Share News

Godavari Floods: మహోగ్ర గోదావరి!

ABN , Publish Date - Aug 21 , 2025 | 04:43 AM

గోదావరి మహోగ్ర రూపం దాల్చింది. పరీవాహక ప్రాంతాల్లో భారీ వర్షాలతో పెద్ద ఎత్తున వరద నదిలో చేరుతుండటంతో పలు జిల్లాల్లో ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తోంది.

Godavari Floods: మహోగ్ర గోదావరి!

  • భద్రాచలం వద్ద 48 అడుగులకు ప్రవాహం.. రెండో ప్రమాద హెచ్చరిక జారీ

  • అప్రమత్తంగా ఉండాలని అధికారులకు మంత్రులు పొంగులేటి, తుమ్మల ఆదేశాలు

  • ములుగు, భూపాలపల్లి జిల్లాల్లోనూ ప్రమాద హెచ్చరికలు.. మునిగిన పంటలు

  • సమ్మక్కసాగర్‌ బ్యారేజీకి 10.27 లక్షల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో

  • కృష్ణాలో శ్రీశైలానికి 4.78 లక్షలు, సాగర్‌కు 4.85 లక్షల క్యూసెక్కులు

  • నేడు, రేపు తేలికపాటి వర్షాలు..

(ఆంధ్రజ్యోతి న్యూస్‌ నెట్‌వర్క్‌): గోదావరి మహోగ్ర రూపం దాల్చింది. పరీవాహక ప్రాంతాల్లో భారీ వర్షాలతో పెద్ద ఎత్తున వరద నదిలో చేరుతుండటంతో పలు జిల్లాల్లో ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తోంది. బుధవారం భద్రాద్రి కొత్తగూడెం, ములు గు, భూపాలపల్లి జిల్లాల్లో అధికారులు ప్రమాద హెచ్చరికలు జారీ చేశారు. పలు గ్రామాలకు రాకపోకలకు అంతరాయం ఏర్పడగా.. పంటపొలాలు నీట మునిగాయి. దీంతో అధికారులు అప్రమత్తమై లోతట్టు ప్రాంతాల ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించారు. భద్రాచలం వద్ద రాత్రి 10.05 గంటలకు గోదావరి 48 అడుగులకు చేరడంతో రెండో ప్రమాద హెచ్చరికను జారీ చేశారు. దేవస్థానం స్నానఘట్టాలు మునిగిపోగా.. కల్యాణ కట్ట కిందిభాగంలోకి వరద నీరు చేరింది. దీంతో భక్తులు వెళ్లకుండా బారికేడ్లు ఏర్పాటు చేశారు. ఈ నేపథ్యంలోనే.. అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండి, భద్రాచలం పరిసరాల్లోని లోతట్టు ప్రాంతాలపై దృష్టి పెట్టాలని మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు జిల్లా అధికారులను వేర్వేరుగా ఆదేశించారు. కలెక్టర్‌ జితేశ్‌ వీ పాటిల్‌, ఎస్పీ రోహిత్‌రాజు భద్రాచలం గోదావరి వరద కరకట్టపై నుంచి వరద ఉధృతిని పరిశీలించారు. అన్ని ముందస్తు జాగ్రత్తలు చేపట్టినట్లు తెలిపారు. ములుగు జిల్లాలోని ఏటూరునాగారం మండలం రామన్నగూడెం పుష్కరఘాట్‌ వద్ద.. వాజేడు మండలం పేరూరు వద్ద అధికారులు రెండో ప్రమాద హెచ్చరికను జారీ చేశారు. బ్యాక్‌ వాటర్‌తో చాలాచోట్ల పంట పొలాలు నీట మునగ్గా.. పలు గ్రామాలకు రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. జిల్లా వ్యాప్తంగా 78 కుటుంబాలను పునరావాస కేంద్రాలకు తరలించినట్లు కలెక్టర్‌ దివాకర తెలిపారు. భూపాలపల్లి జిల్లాలో కాళేశ్వరం వద్ద మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. తుపాకులగూడెం వద్ద సమ్మక్కసాగర్‌ బ్యారేజీకి అత్యధికంగా 10.27 లక్షల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో నమోదవ్వగా.. దిగువన మేడిగడ్డ బ్యారేజీకి 10.20 లక్షల క్యూసెక్కుల వరద వస్తోంది. ఆయా బ్యారేజీలకు వచ్చిన వరద వచ్చినట్లే దిగువకు వదులుతున్నారు. గోదావరి బేసిన్‌లో ఎగువన ఉన్న శ్రీరాంసాగర్‌ ప్రాజెక్టుకు 2.30 లక్షల క్యూసెక్కులు వస్తుండగా.. ఔట్‌ఫ్లో 3.06 లక్షల క్యూసెక్కులుగా ఉంది. ఎల్లంపల్లికి 4.86 లక్షల క్యూసెక్కుల వరద వస్తుండగా.. ఔట్‌ఫ్లో 5.31 లక్షల క్యూసెక్కులుగా ఉంది. సింగూ రుకు 38 వేల క్యూసెక్కులు వస్తుండగా.. 43 వేల క్యూసెక్కులను వదులుతున్నారు. నిజాంసాగర్‌కు 72 వేల క్యూ సెక్కులు రాగా... ఔట్‌ఫ్లో 69 వేల క్యూసెక్కులుగా ఉంది.


కృష్ణా ప్రాజెక్టులకూ భారీగానే..

కృష్ణా బేసిన్‌లోని ప్రాజెక్టులకు భారీగానే వరద చేరుతోంది. శ్రీశైలానికి 4.78 లక్షల క్యూసెక్కుల వరద రాగా.. 5.18 లక్షల క్యూసెక్కులను దిగువకు వదిలిపెట్టారు. నాగార్జునసాగర్‌కు 4.85 లక్షల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో ఉండగా.. ఔట్‌ఫ్లో 4.78 లక్షల క్యూసెక్కులుగా ఉంది. ఆల్మట్టికి 2.45 లక్షల క్యూసెక్కుల వరద రాగా.. 2.50 లక్షల క్యూసెక్కులను వదిలారు. నారాయణపూర్‌కు 2.50 లక్షల క్యూసెక్కు ల ఇన్‌ఫ్లో వస్తుండగా.. 2.60 లక్షల క్యూసెక్కుల ఔట్‌ ఫ్లో ఉంది. జూరాలకు 3.30 లక్షల క్యూసెక్కులు వస్తుండగా.. 3.22 లక్షల క్యూసెక్కులను దిగువకు వదులుతున్నారు.


పలు జిల్లాల్లో వర్షాలు..

రాష్ట్రవ్యాప్తంగా పలు జిల్లాల్లో వర్షాలు కురిశాయి. చాలాచోట్ల వాగులు, చెరువులు పొంగి పొర్లుతున్నాయి. భద్రాద్రి కొత్తగూడెం, నాగర్‌కర్నూల్‌, నారాయణపేట, వనపర్తి, యాదాద్రి భువనగిరి, పెద్దపల్లి జిల్లాల్లో మంగళవారం రాత్రి నుంచి బుధవారం ఉదయం వరకు వాన లు పడ్డాయి. కొత్తగూడెం జిల్లా కేంద్రంలో అత్యధికంగా 6.4 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. యాదాద్రి జిల్లా బొమ్మలరామారం మండలం మర్యాలలో మంగళవారం ఈతకు వెళ్లి గల్లంతైన నందులాల్‌ (20) మృతదేహం లభ్యమైంది. డిండి రిజర్వాయర్‌ నిండింది. కామారెడ్డి జిల్లా నాగిరెడ్డిపేట మండలంలోని చీనూర్‌లో మంజీరా వరదతో మునిగిన పంటలను ఎల్లారెడ్డి నియోజకవర్గ ఎమ్మెల్యే మదన్‌మోహన్‌ పరిశీలించారు. ఈ సందర్భంగా ఓ మహిళా రైతు ఎమ్మెల్యే కాళ్లపై పడి ఆదుకోవాలని వేడుకోవడం కంటతడి పెట్టించింది. ఆసిఫాబాద్‌ జిల్లా కెరమెరి మండలంలోని బోరిలాల్‌గూడ కు చెందిన అంగన్‌వాడీ టీచర్‌ పవార్‌ కవిత తీవ్ర జ్వరంతో బాధపడుతుండటంతో కుటుంబీకులు, గ్రామస్థులు భుజాలపై ఎత్తుకుని వాగు దాటించి ఆస్పత్రికి తరలించారు. కాగా, రాష్ట్రంలో గురు, శుక్రవారాల్లో కొన్ని జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం వెల్లడించింది. గురువారంఆదిలాబాద్‌, కొత్తగూడెం, హైదరాబాద్‌ సహా 18 జిల్లాల్లో వానలు కురిసే అవకాశముందని తెలిపింది.


ఈ వార్తలు కూడా చదవండి..

బతుకమ్మ కుంట అభివృద్ధి పనులపై హైడ్రా ఫోకస్

హైదరాబాద్‌పై ప్రపంచ దృష్టి.. అభివృద్ధిని అడ్డుకునే వారే శత్రువులు: సీఎం రేవంత్‌రెడ్డి

Read latest Telangana News And Telugu News

Updated Date - Aug 21 , 2025 | 04:43 AM