Share News

Agricultural Crisis: జోరు వానలోనూ బారులు

ABN , Publish Date - Aug 20 , 2025 | 04:41 AM

యూరియా కోసం ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘా(పీఏసీఎ్‌స)ల వద్ద రైతులు పడిగాపులు కాస్తూనే ఉన్నారు. అరకొర స్టాక్‌ వస్తుండటంతో తెల్లవారకముందే అన్నదాతలు పీఏసీఎ్‌సలకు పరుగులు తీస్తున్నారు.

Agricultural Crisis: జోరు వానలోనూ బారులు

తెల్లవారకముందే యూరియా కోసం పరుగులు.. గొడుగులు పట్టుకుని భారీ క్యూ లైన్లలో నిరీక్షణ

  • పలు జిల్లాల్లో కొనసాగుతున్న రైతుల తిప్పలు

(ఆంధ్రజ్యోతి న్యూస్‌ నెట్‌వర్క్‌): యూరియా కోసం ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘా(పీఏసీఎ్‌స)ల వద్ద రైతులు పడిగాపులు కాస్తూనే ఉన్నారు. అరకొర స్టాక్‌ వస్తుండటంతో తెల్లవారకముందే అన్నదాతలు పీఏసీఎ్‌సలకు పరుగులు తీస్తున్నారు. ఇంత చేసినా దొరికేది ఒక్క బస్తానే. రోజంతా వానలో నిలబడ్డా కొందరికి అదీ దక్కడం లేదు. దీంతో అన్నదాతలు ఆవేదనతో వెనుదిరుగుతున్నారు. మహబూబాబాద్‌ జిల్లా గూడూరు పీఏసీఎ్‌సకు వస్తున్న యూరియా స్థానిక అవసరాలకు సరిపోవడం లేదు. సొసైటీకి మంగళవారం 1,200 యూరియా బస్తాలు రాగా, సుమారు 2 వేల మంది లైన్‌లో నిరీక్షించారు. కొంతమంది ఒక రోజు ముందే చేరుకుని సొసైటీ, దుకాణ సముదాయాల ఎదుట నిద్రపోయారు. వందలాది మంది ఉదయం 6 గంటల నుంచే సొసైటీ వద్దకు వచ్చారు. ఆధార్‌ కార్డులతో మహిళా రైతులు, వృద్ధులు, యువకులతో పాటు రైతుల పిల్లలు సైతం లైన్‌లో నిలబడ్డారు. వర్షాన్ని సైతం లెక్కచేయకుండా గంటల తరబడి లైన్‌లో నిరీక్షించారు. అధికారులు ఒక్కో రైతుకు ఒక్కో బస్తా చొప్పున 1,200 మందికి అందించారు. మిగతా రైతులకు టోకెన్లు ఇచ్చారు. గూడూరు అటవీ శాఖ కార్యాలయం, జడ్పీ బాలుర ఉన్నత పాఠశాల, గిరిజన బాలుర ఆశ్రమ పాఠశాలల్లో పోలీసు బందోబస్తు ఏర్పాటు చేసి యూరియా కోసం వచ్చిన రైతులకు టోకెన్లు ఇచ్చారు.


గద్వాల జిల్లా గట్టు మండలంలో రైతులు తెల్లవారుజామునే పీఏసీఎస్‌ కార్యాలయానికి చేరుకున్నారు. వెంట తెచ్చుకున్న పట్టాదారు పాసుబుక్కులు, తువ్వాళ్లను లైన్‌లో పెట్టారు. గంటల తరబడి లైన్‌లో నిలుచున్న రైతులు ఈ-పాస్‌ యంత్రం మొరాయించడంతో సహనం కోల్పోయి అధికారులతో వాగ్వాదానికి దిగారు. కార్యాలయం లోపలికి చొచ్చుకెళ్లే ప్రయత్నం చేశారు. పీఏసీఎస్‌ చైర్మన్‌ అక్కడికి చేరుకొని వారిని సముదాయించారు. రైతులు ఆందోళనకు దిగడంతో పోలీసులు సముదాయించారు. అధికారులు ఒక్కొక్కరికి రెండు బస్తాలు ఇవ్వడంతో రైతులు అసహనం వ్యక్తం చేశారు. కరీంనగర్‌ జిల్లాలోని తిమ్మాపూర్‌, చిగురుమామిడి, సైదాపూర్‌ మండలాల్లో రైతులు యూరియా కోసం తెల్లవారుజామునే సహకార సంఘాల వద్దకు చేరుకున్నారు. చిగురుమామిడి మండలం ఇందుర్తిలో ఉదయం ఐదు గంటల నుంచే యూరియా కోసం రైతులు క్యూలో ఉన్నారు. మధ్యాహ్నం వరకు వేచి ఉండగా ఒక్కో రైతుకు రెండు బస్తాలు ఇచ్చారు. సైదాపూర్‌ మండల కేంద్రంలోని వెన్కేపల్లి సొసైటీలో ఒక్కో రైతుకు ఒక బస్తా పంపిణీ చేశారు. ఆలస్యంగా వచ్చిన వారికి యూరియా అందకపోవడంతో ఆగ్రహం వ్యక్తం చేశారు.


మెదక్‌, సంగారెడ్డిలోనూ..

మెదక్‌, సంగారెడ్డి జిల్లాలో యూరియా కోసం అన్నదాతలకు ఇబ్బందులు తప్పడం లేదు. మంగళవారం వర్షాన్ని సైతం లెక్కచేయకుండా రైతులు దుకాణాల వద్ద బారులు తీరారు. పొలం పనులు మానుకుని గంటల తరబడి లైన్‌లో నిలబడ్డారు. నిజాంపేట, చేగుంట, నర్సాపూర్‌, చిన్నశంకరంపేట తదితర మండల కేంద్రాలోని ఎరువుల దుకాణాల వద్ద పెద్ద ఎత్తున రైతుల క్యూ కనిపించింది. లోడ్‌ రాగానే ఖాళీ అవుతుండటంతో క్యూలో నిల్చున్నా దొరకని పరిస్థితి ఉందని రైతులు అసహనం వ్యక్తం చేశారు.


ఈ వార్తలు కూడా చదవండి...

హౌసింగ్ స్కీమ్‌లో అవినీతి.. మంత్రి ఉత్తమ్ చర్యలు

ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్న ఎన్డీఏ.. సీఎం రేవంత్ ఫైర్

For More Telangana News and Telugu News..

Updated Date - Aug 20 , 2025 | 04:41 AM