Mahabubabad: ఎరువుల దుకాణంపై రాళ్ల దాడి
ABN , Publish Date - Sep 05 , 2025 | 04:58 AM
మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో గురువారం యూరియా బస్తాల కోసం రైతులు కన్నెర్ర చేశారు. ఎరువుల దుకాణం వద్ద బస్తాలు పంపిణీ చేస్తుండగా..
మానుకోటలో రైతుల తిరుగుబాటు
దుకాణం ముందు నిప్పు
యూరియా కోసం అన్నదాతల ఆందోళన
హుస్నాబాద్‌లో పొన్నం ఆఫీసు వద్ద ధర్నా
పలు జిల్లాలో రాస్తారోకోలు
(ఆంధ్రజ్యోతి న్యూస్ నెట్‌వర్క్): మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో గురువారం యూరియా బస్తాల కోసం రైతులు కన్నెర్ర చేశారు. ఎరువుల దుకాణం వద్ద బస్తాలు పంపిణీ చేస్తుండగా.. రైతులు ఎగబడగా యాజమాని షాపు మూసివేసి వెళ్లిపోవడంతో ఆగ్రహించిన రైతులు మూసివున్న దుకాణంపై ఇటుకలు, రాళ్లతో దాడి చేశారు. స్థానిక సూర్య థియేటర్ సమీపంలోని మన గ్రోమోర్ సెంటర్‌లో బుధవారం 330 (12 టన్నుల) యూరియా బస్తాలు వచ్చాయి. అయితే దుకాణం యాజమాని కొన్ని బస్తాలే ఇచ్చి రేపు మళ్లీ ఇస్తామని చెప్పి షాపు బంద్ చేసి వెళ్లిపోయాడు. గురువారం ఉదయం కూడా దుకాణం మూసివేసి వెళ్లిపోవడంతో ఆగ్రహించిన రైతులు దుకాణంపై ఇటుకలు, రాళ్లతో షాపుపై దాడి చేశారు. దుకాణం ముందు కర్రలు వేసి నిప్పు పెట్టి నిరసన వ్యక్తం చేశారు. కొంతమంది రైతులు మన గ్రోమోర్ గోదాం తాళాలు పగులగొట్టి యూరియా బస్తాలను తీసుకువెళ్తుండగా పోలీసులు అడ్డుకున్నారు. అనంతరం షాపు యాజమానితో మాట్లాడి రైతులను క్యూలైన్‌లో నిలబెట్టి అందులో ఉన్న 180 బస్తాల యూరియాను రైతులకు అందించారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్‌లో రైతులు రాస్తారోకో నిర్వహించారు. అనంతరం మంత్రి పొన్నం ప్రభాకర్ క్యాంపు కార్యాలయం ఎదుట ధర్నా చేశారు. వెంటనే యూరియా ఇవ్వాలంటూ నినాదాలతో హోరెత్తించారు. ఒక దశలో క్యాంపు కార్యాలయం ముట్టడికి యత్నించారు. దీంతో పోలీసులు, రైతులకు మధ్య తోపులాట జరిగింది.
యూరియా పంపిణీ చేయాలని కోరుతూ జగిత్యాల జిల్లా గొల్లపల్లి, రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట, వీర్నపల్లిలో రాస్తారోకోలు నిర్వహించారు. గంటల కొద్దీ క్యూలో నిల్చున్నా యూరియా ఇవ్వడం లేదంటూ కామారెడ్డి జిల్లా దోమకొండ మండలం అంబర్‌పేటలో రైతులు వ్యవసాయ అధికారి మణిదీపికను దిగ్బంధించారు. భద్రాద్రి జిల్లా ఇల్లెందు వ్యవసాయ కార్యాలయం వద్ద వామపక్షాల ఆధ్వర్యంలో రైతులు ఆందోళనకు దిగారు. పది రోజులుగా తిరుగుతున్నా ఒక్క యూరియా బస్తా కూడా దొరకడంలేదంటూ మహబూబాబాద్ జిల్లా బయ్యారంలో ఇల్లెందు-మహబూబాబాద్ ప్రధాన రహదారిపై భారీ సంఖ్యలో రైతులు రాస్తారోకో నిర్వహించగా.. ఇద్దరు రైతులు పురుగు మందు డబ్బాలతో నిరసన వ్యక్తం చేశారు. వరంగల్ జిల్లా ధర్మారావుపేటలో వందలాది మంది రైతులు పంపిణీ కేంద్రానికి ఎగబడడంతో తోపులాట జరిగి.. పలువురు మహిళా రైతులు స్పృహ తప్పి పడిపోయారు.
యూరియా పంపిణీకి సిరా గుర్తు !
నారాయణపేట జిల్లాలోని మరికల్ మండలం తీలేర్ సింగిల్‌విండో వద్ద యూరియా కోసం రైతులు భారీ సంఖ్యలో పోటెత్తడంతో అధికారులు.. ఎన్నికల మాదిరిగా రైతుల వేళ్లకు సిరా గుర్తు వేసి.. టోకెట్లు ఇచ్చారు. అనంతరం వరుసగా యూరియా పంపిణీ చేశారు. గంటల కొద్దీ క్యూలో నిలబడిన స్పృహ తప్పి పడిపోయిన తీలేర్‌కు చెందిన రైతు మణెమ్మను ఆస్పత్రికి తరలించిన అనంతరం.. అధికారులు ఈ విధానాన్ని అమలు చేశారు.
600 బస్తాల యూరియాతో లారీని పట్టుకున్న పోలీసులు
దొడ్డిదారిన 600 బస్తాల యూరియాను తరలిస్తున్న లారీని వికారాబాద్ జిల్లా పరిగిలో పోలీసులు పట్టుకుని పోలీ్‌సస్టేషన్‌కు తరలించారు. మాదారంలోని పవన్‌ప్లైవుడ్ కంపెనీకి సంబంధించినదని, అయితే అది పరిశ్రమలకు ఉపయోగించే యూరియా అని కంపెనీ యాజమాన్యం చెప్పడంతో వ్యవసాయాధికారులకు లేఖ రాశామని పోలీసులు తెలిపారు.
ఈ వార్తలు కూడా చదవండి
సుగాలి ప్రీతి కేసుపై సీఎం చంద్రబాబు సంచలన నిర్ణయం
22 నుంచి దసరా ఉత్సవాలు.. భక్తులకు ఇబ్బంది కలగకుండా ఏర్పాట్లు: మంత్రి ఆనం
Read Latest TG News and National News