Farmers Struggle for Urea: యూరియా కోసం పడిగాపులు
ABN , Publish Date - Aug 24 , 2025 | 02:58 AM
రాష్ట్రంలో రైతులను యూరియా కష్టాలు వెంటాడుతున్నాయి. అరకొరగా వస్తున్న యూరియాను అధికారులు టోకెన్లు జారీ చేసి.. పోలీసుల బందోబస్తు మధ్య పంపిణీ చేయాల్సిన పరిస్థితి నెలకొంది.
నిద్రాహారాలు మాని బారులు తీరిన అన్నదాతలు.. కరీంనగర్ జిల్లాలో చెప్పులు క్యూలో పెట్టి జాగారం
మహబూబ్‌నగర్‌లోని కేంద్రం వద్ద రిక్షా కార్మికుడు మూర్ఛపోవడంపై వివాదం
సిద్దిపేట జిల్లాలో క్యూలో ఖాళీ మద్యం సీసా పెట్టి రైతు నిరసన
(ఆంధ్రజ్యోతి న్యూస్ నెట్‌వర్క్): రాష్ట్రంలో రైతులను యూరియా కష్టాలు వెంటాడుతున్నాయి. అరకొరగా వస్తున్న యూరియాను అధికారులు టోకెన్లు జారీ చేసి.. పోలీసుల బందోబస్తు మధ్య పంపిణీ చేయాల్సిన పరిస్థితి నెలకొంది. కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలం ఇందుర్తిలో యూరియా కోసం రైతులు జాగరణ చేస్తున్నారు. ఆదివారం తెల్లవారుజామున యూరియా వస్తుందనే సమాచారంతో రైతులు శనివారం రాత్రే చెప్పులు క్యూలో పెట్టి అక్కడే నిద్రిస్తున్నారు. మహబూబ్ నగర్‌లో యూరియా కేంద్రం వద్ద మూడు రోజులుగా రైతులు పడిగాపులు కాస్తున్నారు. ఈ కేంద్రాన్ని శనివారం మాజీ మంత్రి శ్రీనివా్‌సగౌడ్ పరిశీలించారు. ఆ సమయంలో ఓ వ్యక్తి సొమ్మసిల్లిపడిపోగా అతన్ని శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలో అంబులెన్స్‌లో ఆస్పత్రికి తరలించారు. అతన్ని రైతుగా భావించిన శ్రీనివాస్ గౌడ్ ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే రైతులకు ఇలాంటి దుస్థితి ఎదురైందని విమర్శించారు. అయితే, సొమ్మసిల్లి పడిపోయిన వ్యక్తి రిక్షా కార్మికుడని కాంగ్రెస్ నాయకులు తెలిపారు. హన్వాడలో రైతులు రోడ్డుపై బైఠాయించారు. సిద్దిపేట జిల్లా మిరుదొడ్డి మండలం అల్వాల గ్రామ రైతు వేదిక వద్దకు యూరియా వచ్చిందని తెలియడంతో శనివారం రైతులు భారీగా వచ్చారు. వ్యవసాయాధికారులను రైతు వేదికలో నిర్బంధించారు. అంతకుముందు రైతులు క్యూలో పాస్ బుక్‌లు, ఖాళీ మద్యం సీసా పెట్టారు. రాష్ట్రంలో యూరియా దొరకడం లేదని, మద్యం ఏరులై పారుతోందని విమర్శించారు.
పోలీసు బందోబస్తు మధ్య యూరియా పంపిణీ చేశారు. రాయపోల్ మండలం అంకిరెడ్డిపల్లి, మెదక్ జిల్లా హవేళిఘణపూర్, పెద్దశంకరంపేటలో రైతులు భారీగా బారులుతీరారు. ఉమ్మడి నల్లగొండ జిల్లా నిడమనూరు పీఏసీఎస్ కార్యాలయం ఎదుట టోకెన్ల కోసం రైతులు గంటలకొద్దీ ఎదురుచూశారు. పోలీసు పహారాలో యూరియా పంపిణీ చేశారు. కొండమల్లేపల్లి, పెద్ద అడిశర్లపల్లి, కనగల్, సూర్యాపేట జిల్లా హుజూర్‌నగర్‌లో శనివారం ఉదయం 6 గంటల నుంచే యూరియా కోసం వేచిచూశారు. యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లిలో రైతులు గంటల తరబడి నిరీక్షించారు. యూరియా దక్కకపోవడంతో వనపర్తి జిల్లా ఆత్మకూరులో ఓ రైతు మండల వ్యవసాయ సహకార సంఘం కార్యాలయంపై అధికారులు లేని సమయంలో రాళ్లు రువ్వాడు. మహబూబాబాద్ సొసెటీకి 660 బస్తాల యూరియా రావడంతో 5 రోజుల క్రితం ఇచ్చిన టోకెన్ల ప్రకారం పోలీసు బందోబస్తు నడుమ పంపిణీ చేశారు. మరిపెడలో ఉదయం 6 గంటల నుంచి రాత్రి వరకు పడిగాపులు కాసారు. మొత్తం 763 బస్తాల యూరియా రాగా, 2 వేలకు పైగా రైతులు వచ్చారు. గూడూరు సొసైటీకి 650 బస్తాల యూరియా రాగా 1,200 మందికి పైగా రైతులు చేరుకున్నారు. పలువురు రైతులు సొసైటీ గేటు వద్ద ఆందోళన చేపట్టారు. కొత్తగూడ మండలం పొగుళ్లపల్లి సొసైటీకీ రైతులు భారీగా తరలివచ్చారు. ఆధార్, పట్టా పత్రాలను క్యూ లైన్‌లో పెట్టారు. కరీంనగర్ జిల్లా సైదాపూర్‌లోని వెన్కేపల్లి సొసైటీకి 450 బస్తాల యూరియా రావడంతో ఒక్కొక్కటి చొప్పున పంపిణీ చేశారు. అయినా లైన్‌లో చివరి రైతులకు యూరియా అందలేదు. రాజన్న సిరిసిల్ల జిల్లా చందుర్తి మండలం సనుగుల సొసైటీలో శనివారం రైతులకు టోకెన్లను జారీ చేసి 225 యూరియా బస్తాలు పంపిణీ చేశారు. సాంకేతిక సమస్యతో రైతులు రెండు గంటల పాటు పడిగాపులు కాయాల్సి వచ్చింది. కరీంనగర్ జిల్లా గంగాధరలో, చిగురుమామిడిలో ప్రఽధాన రహదారిపై శనివారం బీఆర్‌ఎస్ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఖమ్మం జిల్లాలోని కారేపల్లిలో రైతులు బస్టాండ్ సెంటర్ రోడ్డుపై బైఠాయించారు.
ఇవి కూడా చదవండి..
నిధుల్లో న్యాయబద్ధమైన వాటా మాకివ్వడం లేదు.. కేంద్రంపై స్టాలిన్ విసుర్లు
అది సుప్రీం తీర్పు, నా వ్యక్తిగతం కాదు: హోం మంత్రికి సుదర్శన్ రెడ్డి కౌంటర్
For More National News And Telugu News