ESI Hospitals: మూత్ర పరీక్షకూ దిక్కులేదు!
ABN , Publish Date - Jul 07 , 2025 | 01:23 AM
రాష్ట్రంలో ఈఎ్‌సఐ ఆస్పత్రులు, డిస్పెన్సరీలకు వెళ్లడానికి రోగులు తటపటాయిస్తున్నారు. భారీగా ఓపీ పడిపోతుండడంతో డిస్పెన్సరీలు ఒక్కొక్కటిగా మూతపడుతున్నాయి.
చిరుద్యోగులు, కార్మికులకు మెరుగైన వైద్య సేవలు అందించాల్సిన ఈఎ్‌సఐ ఆస్పత్రులు, డిస్పెన్సరీలు పతనావస్థకు చేరాయి. మౌలిక సదుపాయాలు లేవు. కనీస వైద్య పరీక్షలకూ దిక్కులేకుండా పోయింది. సరిపడా వైద్యులూ లేరు. 270 పడకలున్న నాచారం ఆస్పత్రిలో మూత్ర పరీక్షలు కూడా చేయడం లేదంటే పరిస్థితి ఏ స్థాయికి దిగజారిందో అర్థం చేసుకోవచ్చు. ఫలితంగా ఈఎస్‌ఐ కార్డుదారులు తీవ్ర ఇక్కట్లు ఎదుర్కొంటున్నారు.
రాష్ట్రంలో పతనావస్థలో ఈఎ్‌సఐ వైద్యం
వైద్యులు లేరు.. మందులూ లేవు..
నిర్వహణ సరిగా లేక తగ్గుతున్న రోగులు
వరుసగా మూతపడుతున్న డిస్పెన్సరీలు
రూ.150 కోట్ల మేర ఔషధ బకాయిలు
నిలిచిపోయిన మందుల సరఫరా
బిల్లుల చెల్లింపును పట్టించుకోని ఈఎస్‌ఐ ఉన్నతాధికారులు
ఈఎస్‌ఐ కార్డుదారులు, కుటుంబ సభ్యులు 72 లక్షల మందికి ఇబ్బందులు
హైదరాబాద్, జూలై 6 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో ఈఎ్‌సఐ ఆస్పత్రులు, డిస్పెన్సరీలకు వెళ్లడానికి రోగులు తటపటాయిస్తున్నారు. భారీగా ఓపీ పడిపోతుండడంతో డిస్పెన్సరీలు ఒక్కొక్కటిగా మూతపడుతున్నాయి. కొన్నింటిని దగ్గరిలో ఉన్న వాటిలో కలిపేస్తున్నారు. రాష్ట్రంలోని ఈఎ్‌సఐ ఆస్పత్రులకు సంబంధించి ఏడాదిగా ఔషధ సరఫరాదారులకు బిల్లులు చెల్లించడం లేదు. సుమారు రూ.150 కోట్లు పెండింగ్‌లో పడ్డాయి. వారు మందుల సరఫరా నిలిపివేశారు. ఈ ఆస్పత్రులపై ఆధారపడిన సుమారు 18 లక్షల మంది ఈఎస్‌ఐ ఐపీ కార్డు హోల్డర్లు, వారి కుటుంబ సభ్యులు కలిపి మొత్తం 72 లక్షల మంది ఇబ్బందిపడుతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 71 ఈఎ్‌సఐ డిస్పెన్సరీలు, 4 ఆస్పత్రులు, 2 డయాగ్నస్టిక్స్ కేంద్రాలు ఉన్నాయి. ఎక్కువ మంది రోగులొచ్చే డిస్పెన్సరీల్లో ఐదుగురు చొప్పున, మిగతా వాటిలో ఇద్దరు చొప్పున వైద్యులు ఉన్నారు. డిస్పెన్సరీల్లో చాలా వరకు అద్దె భవనాల్లో నడుస్తున్నాయి. రెండు, మూడేళ్లుగా వాటికి అద్దెలు చెల్లించడం లేదు. కొన్నింటికి భవన యజమానులు తాళాలు వేశారు. ఇటీవలే ఏడుగురు యజమానులు తమ భవనాలను ఖాళీ చేయాలని ఈఎ్‌సఐకి నోటీసులు కూడా ఇచ్చారు. పలుచోట్ల డిస్పెన్సరీలను సరిగా నిర్వహించలేక సమీపంలోని ఈఎ్‌సఐ ఆస్పత్రులు, డిస్పెన్సరీల్లో కలిపేస్తున్నారు. అద్దె సరిగా చెల్లించకపోవడంతో హైదరాబాద్‌లోని తార్నాక డిస్పెన్సరీకి భవన యజమాని తాళం వేశారు. ఆ డిస్పెన్సరీని తాజాగా నాచారం ఆస్పత్రికి తరలించారు. జీడిమెట్ల-1, జీడిమెట్ల-2 డిస్పెన్సరీలను, సనత్‌నగర్‌లో రెండు డిస్పెన్సరీలను కలిపేశారు. ఇలా ఇప్పటివరకు సుమారు 20 డిస్పెన్సరీలను విలీనం చేశారు. మరోవైపు డిస్పెన్సరీల్లో 120 పైగా డాక్టర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. దీనితో రోగులు ఇబ్బందిపడుతున్నారు.
కనీస వైద్య పరీక్షలూ కరువే!
ఈఎ్‌సఐ ఆస్పత్రులు, డిస్పెన్సరీలకు వచ్చే రోగులకు వైద్యం, పరీక్షలు, ఔషధాలు ఉచితంగా అందాలి. అయితే వైద్య పరీక్షలకు అవసరమైన రసాయన పదార్థాల (రీఏజెంట్స్)కాంట్రాక్టు గడువు ముగియడంతో ఈ ఏడాది ఏప్రిల్ నుంచే సరఫరా నిలిచిపోయింది. కొత్తగా టెండర్లు పిలిచి రీఏజెంట్స్ సరఫరాకు చర్యలు తీసుకోవాల్సిన ఈఎస్‌ఐ ఉన్నతాఽధికారులు పట్టనట్లు వ్యవహరిస్తున్నారు. నాచారం వంటి కీలక ఈఎ్‌సఐ ఆస్పత్రిలో రీఏజెంట్స్ లేక మూత్ర పరీక్షలు నిలిచిపోయాయి. రక్త పరీక్షల్లోనూ కొన్ని రకాలే చేస్తున్నారు. దీంతో ఓపీ(ఔట్ పేషెంట్ల)సంఖ్య 40శాతానికి తగ్గినట్టు ఈఎస్‌ఐ వర్గాలు చెబుతున్నాయి. ఈఎస్‌ఐ రెండేళ్లుగా ఔషధ సరఫరా కంపెనీలకు సరిగా బిల్లులు చెల్లించడం లేదు. ఏడాది నుంచి రూపాయీ ఇవ్వకపోవడంతో బకాయిలు రూ.150కోట్లకు చేరాయి. దీంతో ఆ సంస్థలు మందుల సరఫరా నిలిపివేశాయి. లోకల్ పర్ఛేజ్ కింద ఔషధాలను సరఫరా చేసే ‘ట్వీన్ సిటీస్ మెడికల్ అసోసియేషన్స్’ కూడా ఈఎ్‌సఐ ఆస్పత్రులకు మందులు సరఫరా చేయబోమని చెప్పాయి. ఈఎ్‌సఐ ఆస్పత్రుల నుంచి 5లక్షల మంది మధుమేహ బాధితులు ప్రతీనెలా ఇన్సులిన్ ఇంజెక్షన్లు తీసుకెళ్తుంటారు. కొన్ని నెలలుగా వాటి సరఫరా నిలిచిపోవడంతో బయటే కొనుగోలు చేస్తున్నారు. పలు ముఖ్యమైన ఔషధాలు కూడా అందుబాటులో లేకుండాపోయాయి. కొత్తగా బాధ్యతలు తీసుకున్న కార్మికశాఖ మంత్రి వివేక్ ఈ దుస్థితిపై దృష్టిసారించాలని లబ్ధిదారులు కోరుతున్నారు.
Also Read:
కేటీఆర్‌కు సామ రామ్మోహన్ రెడ్డి సవాల్..
మోదీ ప్రభుత్వం విద్వేషాలని రెచ్చగొడుతోంది.. మంత్రి పొన్నం ప్రభాకర్ ఫైర్
వందేభారత్‌కు తృటిలో తప్పిన ప్రమాదం..
For More Telangana News And Telugu News