Superbugs: అమ్మో.. సూపర్‌బగ్స్
ABN , Publish Date - Jul 11 , 2025 | 05:21 AM
మందులకు లొంగని ‘సూపర్‌బగ్స్’ సంఖ్య మనదేశంలో రోజురోజుకూ పెరుగుతోందని వైద్య నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సాధారణంగా మనకు ఏదైనా బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ వల్ల జ్వరం వస్తే..
యాంటీబయాటిక్, యాంటీ వైరల్, యాంటీ ఫంగల్
మందులకు లొంగని మహమ్మారి జీవులతో ముప్పు
ఆయా మందులను వైద్యులు చెప్పినట్టుగా కాకుండా విచ్చలవిడిగా వాడడం.. మధ్యలో ఆపేయడమే కారణం
మిగిలిన, గడువు తీరిన మందుల్ని మురుగులో పడేయొద్దు
దాని వల్ల పర్యావరణంలోకి ప్రమాదకర రసాయనాలు
ఎల్వీపీఈఐ మైక్రోబయాలజిస్టు డాక్టర్ సంచిత మిత్రా
హైదరాబాద్ సిటీ, జూలై 10 (ఆంధ్రజ్యోతి): మందులకు లొంగని ‘సూపర్‌బగ్స్’ సంఖ్య మనదేశంలో రోజురోజుకూ పెరుగుతోందని వైద్య నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సాధారణంగా మనకు ఏదైనా బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ వల్ల జ్వరం వస్తే.. వైద్యులు యాంటీ బయాటిక్ మందులు రాస్తారు. కోర్సు ప్రకారం ఆ మందులు వాడితే జ్వరం తగ్గుతుంది. అయితే.. కొంతమంది, డాక్టర్ సూచించిన ప్రకారం పూర్తి కోర్సు వాడకుండా.. తమకు జ్వరం తగ్గగానే ఆ యాంటీబయాటిక్ మందును వాడడం ఆపేస్తారు. అంటే.. వైద్యుడు వారం రోజులు మందు వాడాలని రాస్తే, 3-4 రోజులు వాడి, ‘జ్వరం తగ్గింది కదా అనవసరంగా మందులు ఎందుకు వాడడం’ అనే ఉద్దేశంతో ఆ బిళ్లలు వేసుకోవడం ఆపేస్తారు. అలా సగంలోనే ఆపేయడం వల్ల.. మన శరీరంలోని బ్యాక్టీరియా పూర్తిగా చావదు సరికదా.. మనం అరకొరగా వేసిన యాంటీబయాటిక్ ఔషధానికి నిరోధకత సంతరించుకుంటుంది. అలాగే కొంతమంది.. అయినదానికి కాని దానికీ.. చీటికీమాటికీ విచ్చలవిడిగా యాంటీబయాటిక్స్ వాడేస్తుంటారు. అలాంటి సందర్భాల్లో కూడా సూక్ష్మజీవులు ఔషధ నిరోధకతను సంతరించుకుంటాయి. అలాంటివాటినే సూపర్ బగ్స్ అంటారు. నాలుగైదు రకాల యాంటీబయాటిక్స్‌కు నిరోధకత సంతరించుకుని సూపర్‌బగ్‌గా మారిన ఆ బ్యాక్టీరియా వేరేవారికి సోకితే.. వారికి ఆ 4-5 రకాల యాంటీబయాటిక్స్ ఔషఽధాలు ఇచ్చినా పని చేయవు. వేరే యాంటీబయాటిక్ ఔషధం ఏదైనా ఇవ్వాల్సి ఉంటుంది. యాంటీ వైరల్, యాంటీ ఫంగల్ ఔషధాలకూ ఇదే సూత్రం వర్తిస్తుంది. మన నిర్లక్ష్యం కారణంగానే కాక.. వ్యవసాయంలో, పశుసంవర్ధక రంగంలోనూ యాంటీబయాటిక్స్ వినియోగం అధికం కావడం కూడా ఈ సూపర్ బగ్స్ పెరుగుదలకు కారణమవుతోందని హైదరాబాద్‌లోని ఎల్వీ ప్రసాద్ కంటి ఆస్పత్రి కన్సల్టెంట్ మైక్రోబయాలజిస్ట్ డాక్టర్ సంచితా మిత్రా వివరించారు. ఏదైనా బ్యాక్టీరియా/వైర్‌స/ఫంగస్ సూపర్ బగ్‌గా మారితే.. ప్రస్తుతం మనకు అందుబాటులో ఉన్న యాంటీబయాటిక్స్, యాంటీ వైరల్, యాంటీ ఫంగల్ ఔషధాల్లో చాలావరకూ వాటిపై ఎటువంటి ప్రభావం చూపవని ఆమె ఆందోళన వెలిబుచ్చారు.
చివరి దశ ఔషధం..
మానవాళికి అందుబాటులో ఉన్న పలు రకాల యాంటీబయాటిక్ ఔషధాలకు సైతం లొంగని ఈ-కొలి రకం గ్రామ్ నెగెటివ్ బ్యాక్టీరియాపై బ్రహ్మాస్త్రంగా, చివరి దశ ఔషధంగా కోలిస్టిన్‌ను వాడతారు. అత్యవసర సమయాల్లో రోగుల ప్రాణాలు కాపాడడానికి వాడాల్సిన ఇలాంటి ఔషధాలను కొన్ని ఆస్పత్రుల్లో విచ్చలవిడిగా వాడేయడం వల్ల.. దానికి కూడా లొంగని సూపర్‌బగ్స్ తయారవుతాయనే ఆందోళన వైద్యనిపుణుల్లో వ్యక్తమవుతోంది. ఈ క్రమంలోనే.. యాంటీబయాటిక్స్‌ను బాధ్యతతో ఉపయోగించడానికి చాలా ఆస్పత్రులు స్టీవార్డ్‌షిప్ కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయని డాక్టర్ సంచిత తెలిపారు. అందులో భాగంగా.. ఔషధం ఎంపిక, మోతాదు , ఉపయోగించే వ్యవధి, వాడే పద్ధతి వంటివాటిని వైద్యులు నిర్ణయిస్తారని.. తమ క్లినిక్‌లో ఏదైనా అంటువ్యాధిని గుర్తించినప్పుడు.. స్టీవార్డ్‌షిప్ విధానంలో సూచించిన తొలి దశ యాంటీబయాటిక్ మందులు వాడతారని వివరించారు. దానికి రోగి స్పందించకపోయినా, అంటువ్యాధి తీవ్రమైనా రెండో దశ ఔషధానికి మారతారని చెప్పారు. దీని వల్ల.. మానవాళిని కాపాడుతున్న యాంటీబయాటిక్ ఔషధాల ప్రభావం పోకుండా కాపాడుకోగలుగుతామని పేర్కొన్నారు.
శుభ్రత.. వ్యర్థాల నిర్వహణ కీలకం..
ఆస్పత్రిలో వ్యాధులు వ్యాపించకుండా ఉండటానికి కేవలం మందులు, శస్త్రచికిత్సలు మాత్రమే కాక.. చేతుల శుభ్రత కూడా కీలకమేనని డాక్టర్ సంచిత తెలిపారు. ఆస్పత్రులు తమ సిబ్బందికి సరైన రీతి లో టీకాలు వేయించాలని.. వారి దుస్తులు, రోగుల పడకలపై వేసే దుప్పట్ల వంటివి శుభ్రంగా ఉండాలని చెప్పారు. ఆస్పత్రి వ్యర్థాల్లో ఉండే యాంటీబయాటిక్, యాంటీ మైక్రోబియల్ ఔషధాల అవశేషాలు కూడా సూపర్‌బగ్స్‌కు కారణమవుతాయని.. కాబట్టి వినియోగించిన తర్వాత మిగిలిన యాంటీబయాటిక్ స్ట్రిప్స్, గడువు ముగిసిన, ముగియబోతున్న మందులను ఆస్పత్రి మురుగునీటి వ్యవస్థలో పారవేయవద్దని డాక్టర్ సంచిత సూచించారు. ఆ వ్యర్థాలను జీవ వైద్య వ్యర్థ నిర్వహణ కేంద్రాలకు పంపించాలన్నారు. అలాగే.. మెడికేటెడ్ సబ్బులు, ఫ్లోర్ క్లీనర్లు, సిర్‌పలు, ఇతర మందుల మిగులు భాగాలను మురుగు నీటిలో పారవేయడం వల్ల అనేక యాంటీమైక్రోబియల్ రసాయనాలు పర్యావరణంలో కలుస్తున్నాయని.. అలా చేయొద్దని ఆమె హెచ్చరించారు. వైద్య పరిజ్ఞానంతో పాటు వ్యర్థాల నిర్వహణ, శుభ్రత, స్టీవార్డ్‌షిప్ ప్రోగ్రాములను పాటించడం వల్లనే సూపర్‌బగ్స్ నుంచి కాపాడుకోగలమని స్పష్టం చేశారు.
ఈ వార్తలు కూడా చదవండి.
ప్రభుత్వ ఉద్యోగులకు కేంద్రం గుడ్ న్యూస్
గొంతు నొప్పిని తగ్గించే సింపుల్ చిట్కా..
ప్రయాణికులకు గుడ్ న్యూస్ చెప్పిన కేంద్ర మంత్రి
Read Latest Telangana News and National News