Harish Rao: రేవంత్.. తెలంగాణకు పట్టిన అబద్ధాల వైరస్!
ABN , Publish Date - Jul 03 , 2025 | 05:19 AM
ప్రజాభవన్ వేదికగా చంద్రబాబు, రేవంత్‌రెడ్డి మధ్య చీకటి ఒప్పందం కుదిరిందని మాజీ మంత్రి హరీశ్ ఆరోపించారు. అప్పుడే బనకచర్లకు పునాది పడిందన్నారు.
రాష్ట్ర ద్రోహుల జాబితాలో తొలి పేరు ఆయనదే.. చంద్రబాబు, రేవంత్ మధ్య చీకటి ఒప్పందం
ప్రజాభవన్ వేదికగా బనకచర్ల ప్రాజెక్టుకు పునాది
తెలంగాణ నీటి హక్కులకు సీఎం మరణ శాసనం
2016లో బనకచర్ల రాసిచ్చామంటూ మాపై అబద్ధాలు
కేసీఆర్ వాటర్‌మ్యాన్.. రేవంత్ ‘వాటా’ మ్యాన్
దమ్ముంటే అసెంబ్లీలో చర్చ పెట్టు.. నీ బట్టలు విప్పుతాం
ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిపై ధ్వజమెత్తిన హరీశ్
హైదరాబాద్, జూలై 2 (ఆంధ్రజ్యోతి): ప్రజాభవన్ వేదికగా చంద్రబాబు, రేవంత్‌రెడ్డి మధ్య చీకటి ఒప్పందం కుదిరిందని మాజీ మంత్రి హరీశ్ ఆరోపించారు. అప్పుడే బనకచర్లకు పునాది పడిందన్నారు. చంద్రబాబుకు గురుదక్షిణ చెల్లించడంలో భాగంగానే రేవంత్‌రెడ్డి తెలంగాణ నీటి ప్రయోజనాలకు మరణశాసనం రాసి.. ప్రజలకు అన్యాయం చేస్తున్నారని ధ్వజమెత్తారు. తెలంగాణ నీటి ప్రయోజనాల కోసం పాటుపడిన కేసీఆర్ వాటర్ మ్యాన్ అయితే.. రేవంత్‌రెడ్డి ‘వాటా మ్యాన్’ అని హరీశ్ విమర్శించారు. ‘తెలంగాణ ద్రోహుల జాబితాలో మొదటి పేరు నీదే. అదృష్టం కలిసొచ్చి సీఎం అయ్యావు. ఐదేళ్లు మంచిగా పనిచెయ్యి. రాష్ట్ర ద్రోహిగా మిగలకు’ అంటూ సీఎంకు హితవు పలికారు. రేవంత్‌రెడ్డి తెలంగాణకు పట్టిన అబద్ధాల వైరస్ అని.. ఆ వైర్‌సకు విరుగుడు బీఆర్‌ఎస్ అనే టీకా మాత్రమేనని చెప్పారు. బుధవారం తెలంగాణ భవన్‌లో హరీశ్ మీడియాతో మాట్లాడారు. విభజన హామీల ముసుగులో ప్రజాభవన్ వేదికగా 2024 జులె ౖ6న జరిగిన సమావేశంలో చంద్రబాబు, రేవంత్‌రెడ్డి మధ్య చీకటి ఒప్పందం జరిగిందన్నారు. ఆ రోజే బనకచర్లకు పునాది పడిందని, రేవంత్ తన గురువు కోసం తెలంగాణ ప్రజలకు అన్యాయం చేస్తున్నారని విమర్శించారు. మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి సతీసమేతంగా 2024 సెప్టెంబరు 13న విజయవాడలో ఏపీ సీఎంను కలిసి, బెజవాడ బజ్జీలు తిని, బనకచర్లకు మద్దతు తెలిపి వచ్చారని చెప్పారు. ఈ క్రమంలోనే నవంబరు 15న ఏపీ గోదావరి బేసిన్ లింక్‌కు సహకరించాలంటూ చంద్రబాబు కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్‌కు లేఖ రాశారని పేర్కొన్నారు. ఆ వెంటనే రూ.80 వేల కోట్ల ప్రాజెక్టు కోసం ఆర్థిక సాయం అందించాలని డిసెంబరు 31న నిర్మలకు మరో లేఖ రాశారన్నారు.
ఓవైపు గోదావరి నీళ్ల తరలింపునకు కుట్రలు జరుగుతుంటే తనకేం తెలియనట్లు సీఎం రేవంత్‌రెడ్డి మౌనం నటించారని ఆరోపించారు. ఏపీ చేస్తున్న కుట్రలు తమకు తెలియగానే నిలదీశామని హరీశ్ చెప్పారు. 2025 జనవరి 24న ప్రెస్‌మీట్ పెట్టి కాంగ్రెస్ నేతలు గడ్డి పీకుతున్నారా అని నిలదీస్తే.. అదే రోజు సాయంత్రం పాత తేదీతో అప్పటికే తాను కేంద్రానికి లేఖ రాశానని ఉత్తమ్ ప్రకటించడం విడ్డూరంగా ఉందని అన్నారు. బనకర్లను ఆపే చిత్తశుద్ధి రేవంత్‌కు లేదని చెప్పారు. ప్రజాభవన్‌లో ఆయన ఇచ్చిన ప్రెజెంటేషన్ అమరావతిలో తయారు చేసినట్లుగా ఉందని ధ్వజమెత్తారు. అందులో బనకచర్ల అంశం లేదని, ఉద్దేశపూర్వకంగా 2016 గోదావరి-పెన్నా అనుసంధానం అనే హెడ్డింగ్ పెట్టి కేసీఆర్ మొత్తం నీళ్లు వదిలేశారంటూ అబద్ధాలు చెప్పారని దుయ్యబట్టారు. ఈ ప్రదర్శనకు కేవలం కాంగ్రెస్ ఎమ్మెల్యేలనే కాకుండా అందరినీ పిలిస్తే వాస్తవం బయటపడేదన్నారు. రాజ్యాంగ పదవిలో ఉన్న రేవంత్‌రెడ్డి తప్పుడు వ్యాఖ్యలు చేయడం తగదని చెప్పారు. కాళేశ్వరంతోపాటు పాలమూరు, డిండి, భక్తరామదాసు వంటి ఎన్నో ప్రాజెక్టులను చంద్రబాబు ఆపే ప్రయత్నం చేశారని, ఆ విషయాలను ఎందుకు చూపించలేదని ప్రశ్నించారు. 2016లో బనకచర్ల రాసి ఇచ్చారంటూ తమపై అసత్య ప్రచారం చేస్తున్నారని.. అపెక్స్ కౌన్సిల్ సమావేశంలో ఇచ్చిన లేఖలో లేని విషయాలను చెబుతూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని ఆరోపించారు. ఆ భేటీలో బనకచర్ల అనే పదం ఉందా? ఒక్క పేరా చదివిన సీఎం.. అజెండా 5లో చెప్పిన అంశాలను ఎందుకు చదివి వినిపించలేదో చెప్పాలని డిమాండ్ చేశారు. వరద జలాల వినియోగంలో రెండు రాష్ట్రాలకు ఉపయోగపడేలా, ఆమోదయోగ్యంగా వాడుకునేందుకు సంప్రదింపులు చేసుకోవాలని మాత్రమే అందులో ఉందని హరీశ్ స్పష్టం చేశారు. ‘దమ్ముంటే అసెంబ్లీలో చర్చ పెట్టు. వాస్తవాలు బయట పెడతాం. సభ సాక్షిగా నీ బట్టలు విప్పుతాం’ అని సీఎంకు సవాలు విసిరారు. ‘15 రోజులు కృష్ణా, 15 రోజులు గోదావరి మీద మొత్తం నెల రోజులు మాట్లాడదాం. రేపే అసెంబ్లీ పెట్టు. ఎంతసేపైనా మాట్లాడు. వాయిదా వేయొద్దు. పారిపోవద్దు. మాకూ ప్రెజెంటేషన్ చేసే అవకాశం ఇవ్వు’ అని హరీశ్ కోరారు. చంద్రబాబు కోవర్టులున్నారని మీ ఎమ్మెల్యే అనిరుధ్‌రెడ్డి అంటున్నారని, ఆ కోవర్టులెవరో చెప్పాలని నిలదీశారు. తాను ఇంకా ప్రతిపక్షంలోనే ఉన్నట్లుగా రేవంత్ భావిస్తున్నారని ఎద్దేవా చేశారు. ఏ విధంగా చూసినా గోదావరి-బనకచర్ల తెలంగాణకు మరణ శాసనం కానుందని అన్నారు.
ఆ మాటంటే నాలుక చీరేస్తాం..!
కృష్ణా జలాల్లో 299 టీఎంసీలను తెలంగాణ వాటాగా బీఆర్‌ఎస్ అంగీకరించిందంటూ అబద్ధాలు చెబితే నాలుక చీరేస్తామని హరీశ్ హెచ్చరించారు. గోదావరిలో 968 టీఎంసీలు, కృష్ణాలో 299 టీఎంసీలు ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ అని.. 2013 నవంబరు 18న శ్రీకృష్ణ కమిటీకి అప్పటి ప్రభు త్వం ఇచ్చిన నివేదికలో పేర్కొందని గుర్తుచేశారు. నివేదికను అసెంబ్లీలో కూడా పెట్టారని.. ఆ విషయం సీఎం తెలుసుకోవాలని సూచించారు. అవసరమైతే ఆ డాక్యుమెంట్లను విడుదల చేస్తానని చెప్పారు. 299 టీఎంసీల లెక్కకు ద్రోహి ప్రస్తుత తెలంగాణ ప్రభుత్వ సలహాదారు ఆదిత్యనాథ్ దాస్ అని.. ఈ రాచపుండుకు ఆయనే కారణమని ఆరోపించారు. రెండో అపెక్స్ కౌన్సిల్ సమావేశంలో కేంద్ర మంత్రి షెకావత్ సూచన మేరకు బీఆర్‌ఎస్ ప్రభుత్వం సుప్రీంకోర్టులో వేసిన కేసును వాపస్ తీసుకొని.. సెక్షన్ 3ని సాధించిందని చెప్పారు. దానిపై తెలంగాణ వాదనలు ముగింపు దశలో ఉన్నాయని, ఈ ఏడాదిలోనే 763 టీఎంసీలు మనకు వచ్చే అవకాశం ఉందన్నారు. ఇది తెలియకుండానే అమాయక చక్రవర్తి 500 టీఎంసీలు చాలని గతంలో చెప్పారన్నారు. 2020 అక్టోబరు 2న కేసీఆర్ అప్పటికే కేంద్ర మంత్రి షెకావత్‌కు రాసిన లేఖలో సముద్రంలో వృథాగా కలుస్తున్న 3000 టీఎంసీల్లో 1950తో పాటు ప్రస్తుతం ఉన్న 968 టీఎంసీలను కలుపుకొని మొత్తం 2918 టీఎంసీలు తెలంగాణ హక్కుగా పేర్కొన్నారని తెలిపారు. కానీ, గోదావరిలో 1000, కృష్ణాలో 500 టీఎంసీలు ఇచ్చి ఏమైనా చేసుకో అని చెప్పిన రేవంత్‌రెడ్డి.. ఇప్పుడు మాటమార్చి వరద జలాల్లోనూ వాటా కావాలని అంటున్నారని గుర్తుచేశారు. కృష్ణాలో గత పదేళ్లలో ఎప్పుడూ వాడనంత తక్కువ నీటిని (28 శాతం) వాడిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానిదేనని, ఉన్న తాత్కాలిక ఒప్పందం ప్రకారం కూడా నీళ్లు వాడని దద్దమ్మ ప్రభుత్వం రేవంత్‌రెడ్డిదని హరీశ్ ఆగ్రహం వ్యక్తంచేశారు.
రేవంత్‌రెడ్డి, కిషన్‌రెడ్డి మధ్య లవ్వేంది?
సీఎం రేవంత్‌రెడ్డి, కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి మధ్య ఉన్న ఫెవికాల్ బంధమేంటో అర్థం కావడం లేదని హరీశ్ అన్నారు. మేడిగడ్డలో పిల్లర్ కుంగితే రెండ్రోజుల్లో కేంద్ర సంస్థల్ని పిలిపించారని.. ఎస్‌ఎల్‌బీసీ మొత్తానికే కూలిపోతే ఎన్డీఎ్‌సఏకు ఎందుకు లేఖ రాయలేదని నిలదీశారు. కిషన్‌రెడ్డి, రేవంత్‌రెడ్డి కలిసి తెలంగాణ నీటి ప్రయోజనాలు దెబ్బతీశారని.. వారిమధ్య ఉన్న లవ్వేందని హరీశ్ ప్రశ్నించారు.
బాబు బంగారం.. బీఆర్‌ఎస్ చచ్చిన పామా?
బనకచర్ల కట్టి తెలంగాణకు నష్టం కలిగించే కుట్రలు చేస్తున్న చంద్రబాబు నీ దృష్టిలో బంగారం.. దాన్ని అడ్డుకోవడానికి పోరాడుతున్న బీఆర్‌ఎస్ చచ్చిన పామా? అని సీఎంను హరీశ్ ప్రశ్నించారు. ఒక్కసారి ఓడినంత మాత్రాన గులాబీ పార్టీ చచ్చిన పామైతే.. చాలా రాష్ట్రాల్లో అదేపనిగా ఓడిపోతున్న కాంగ్రె్‌సను ఏమనాలని నిలదీశారు. నువ్వు పీసీసీ అధ్యక్షుడిగా ఉన్నపుడు జరిగిన ఉప ఎన్నికల్లో ఎన్నడూ గెలవలేదు కదా? దాన్నేమనాలి? అంటూ రేవంత్‌ను ప్రశ్నించారు. రేవంత్‌రెడ్డి టెక్నికల్‌గా కాంగ్రెస్ సీఎం అయినా.. ఆయన హృదయం టీడీపీలోనే ఉందని ఎద్దేవా చేశారు. కేసీఆర్ పేరెత్తకుండా రేవంత్ ఒక్క సమావేశంలో కూడా మాట్లాడలేడని, అహంకారంతో ప్రవర్తిస్తే ప్రజలు పాతాళానికి తొక్కుతారని హెచ్చరించారు. బనకచర్లపై బొంకుడు రాజకీయాలు మాని.. రాష్ట్ర ప్రయోజనాలపై దృష్టి పెట్టాలని సూచించారు. నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కూడా కనీస అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని, ఎంతో కష్టపడి సీతారామకు అనుమతులు తెచ్చామని చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. 2023లోనే బీఆర్‌ఎస్ ప్రభుత్వం సీతారామ, సీతమ్మ సాగర్‌కు 25 అనుమతులు సాధించిందని చెప్పారు.
ఇవి కూడా చదవండి
రూ.15 వేల పెట్టుబడితో రూ.12 కోట్ల రాబడి.. ఎలాగో తెలుసా..
పాత పన్ను విధానం ఎంచుకున్న వారికి గుడ్ న్యూస్..
మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి