Harish Rao: సాగునీటి రంగంలో రేవంత్ సర్కార్ విఫలం
ABN , Publish Date - May 26 , 2025 | 04:08 AM
కాంగ్రెస్ హయాం లో రాష్ట్ర ప్రయోజనాలు దెబ్బతింటున్నాయని, సాగునీటి ప్రయోజనాలు కాపాడటంలో సీఎం రేవంత్ ప్రభుత్వం విఫలమైందని మాజీ మంత్రి హరీశ్ ఆరోపించారు.
అనుమతుల్లేకుండా గోదావరి-బనకచర్ల నిర్మాణం
కిషన్‌రెడ్డి, బండి సంజయ్ ఏం చేస్తున్నారు?: హరీశ్
హైదరాబాద్/హైదరాబాద్ సిటీ, మే25(ఆంధ్రజ్యోతి): కాంగ్రెస్ హయాం లో రాష్ట్ర ప్రయోజనాలు దెబ్బతింటున్నాయని, సాగునీటి ప్రయోజనాలు కాపాడటంలో సీఎం రేవంత్ ప్రభుత్వం విఫలమైందని మాజీ మంత్రి హరీశ్ ఆరోపించారు. ఆదివారం తెలంగాణ భవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. గోదావరి-బనకచర్ల ప్రాజెక్టు నిర్మాణం వల్ల తెలంగాణకు నష్టం వాటిల్లుతుందని, గోదావరి జలాలను ఏపీకి తరలించుకుపోయే కుట్ర జరుగుతుంటే రేవంత్ మౌనంగా ఉండటం తగదన్నారు. ఏ అనుమతులు లేని గోదావరి-బనకచర్ల ప్రాజెక్టును చేపట్టవద్దని, ఈ అంశంపై నీతిఆయోగ్ సమావేశంలో సీఎం ఎందుకు ప్రశ్నించలేదని నిలదీశారు. రాష్ట్రానికి నష్టం కలిగించే విధంగా జలదోపిడీకి ప్రయత్నిస్తుంటే కేంద్ర మంత్రులు కిషన్‌రెడ్డి, సంజయ్ ఏం చేస్తున్నారని ఆయన ప్రశ్నించారు.
పదవుల కోసం విలువల్ని వదిలేస్తున్న కాలమిది
పదవులు, హోదాల కోసం విలువలను వదిలేసి, అవసరమైతే ఎవరినైనా తొక్కుకుంటూ ముందుకు వెళ్లడానికి సిద్ధపడుతున్న ఈ రోజుల్లో తెలంగాణ ఉద్యమం కోసం ప్రిన్సిపాల్ పదోన్నతిని త్యాగం చేసిన నిజాయితి నందిని సిధారెడ్డి సొంతమని హరీశ్ కొనియాడారు. కవి, తెలంగాణ సాహిత్య అకాడమీ తొలి అధ్యక్షుడు నందిని సిధారెడ్డి 70 వసంతాల సందర్భంగా ఏడు పదుల వెన్నెల పేరుతో ఆదివారం హైదరాబాద్‌లోని ఓ హోటల్‌లో జరిగిన అభినందన సభకు హరీశ్ రావు ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. ఈ సమావేశంలో ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి
Shashi Tharoor: పార్టీ కోసమే పని చేస్తున్నా.. క్లారిటీ ఇచ్చిన శశిథరూర్
ponnam prabhakar: తల్లిదండ్రులు వారి పిల్లలను శక్తి మేర చదివించాలి: పొన్నం