Fake liquor: కల్తీమద్యం@ హైదరాబాద్
ABN , Publish Date - Aug 27 , 2025 | 05:12 AM
హైదరాబాద్ కేంద్రంగా కల్తీ మద్యం పెరిగిపోతోంది. ప్రజలకు హాని కలిగించే స్పిరిట్‌తో కేటుగాళ్లు యథేచ్ఛగా నకిలీ మద్యాన్ని తయారు చేస్తున్నారు.
యథేచ్ఛగా తయారీ..ముఠా ఆట కట్టించిన ఎక్సైజ్ టాస్క్‌ఫోర్స్
ఇద్దరు నిందితుల అరెస్టు
హైదరాబాద్/హైదరాబాద్ సిటీ, ఆగస్టు 26 (ఆంధ్రజ్యోతి): హైదరాబాద్ కేంద్రంగా కల్తీ మద్యం పెరిగిపోతోంది. ప్రజలకు హాని కలిగించే స్పిరిట్‌తో కేటుగాళ్లు యథేచ్ఛగా నకిలీ మద్యాన్ని తయారు చేస్తున్నారు. ఖరీదైన మద్యం బాటిళ్లపై నకిలీ లేబుళ్లు, స్టిక్కర్లు అతికించి విక్రయాలు సాగిస్తున్నారు. నకిలీ మద్యం తయారీకి వాడే ప్రధాన ముడిసరుకు స్పిరిట్ కూడా అక్రమ మార్గంలో సరఫరా అవుతుండటంతో కల్తీ మద్యం తయారీ మరింత సులువుగా మారింది. ఒకప్పుడు ఒడిశా కేంద్రంగా సాగిన ఈ వ్యవహారం మూడు, నాలుగేళ్లుగా రాష్ట్రంలోని పలు ప్రాంతాలకు విస్తరించింది. ఇలాంటి కల్తీ మద్యాన్ని తాగి ప్రజలు అనారోగ్యం బారిన పడుతున్నారు. పట్టుబడ్డ కల్తీ మద్యం రాకెట్ నిందితుల దగ్గర నుంచి 15 రకాల ముద్రణ సామగ్రిని, అత్యంత ప్రాచుర్యం పొందిన ఎనిమిది బ్రాండ్లకు సంబంధించిన ప్రింటింగ్ ప్లేట్లను అధికారులు గుర్తించారంటే కల్తీ మద్యం ఏ స్థాయిలో తయారవుతుందో తెలుసుకోవచ్చు. సూర్యాపేట జిల్లా మేళ్ల చెరువు మండలంలో ఇటీవల కల్తీ మద్యం తయారు చేస్తున్న ముఠాను టాస్క్‌ఫోర్స్ పోలీసులు పట్టుకున్నారు. దీంతో తీగ లాగితే డొంక కదిలినట్టూ నగరంలో ఈ రాకెట్ గుట్టురట్టయ్యింది.
కుషాయిగూడలో నకిలీ మద్యం లేబుళ్లు
కుషాయిగూడ కేంద్రంగా నకిలీ మద్యం లేబుళ్లు తయారుచేస్తున్న ముఠాను టాస్క్‌ఫోర్స్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సోదాల్లో రూ. 50లక్షల విలువైన ప్రింటింగ్ మిషన్లు, నకిలీ లేబుళ్లు ఇతర సామగ్రి స్వాధీనం చేసుకున్నారు. ఇద్దరు నిందితులను అరెస్ట్ చేసి, తయారీ యూనిట్‌ను సీజ్ చేశారు. ఇక్కడ తయారవుతున్న నకిలీ లేబుళ్లను ఖరీదైన మద్యం సీసాలకు అతికించి ఏపీ, కర్నాటకల్లో కల్తీ మద్యం తయారు చేస్తున్న కేంద్రాలకు సరఫరా చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. సూర్యాపేట ఘటనపై విచారణను ముమ్మరం చేసిన పోలీసులు.. ఈ రెండు ముఠాలకు ఉన్న లింకులపై ఆరా తీశారు. ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టర్ షాన్‌వాజ్ ఖాసీం ఆదేశాల మేరకు రంగంలోకి దిగిన టాస్క్‌ఫోర్స్ బృందం.. కల్తీ మద్యం తయారీదారుల బ్యాంకు లావాదేవీలపై నిఘా పెట్టారు. ఈ క్రమంలోనే సోమవారం శివసాయి నగర్ కాలనీ, నాగార్జున కాలనీ మధ్య గుట్టుచప్పుడు కాకుండా నడుపుతున్న యూనిట్‌పై దాడి చేశారు. ఈ గోడౌన్‌ను గడ్డమీది నవీన్ గౌడ్ అనే వ్యక్తికి సంబంధించినదిగా గుర్తించిన పోలీసులు అతడితో పాటు, అక్కడే పని చేస్తున్న నివావత్ రాజే్‌షను అరెస్టు చేశారు.
నకిలీ మద్యానికి స్పిరిట్ సరఫరా..
హైదరాబాద్‌లోని కృష్ణా పరిశ్రమ కేంద్రంగా తయారు చేస్తున్న స్పిరిట్‌ను ఏపీ, తెలంగాణ, కర్ణాటకతోపాటు రాజస్థాన్, గుజరాత్ ప్రాంతాలకు సరఫరా అయినట్లు విచారణలో గుర్తించామని పోలీసులు వెల్లడించారు. ఈ ఒక్క పరిశ్రమ నుంచి దాదాపు రూ.4 కోట్ల విలువ చేసే స్పిరిట్‌ను విక్రయించారని వారు గుర్తించారు.
ఈ వార్తలు కూడా చదవండి..
లిక్కర్ స్కామ్‌లో నిందితులకు మళ్లీ రిమాండ్ పొడిగింపు
ఈ రాశుల వారు.. ఈ మంత్రాలు చదివితే దశ..
For More Telangana News and Telugu News..