Farmers: బంగారు పంటలు.. బేజారు ధరలు
ABN , Publish Date - Jan 31 , 2025 | 04:46 AM
నాగలి కట్టి.. కాడెడ్లను అదిల్చి.. దుక్కి దున్ని.. విత్తనాల సాగుకు నడుంకట్టింది మొదలు రైతుల మదిలో ఒకటే ఆలోచన! చక్కని దిగుబడులు రావాలి.. ఆ పంటలకు మంచి ధరలు దక్కాలి అని!

కందుల దిగుబడి బాగున్నా దెబ్బకొట్టిన ధర
సీజన్ మొదట్లో కన్నా క్వింటాకు 2,500 తగ్గుదల
వచ్చే నెలలో మార్కెట్లోకి మరింతగా కందులు
ధరలు ఇంకా తగ్గుతాయన్న ఆందోళనలో రైతులు
మార్కెట్లకు పోటెత్తిన మిర్చి.. తప్పని ఽనష్టాల ఘాటు
ఒకదశలో వండర్ హాట్ రకం క్వింటాకు 28,500
ప్రస్తుతం ఏకంగా రూ.14 వేల మేర పడిన ధర
ఽధరల్లేక కోల్డ్‌స్టోరేజీల్లోనే 50లక్షలకు పైగా బస్తాలు
పత్తికీ మద్దతు కరువు.. పెద్దపల్లిలో రోడ్డెక్కిన రైతు
ఎమ్మెస్పీ రూ.7,500.. ఇస్తోంది రూ.5,800
ఎన్నికల హామీ క్వింటాకు రూ.475 ఏది?
వేరుశనగ రైతూ కుదేలు.. మద్దతు ధర రూ.6,783
మెజారిటీ మార్కెట్లో రూ.4వేలలోపే చెల్లింపు
మహబూబ్‌నగర్, పెద్దపల్లి టౌన్, వికారాబాద్, ఖమ్మం మార్కెట్, వరంగల్, జనవరి 30 (ఆంధ్రజ్యోతి): నాగలి కట్టి.. కాడెడ్లను అదిల్చి.. దుక్కి దున్ని.. విత్తనాల సాగుకు నడుంకట్టింది మొదలు రైతుల మదిలో ఒకటే ఆలోచన! చక్కని దిగుబడులు రావాలి.. ఆ పంటలకు మంచి ధరలు దక్కాలి అని! అయితే మనసులో ఏ మూలనో వారు భయపడిందే జరిగింది. చేతికొచ్చిన పంటలను గండపెడాశతో మార్కెట్లోకి తీసుకెళితే వారిని ధర వెక్కిరిస్తోంది. కందులు, మిర్చి, పత్తి, వేరుశనగ రూపంలో ప్రధాన పంటలకు గిట్టుబాటు ధరలు లభించడం లేదు. ఫలితంగా రైతన్నలు తీవ్ర నిరాశలో కూరుకుపోయారు. పంటల సాగుకు పెట్టిన పెట్టుబడులూ చేతికివచ్చే పరిస్థితి లేదని ఆవేదన చెందుతున్నారు. పంటలకు గిట్టుబాటు ధర చెల్లించాలంటూ రోడ్డెక్కి.. ఆందోళనలు చేస్తున్నారు. ఈసారి విరగకాసి.. చక్కని దిగుబడులు రాల్చి మురిపించిన కందులు, ధర దగ్గరకొచ్చేసరికి రైతన్నలను ఏడిపిస్తున్నాయి. సీజన్ ప్రారంభంలో క్వింటాకు గరిష్ఠంగా రూ.10,737 వరకు ధర పలికినా ఇప్పుడు ధర దారుణంగా పడిపోయింది. గురువారం నాణ్యమైన కందులకు కూడా క్వింటాకు దక్కింది ఎక్కువకు ఎక్కువ రూ..7,470 మాత్రమే. కొన్ని రకాలైతే రూ.6,500 మాత్రమే ఇచ్చారు.
మార్కెట్లోకి కందుల రాక పెరిగిన కొద్దీ ధర పడిపోతుండటం రైతులను ఆందోళనకు గురిచేస్తోంది. కందుల రాక ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటి వరకు క్వింటాకు రూ.3,200 వరకు ధర తగ్గిపోయింది. వచ్చే నెలలో మార్కెట్లోకి కందులు మరింతగా వస్తాయని, అప్పుడు ధర మరింతగా పడిపోతుందా? అని నూర్పిడి దశలో పంట ఉన్న రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నిరుడు కందులకు మంచి ధర రావడంతో రాష్ట్రవ్యాప్తంగా కందుల సాగు పెరిగింది. వికారాబాద్ జిల్లాలో గత ఏడాది 1,04,448 ఎకరాల్లో కంది పంట సాగైతే, ఈసారి 1,47,788 ఎకరాల్లో సాగు చేశారు. తాండూరు, కొడంగల్, పరిగి, దౌల్తాబాద్, బషీరాబాద్, దోమ, కుల్కచర్ల, యాలాల్, పెద్దేముల్, బొంరా్‌సపేట్ తదితర మండలాల్లో ఎక్కువ విస్తీర్ణంలో కందులు వేశారు. సాధారణంగా ఎకరాకు 6 నుంచి 8 క్వింటాళ్ల వరకు కంది పంట పండుతుంది. ఈసారి దిగుబడులు బాగానే వచ్చినా రోజురోజుకూ తగ్గుతున్న ధరలతో రైతులు ఆందోళన చెందుతున్నారు.
వేరుశనగకు 4వేలలోపే
వేరుశనగ రైతులది మరింత పెద్ద సమస్య! ఈసారి వారికి దిగుబడులు లేవు. ధరా లేదు. మహబూబ్‌నగర్, నల్లగొండ, రంగారెడ్డి జిల్లాల్లో వేరుశనగ పంట ఎక్కువగా సాగుచేస్తారు. ఈసారి రాష్ట్రవ్యాప్తంగా 2.49 లక్షల ఎకరాల్లో వేరుశనగ సాగవగా అత్యధికంగా ఉమ్మడి పాలమూరు జిల్లాలో 1.85 లక్షల ఎకరాల్లో రైతులు ఈ పంట వేశారు. ఇక్కడ పండే వేరుశనగలో అఫ్లోటాక్సిన్ బ్యాక్టీరియా తక్కువగా ఉండటంతో వేరుశనగలు ఎక్కువ కాలం నిల్వ ఉంటాయి. దీంతో ఇక్కడి పంటకు డిమాండ్ ఎక్కువ. విదేశాలకూ ఎగుమతి చేస్తారు. ఉమ్మడి జిల్లాలోని దాదాపు అన్ని మార్కెట్లలో వేరుశనగకు రికార్డు స్థాయిలో ధరలొచ్చేవి. ఈ ఏడాది పరిస్థితి పూర్తిగా మారిపోయింది. తుఫాన్ల ముప్పును తప్పించుకునేందుకు ముందస్తు యాసంగి సాగు ప్రణాళికలో భాగంగా ఉమ్మడి జిల్లాలోని రైతులు నవంబరులోనే సాగును ప్రారంభిస్తున్నారు. ఈ ప్రణాళికే రైతులను దెబ్బ తీస్తోంది. పంట వేసిన నాటి నుంచి వానల ప్రభావం ఉండడంతో ఎకరానికి 12-15 క్వింటాళ్ల దాకా రావాల్సిన దిగుబడి కేవలం ఆరు క్వింటాళ్లు, ఆలోపునకే పరిమితమైంది. పంటలో నాణ్యత కూడా తగ్గడంతో డిమాండ్ పడిపోయింది.
ఈసారి కేంద్ర సర్కారు వేరుశనగకు కనీస మద్దతు ధర రూ.6783గా నిర్ణయించింది. నిరుటితో పోలిస్తే ఇది రూ.406 ఎక్కువే. కానీ, నాణ్యత పడిపోవడంతో జిల్లాలోని మెజారిటీ మార్కెట్లలో ఎమ్మెస్పీ కన్నా రూ.3వేల వరకు తక్కువే ఇస్తున్నారు. దిగుబడులు తగ్గడం, ధరలు లేకపోవడంతో ఎకరానికి రూ.30వేల వరకు నష్టపోతున్నామని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కాగా ధరలు పడిపోతుండడంతో రైతులు రోడ్డెక్కి ఆందోళనలు చేస్తున్నారు. నాగర్‌కర్నూలు జిల్లా అచ్చంపేట మార్కెట్‌లో ధర తక్కువగా ఇస్తున్నారని మార్కెట్ ఆఫీసుపై దాడి చేసి చైర్‌పర్సన్ భర్తను కూడా కొట్టారు. ఇక, అత్యంత తక్కువ ధరలు పలకడంతో మహబూబ్‌నగర్ మార్కెట్‌కు మంగళవారం పంట తెచ్చిన రైతులు రైలు పట్టాల వద్దకు వెళ్లి నిరసన తెలిపారు. దీంతో కొనుగోలు చేసిన పంటకు క్వింటాకు రూ.200 ఎక్కువ ఇస్తామని వ్యాపారులు చెప్పారు. కానీ, బుధవారం మాటమార్చి కొనుగోలు చేసిన మొత్తం పంటకు కాకుండా కేవలం రూ.3500 నుంచి రూ.4500 ధర వచ్చిన పంటకు మాత్రమే ఆ మేర చెల్లింపులు చేస్తామని చెప్పారు. ప్రస్తుతం ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలోని మార్కెట్లలో సగటు ధర 5500 వరకే వస్తోంది.
పత్తికి బోనస్ ఏది?
రెండేళ్లతో పోల్చితే పత్తి, మిర్చి ధరలు భారీగా పడిపోయాయి. ఈసారి రాష్ట్ర వ్యాప్తంగా 43,76,043 ఎకరాల్లో పత్తి పంట, సుమారు 8.90 లక్షల ఎకరాల్లో మిర్చి పంటను సాగు చేశారు. ఉమ్మడి వరంగల్, ఖమ్మం, కరీంనగర్ జిల్లాల్లో అత్యధికంగా పత్తి సాగవుతుంది. పెట్టుబడుల వ్యయం పెరగడం, చీడపీడల బెడద కారణంగా ఎకరాకు రూ.45వేల నుంచి రూ.60వేలకు పైగా రైతులు పెట్టుబడి పెట్టారు. దిగుబడులు మాత్రం 4-6 క్వింటాళ్లకే పరిమితమయ్యాయి. పత్తికి క్వింటాకు రూ.7,521 మద్దతు ధరను కేంద్రం ప్రకటించినా ఆ ధర రావడం లేదు. పత్తి విక్రయాలకు పెద్ద మార్కెట్లుగా ఉన్న వరంగల్, ఖమ్మం వ్యవసాయ మార్కెట్లో గత రెండు మూడు నెలలుగా క్వింటాకు రూ.5,800ల నుంచి రూ.7,200ల వరకు ధర పలుకుతోంది. ఫలితంగా ఎకరాకు రూ.30వేల నుంచి రూ.40వేల వరకే వస్తోందని.. ఆ రకంగా తీవ్రంగా నష్టపోతున్నామని రైతులు చెబుతున్నారు. తాము అధికారంలోకి వస్తే పత్తి రైతులకు రూ.475 బోనస్ ఇస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చింది. అయితే దీనిపై సర్కారు దృష్టిపెట్టడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈసారి రాష్ట్ర వ్యాప్తంగా 25.33 లక్షల మెట్రిక్ టన్నుల పత్తి పంట వస్తుందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ లెక్కన ప్రభుత్వం రైతులకు బోనస్ కింద సుమారుగా రూ.1,108కోట్ల వరకు చెల్లించాల్సి ఉంటుందని అంచనా. కాగా పత్తికి మద్దతు ధర చెల్లించాలంటూ పెద్దపల్లిలో రాజీవ్ రహదారిపై గురువారం రైతులు ఆందోళన చేపట్టారు. ఈ మార్కెట్లో పత్తికి క్వింటాకు రూ.6000-6500 వరకే ఇవ్వడంతో మార్కెట్లో అధికారులు, వ్యాపారులు కుమ్మక్కై తక్కువ ధరకు కొంటున్నారని ఆరోపించారు.
ఎర్ర బంగారం నేలచూపులు
మిర్చి రైతులకూ నష్టాల ఘాటు తప్పడం లేదు. ఉమ్మడి వరంగల్, ఖమ్మం, కరీంనగర్ జిల్లాలు, మంచిర్యాల, నాగర్‌కర్నూలు, మహబూబ్‌నగర్, నిజామాబాద్, మెదక్ తదితర 19జిల్లాల్లో రైతులు సుమారు 8.90లక్షల ఎకరాల్లో మిర్చి సాగు చేస్తున్నారు. 2020-22 మధ్య మిర్చికి మంచి ధరలు రావటంతో చాలా మంది రైతులు పత్తిని కాదని మిర్చి సాగు వైపు మొగ్గారు. నిరుటిలాగే ఈసారి కూడా మిర్చి రైతులకు కన్నీళ్లే మిగిల్చింది. ఖమ్మం సహా చాలాచోట్ల మార్కెట్లలోకి మిర్చి పోటెత్తుతోంది. అయితే రైతులు ఎక్కువ సాగు చేసే తేజ రకం మిర్చికి తొలుత రూ.9వేల నుంచి రూ.12వేల వరకే ధర పలికింది. డిసెంబరు రెండోవారంలో రూ.12వేల నుంచి రూ.16వేల మధ్య ధరలు ఉండగా, తాజాగా రూ.9వేల నుంచి రూ.14వేల వరకు ఽఇస్తున్నారు. వండర్ హాట్ మిర్చి రూ.11వేల నుంచి రూ.14వేల మధ్య ధరలున్నాయి. ఒకదశలో వండర్ హాట్‌కు గరిష్ఠంగా రూ.28,503 ధర వచ్చింది. తేజ రకం మిర్చికి క్వింటాకు రూ.7వేల వరకు, వండర్ హాట్‌కు రూ.14వేల వరకు ధరలు తగ్గినట్లుగా మార్కెట్ వర్గాలు పేర్కొంటున్నాయి. ఖమ్మంలో గురువారం మిర్చి జెండా పాట క్వింటాకు రూ.14వేలు నిర్ణయించగా రూ.10వేల నుంచి రూ.13,600 వరకే కొన్నారు. కాగా ఆశించినట్లుగా ధరల్లేకపోవడంతో మర్చికి మున్ముందు మంచి ధరలొస్తాయనే ఆశతో రైతులు కోల్డ్‌స్టోరేజీల్లో నిల్వ చేసుకుంటున్నారు. వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్‌లోనే సుమారు 15లక్షల బస్తాలను కోల్డ్ స్టోరేజీల్లో నిల్వ చేయగా, ఖమ్మం వ్యవసాయ మర్కెట్‌లో 10లక్షల బస్తాలు, కేసముద్రం, మహబూబాబాద్, జగిత్యాల, కోరుట్ల, నిజామాబాద్ తదితర మార్కెట్లలో మరో 25లక్షల బస్తాలను కోల్‌స్టోరేజీల్లో రైతులు నిల్వ చేసినట్టు అంచనా.
ఇదీ చదవండి:
నాలుగో టీ20.. టీమిండియాకు సూపర్ న్యూస్.. మహాబలుడు వచ్చేస్తున్నాడు
కోహ్లీని భయపెట్టిన ఉపేంద్ర.. సొంతగడ్డపై అంతా చూస్తుండగానే..
ఎప్పుడూ చూడని రనౌట్.. ఇంతకంటే దురదృష్టవంతుడు ఉండడు
మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి