GHMC: జీహెచ్‌ఎంసీ ఖజానాకు కన్నం.. రూ.56 లక్షలు కాజేసిన ఆపరేటర్
ABN , Publish Date - Aug 29 , 2025 | 08:10 AM
జీహెచ్‌ఎంసీలో మరో అవినీతి బాగోతం బయటపడింది. ఆన్‌లైన్ చెల్లింపుల విధానం అందుబాటులోకి వచ్చినా నగదు వసూళ్లను కొందరు అక్రమార్జన వనరుగా మార్చుకున్నారు. సంస్థలోని పౌర సేవా కేంద్రాల్లో (సీఎస్సీ) వసూలైన పన్నును ఖజానాలో జమ చేయకుండా కొందరు ఉద్యోగులు నొక్కేశారు.
- తప్పు ఒప్పుకుని ఒకే రోజులో వాపస్
హైదరాబాద్: జీహెచ్‌ఎంసీ(GHMC)లో మరో అవినీతి బాగోతం బయటపడింది. ఆన్‌లైన్ చెల్లింపుల విధానం అందుబాటులోకి వచ్చినా నగదు వసూళ్లను కొందరు అక్రమార్జన వనరుగా మార్చుకున్నారు. సంస్థలోని పౌర సేవా కేంద్రాల్లో (సీఎస్సీ) వసూలైన పన్నును ఖజానాలో జమ చేయకుండా కొందరు ఉద్యోగులు నొక్కేశారు. శేరిలింగంపల్లి జోన్‌లో ఈ బాగోతం మరోసారి బయటపడింది. చందానగర్ సర్కిల్ ఏర్పడిన నాటి నుంచి అక్కడి పౌర సేవా కేంద్రంలో ఓ మహిళ(సుభాషిణి) కంప్యూటర్ ఆపరేటర్‌గా విధులు నిర్వర్తిస్తోంది.
ఆస్తిపన్ను, ట్రేడ్ లైసెన్స్ రుసుము వంటి చెల్లింపులతో పాటు జనన, మరణ ధ్రువీకరణ పత్రాల జారీ, ఆస్తిపన్ను మదింపు దరఖాస్తుల స్వీకరణ సీఎ్‌ససీలో జరుగుతోంది. పౌరులు చెల్లించిన ఆస్తిపన్ను, ట్రేడ్ లైసెన్స్ రుసుమును బల్దియా ఖాతాలో ఆమె జమ చేయలేదని తాజాగా నిర్వహించిన ఆడిట్‌లో బహిర్గతమైంది. 2024-25 ఆర్థిక సంవత్సరం ఆరంభం నుంచి ఇప్పటి వరకు సుమారు రూ.56 లక్షలు పక్కదారి పట్టాయని అధికారులు అంతర్గత పరిశీలనలో గుర్తించారు.

ఆడిట్‌తో బహిర్గతం
పన్ను చెల్లింపునకు సంబంధించిన రశీదులు ఇచ్చినప్పటికీ, వసూలైన మొత్తం ఖాతాలో జమ కాలేదని సర్కిల్ కార్యాలయంలో నిర్వహించిన ఆడిట్‌లో ఆడిటర్లు తేల్చారు. దీంతో సదరు ఆపరేటర్ నుంచి వివరాలు సేకరించే ప్రయత్నం చేయగా ఆమె అందుబాటులోకి రావడం లేదని ఓ అధికారి చెప్పారు. ఉన్నతాధికారులు రంగంలోకి దిగి ఆమెను కార్యాలయానికి పిలిపించారు.
కంప్యూటర్ లాగిన్ ఐడీ, పాస్ వర్డ్ ద్వారా ఆమె వినియోగించిన కంప్యూటర్‌ను పరిశీలించారు. ఈ క్రమంలో 2024 ఏప్రిల్1 నుంచి 2025 మార్చి31 వరకు రూ.36లక్షలు, 2025 ఏప్రిల్ నుంచి ఇప్పటి వరకు సుమారుగా రూ.21 లక్షలు వసూలైన నగదును ఖాతాలో జమ చేయలేదని గుర్తించారు. తప్పు చేసినట్టు అంగీకరించిన ఆపరేటర్.. ఒక్క రోజులోనే రూ.56 లక్షలను (ఆగస్టు 26న) జీహెచ్‌ఎంసీ ఖాతాలో జమ చేసింది. ఒకే రోజు అంత పెద్ద మొత్తం జమ చేయడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
ఈ వార్తలు కూడా చదవండి..
పెరిగిన బంగారం ధరలు.. ఈ రోజు రేట్స్ ఎలా ఉన్నాయంటే..
4 నెలల్లో రాష్ట్ర రాబడి రూ.74,955 కోట్లు
Read Latest Telangana News and National News