి బీఆర్‌ఎస్‌ పార్టీ ఎప్పుడూ ముందుంటుందన్నారు. ముఖ్యమంత్రి ఎన్నికల హామీలను అమలు చేసి, ఆటో డ్రైవర్లకు భద్రత కల్పించాలని, చనిపోయిన ఆటో డ్రైవర్ల కుటుంబాలకు కనీసం రూ.10 లక్షల సాయం అందించాలని హరీశ్‌ డిమాండ్‌ చేశారు.


ప్రాజెక్టుల భవిత వ్యం ప్రశ్నార్థకం

ఉన్న ప్రాజెక్టులను సరిగా నిర్వహించక, కొత్త ప్రాజెక్టుల ఆలోచన లేక తెలంగాణ సాగునీటి రంగాన్ని ప్రభుత్వం సంక్షోభంలో నెడుతున్నదని హరీశ్‌ విమర్శించారు. ఏడాదిన్నరగా కాళేశ్వరంపై ఏడుస్తూ కాలం వెల్లదీయడం తప్ప, ఒక చెరువు తవ్వింది లేదు, కొత్తగా ఒక్క ఎకరానికి కూడా నీరిచ్చింది లేదని విమర్శించారు.


అందాల పోటీల్లో ప్లేట్‌ భోజనం లక్ష: కేటీఆర్‌

23.jpg

హైదరాబాద్‌, జూన్‌ 27 (ఆంధ్రజ్యోతి): కాంగ్రెస్‌ ప్రభుత్వం పాఠశాలలు, గురుకులాలు, విశ్వవిద్యాలయాల్లో విద్యార్థులకు కనీసం పట్టెడన్నం కూడా పెట్టడం లేదు కానీ అందాల పోటీల పేరుతో విందుల్లో ప్లేటు భోజనానికి లక్ష రూపాయలు ఖర్చు పెట్టిందని కేటీఆర్‌ ఎక్స్‌ వేదికగా విమర్శలు గుప్పించారు. ‘అన్నపురాశులు ఒకచోట.. ఆకలి మంటలు ఒకచోట.. హంస తూలికలు ఒకచోట.. అలసిన దేహాలు ఒకచోట’ అని కవి కాళోజి నారాయణరావు చెప్పిన మాటలను తన ట్వీట్‌లో ప్రస్తావించారు. వేములవాడలో నిర్వహించిన కాంగ్రెస్‌ సభకు అధికారులు ఆలయ ఆదాయంతో ప్లేట్‌ భోజనానికి 36 వేలు, ఒక్కో పట్టు పంచకు 10 వేల రూపాయలు ఖర్చు చేశారని దుయ్యబట్టారు. అంతర్జాతీయ స్థాయిలో సమీకృత పాఠశాలలు అంటూ వందల కోట్లు దండుకునేందుకు టెండర్లు పిలిచిన కాంగ్రెస్‌ ప్రభుత్వం.. ఉన్న గురుకులాలు, విశ్వవిద్యాలయాల్లో భోజనం పెట్టకుండా విద్యార్థులను గోస పెడుతోందని పేర్కొన్నారు. విద్యా వ్యవస్థను నిర్వీర్యం చేస్తూ భావి తెలంగాణ భవిష్యత్తును కాంగ్రెస్‌ ప్రభుత్వం బలిపెడుతోందని విమర్శించారు.

Updated Date - Jun 28 , 2025 | 04:31 AM