GHMC: ట్రాన్స్‌జెండర్లకు జీహెచ్‌ఎంసీ అండ..
ABN , Publish Date - Aug 16 , 2025 | 07:52 AM
సమాజంలో ఇన్నాళ్లూ వివక్షకు గురైన వారికి ఇప్పుడు చేయూత లభిస్తోంది. ఉపాధి అవకాశాలు కల్పించేందుకు కొందరు ముందుకు వస్తున్నారు. స్వయం ఉపాధి పొందేందుకు వారిలో ఇంకొందరు సిద్ధమవుతున్నారు.
- ఉద్యోగ, ఉపాధి అవకాశాలు
- స్వయం ఉపాధికి రుణాలు
- 155 మందికి రూ.1.55 కోట్లు
- జాబ్ ఆఫర్ లెటర్లు, రుణాల చెక్కుల అందజేత
- ఇప్పటికే వ్యాపారాలు ప్రారంభించిన పలువురు
హైదరాబాద్ సిటీ: సమాజంలో ఇన్నళ్లూ వివక్షకు గురైన వారికి ఇప్పుడు చేయూత లభిస్తోంది. ఉపాధి అవకాశాలు కల్పించేందుకు కొందరు ముందుకు వస్తున్నారు. స్వయం ఉపాధి పొందేందుకు వారిలో ఇంకొందరు సిద్ధమవుతున్నారు. ఇదంతా ట్రాన్స్‌జెండర్ల విషయంలో సమాజంలో వస్తున్న మార్పు, వారికి(ట్రాన్స్‌జెండర్ల) భవితపై కలుగుతున్న నమ్మకానికి నిదర్శనం. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి(Chief Minister Revanth Reddy) ఆదేశాల నేపథ్యంలో ట్రాన్స్‌జెండర్లకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించేందుకు ప్రభుత్వ విభాగాలు చొరవ చూపుతున్నాయి.
ఓ సంస్థతో కలిసి జీహెచ్‌ఎంసీ 155 మంది ట్రాన్స్‌జెండర్లకు వివిధ అంశాల్లో శిక్షణ ఇచ్చింది. వారిలో 151 మంది స్వయం ఉపాధి పొందేందుకు బ్యాంకు రూ.1.50 కోట్ల రుణం అందించడంలో బల్దియా కీలకంగా వ్యవహరించింది. హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలోని ట్రాఫిక్ విభాగంలో ఇప్పటికే 38 మంది ట్రాన్స్‌జెండర్లు ట్రాఫిక్ అసిస్టెంట్లుగా విధులు నిర్వర్తిస్తున్నారు.

గ్రాఫిక్ డిజైనింగ్‌లో శిక్షణ
జీహెచ్‌ఎంసీ సహకారంతో చందానగర్‌లో లైట్ హౌస్ కమ్యూనిటీస్ నైపుణ్య కేంద్రంలో నిరుద్యోగులకు కొన్నాళ్లుగా ఉచిత శిక్షణ ఇస్తున్నారు. ఇందులో భాగంగా నలుగురు ట్రాన్స్‌జెండర్లు మధురాజ్, ఇమ్రాన్‌ఖాన్, నవీన, వరుణ్‌తేజ్‌లో ఆ కేంద్రంలో గ్రాఫిక్ డిజైన్ కోర్సుల్లో 15 రోజులపాటు శిక్షణ ఇచ్చారు. శుక్రవారం జీహెచ్‌ఎంసీ ప్రధాన కార్యాలయంలో జరిగిన స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో ఆ నలుగురికి మేయర్ విజయలక్ష్మి, కమిషనర్ ఆర్‌వీ కర్ణన్‌లు జాబ్ ఆఫర్ లెటర్లు అందించారు.

155 మందికి రూ.1.55 కోట్లు..
మహాళా స్వయం సహాయక సంఘాల (ఎస్‌హెచ్‌జీ) తరహాలోనే ట్రాన్స్‌జెండర్లకూ బ్యాంకు లింకేజీ రుణాలు జీహెచ్‌ఎంసీ ద్వారా అందుతున్నాయి. ఎస్‌హెచ్‌జీల్లో గ్రూపులు ఉండగా.. ట్రాన్స్‌జెండర్లకు మాత్రం వ్యక్తిగతంగా రుణాలు ఇస్తున్నారు. 155 మంది ట్రాన్స్‌జెండర్లకు ఒక్కొక్కరికి రూ.లక్ష చొప్పున రూ.1.55 కోట్లు బ్యాంకుల నుంచి రుణంగా అందించేందుకు జీహెచ్‌ఎంసీ చొరవ తీసుకుంటోంది. రుణాలు తీసుకున్న వారిలో సూరారంలో ఇద్దరు టీ కొట్టులు, మరో ప్రాంతంలో ఒకరు జూట్ బ్యాగ్‌ల తయారీ, ఇంకొందరు కర్రీ పాయింట్లు, కిరాణ దుకాణాలు ఏర్పాటు చేసుకున్నారు. మిగతా వారికీ దశల వారీగా రుణాలు అందుతాయని కర్ణన్ తెలిపారు.
ఈ వార్తలు కూడా చదవండి..
మరింతగా తగ్గిన బంగారం ధర.. ఈ రోజు మీ నగరంలో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే..
Read Latest Telangana News and National News