Share News

Hyderabad: వ్యధల చెరలో వార్ధక్యం

ABN , Publish Date - Jun 28 , 2025 | 04:23 AM

రాజధాని హైదరాబాద్‌లో వెలుగుచూస్తున్న సైబర్‌ నేరాల్లో ఎక్కువమంది బాధితులు వృద్ధులే. దీనికి కారణం.. వృద్ధుల దగ్గర పెద్దమొత్తంలో ఉంటున్న డబ్బులే. రిటైర్మెంట్‌ బెనిఫిట్స్‌, సేవింగ్స్‌, ఇల్లు, పొలం వంటివి అమ్మడం వల్ల వచ్చిన సొమ్ము..

Hyderabad: వ్యధల చెరలో వార్ధక్యం

  • హైదరాబాద్‌లో సైబర్‌ నేరగాళ్ల బారిన పడుతున్న వారిలో వృద్ధులే అధికం

  • ఉరుకుల పరుగుల జీవితంలో కన్నవారిని పట్టించుకోలేనంత హడావుడి పిల్లలది!

  • పిల్లల ప్రేమకు నోచుకోని ఒంటరితనం, మాట్లాడే మనుషుల్లేని దైన్యం వృద్ధులది

  • వారి ఒంటరితనాన్ని ఆసరాగా చేసుకుని నమ్మించి దోచుకుంటున్న సైబర్‌ క్రిమినల్స్‌

  • హనీ ట్రాప్‌తో కొందరు వృద్ధులకు గాలం

  • పల్లెటూర్లలో ఆస్తి కోసం పిల్లల తగాదాలు

  • డబ్బు, ఆస్తుల కోసం కన్నవారిపైనే కత్తి దూస్తున్న పిల్లలు

రాజధాని హైదరాబాద్‌లో వెలుగుచూస్తున్న సైబర్‌ నేరాల్లో ఎక్కువమంది బాధితులు వృద్ధులే. దీనికి కారణం.. వృద్ధుల దగ్గర పెద్దమొత్తంలో ఉంటున్న డబ్బులే. రిటైర్మెంట్‌ బెనిఫిట్స్‌, సేవింగ్స్‌, ఇల్లు, పొలం వంటివి అమ్మడం వల్ల వచ్చిన సొమ్ము.. ఇలా ఏదో ఒక రూపంలో డబ్బులుంటున్నాయి. వారికి లేనిదల్లా ఒక్కటే.. పిల్లల నుంచి ఆత్మీయమైన పలకరింపు! పనులు, వృత్తి, ఉద్యోగాల బిజీలో పడిపోయి.. తల్లిదండ్రులను పలకరించలేనంత హడావుడి పట్నం పిల్లలది. ఆ ఒంటరితనాన్ని తట్టుకోలేని వృద్ధులు.. సైబర్‌ నేరగాళ్లకు సులభ లక్ష్యంగా మారతున్నారు! వారు బెదిరిస్తే భయపడిపోతున్నారు! హనీట్రా్‌పలకు లొంగిపోతున్నారు!! అదే సమయంలో.. పల్లెల్లో వృద్ధులకు చుట్టూ ‘నా అనేవారు’ చాలా మంది ఉన్నా.. ఆస్తి, డబ్బు కోసం కన్నబిడ్డలే వారిని కడతేరుస్తున్నారు!! ఒక్కమాటలో చెప్పాలంటే.. డబ్బున్నచోట ఆప్యాయత కరువై, మందిబలం ఉన్న చోట వార్ధక్యం బరువై.. మలి వయసు చాలామందికి శాపంగా మారుతోంది. తరాలు తిన్నా తరగనంత సంపద ఉన్నా, ప్రతి నెలా వేలల్లో పెన్షన్‌, అద్దెలు వస్తున్నా.. 68 ఏళ్ల చక్రధర్‌ (పేరు మార్చాం) భార్య చనిపోయి చాలాకాలమైంది. పిల్లలు విదేశాల్లో ఉంటున్నారు. ఖాతాలో బోలెడంత డబ్బున్నా.. వేళకింత ముద్ద పెట్టేవాళ్లు లేరు! ఆయన ఖాతాలో భారీగా ఉన్న డబ్బు గురించి తెలుసుకున్న సైబర్‌ నేరగాడొకడు ఆయనతో మాట కలిపాడు. ఫలానా యాప్‌ ద్వారా పెట్టుబడులు పెడితే బోలెడన్ని లాభాలు వస్తాయంటూ.. ఒక లింకు పంపాడు. చక్రధర్‌ ఆ మోసగాడి మాటలు నమ్మి ఆ యాప్‌ను ఇన్‌స్టాల్‌ చేసుకోగానే.. ఆయన బ్యాంకు ఖాతాలన్నీ ఖాళీ అయ్యాయి!!


సొంతూరిలో కొడుకులు, కూతుళ్లు.. కళ్లముందే మనుమళ్లు, మనుమరాళ్లతో హాయిగా సాగుతున్న రామయ్య, సరోజినమ్మ(అసలు పేర్లు కాదు) జీవితాల్లో ఊహించని కుదుపు. ఆస్తి పంపకాల్లో తమ్ముడికి తనకన్నా ఎక్కువ ఇచ్చారని అన్న.. తమకు వాటా ఇవ్వలేదని కూతుళ్లు.. అంతా అలిగారు. పెద్ద కొడుకు తండ్రిపై కోపంతో ఆయన్ను చంపేశాడు. భర్త మరణాన్ని.. పిల్లల తీరును భరించలేక సరోజినమ్మ ఆత్మహత్య చేసుకుంది.

21.jpg


..ఇలా ఒకటా, రెండా... పింఛను డబ్బుకోసం తండ్రి నాలుక కోసిన పుత్రరత్నం, ఆస్తి పంచట్లేదని కన్నతండ్రిని ట్రాక్టర్‌తో గుద్ది చంపిన కుమారులు.. వంటి అమానవీయ ఘటనలు కోకొల్లలు. పల్లెల్లో ఆస్తి తగాదాల కారణంగా కన్నవారిని ఇంటి నుంచి పొమ్మంటుంటే, పట్టణాల్లో పిల్లల నిరాదరణ తల్లిదండ్రులకు శాపంగా మారుతోంది. మంచి ఉద్యోగాల్లో స్థిరపడ్డ చాలా మంది.. తల్లిదండ్రులను బాగానే చూసుకుంటున్నా.. వారి బిజీలో వారు ఉండిపోతున్నారు. తాము బాగా సంపాదిస్తున్నాం కాబట్టి.. ‘‘తండ్రికి పెన్షన్‌ ఎంతొస్తోంది? అనే విషయాన్ని కూడా పట్టించుకోవట్లేదు. కానీ, తాము తల్లిదండ్రులతో మనసు విప్పి మాట్లాడకపోవడమే కన్నవారి అసలు సమస్య అనే విషయం ఆ పిల్లలకు అర్థం కావట్లేదు. ఏ వ్యాపకం లేకుండా ఉండడం.. చేతిలో బోలెడంత డబ్బుండడంతో.. స్మార్ట్‌ఫోన్‌ ద్వారా సైబర్‌ మోసగాళ్లు పన్నే ఉచ్చుకు, హనీట్రాప్‌లకు చిక్కుతున్నారు. రాష్ట్రంలో సైబర్‌ నేరగాళ్ల బారిన పడుతున్న వయోధికుల్లో 70-85ు ఒంటరి మగవాళ్లే కావడం ఇందుకు రుజువు. విదేశాల్లో ఉంటున్న చాలామంది పిల్లలకు కన్నవారిని పట్టించుకునే తీరికే ఉండట్లేదు.


పల్లెల్లో అలా...

పట్టణాలతో పోలిస్తే గ్రామీణ వాతావరణంలో ఒంటరితనానికి పెద్దగా తావుండదు. ఉద్యోగ, ఉపాధి అవకాశాలరీత్యా పిల్లలు ఇతర ప్రాంతాలలో స్థిరపడినా... పల్లెల్లోని పెద్దలకు ఇరుగుపొరుగుతో బోలెడంత కాలక్షేపం. ఈ మధ్య పల్లెలు కూడా సెమీ అర్బన్‌ సంస్కృతిని సంతరించుకుంటున్న నేపథ్యంలో... అక్కడా ఒంటరితనం తాలూకు సమస్యలు కొంత పెరుగుతున్నాయి. కానీ ఏదో ఒక పనికల్పించుకోడానికి అవకాశం, పలకరించడానికి చుట్టూ బంధు, మిత్రులున్నారన్న ధైర్యం గ్రామీణ వయోధికుల్లో కొంత వరకు భరోసా కల్పిస్తుంది. అయితే, ఈ మధ్యకాలంలో ఆస్తి తగాదాలు, పిల్లల్లో సఖ్యత లేకపోవడం వారికి పెద్ద కష్టాలను తెచ్చిపెడుతున్నాయి. పిల్లలకు పంచగా, తల్లిదండ్రుల అవసరార్థం అట్టిపెట్టుకున్న ఆస్తిమీద కన్నేసిమరీ కన్నవారిని కాటికి పంపుతున్న అమానవీయ ఘటనలు ఏపీ, తెలంగాణలోనూ ఈ మధ్య వెలుగుచూశాయి. పట్టణాలతో పోలిస్తే గ్రామాల్లోనే వయోధికులపై వేధింపులు అధికంగా ఉన్నాయని హెల్పేజ్‌ ఇండియా ప్రతినిధులు చెబుతున్నారు. కచ్చితంగా పింఛను డబ్బు వచ్చే రోజున ఇంటిమీద పడి నానాయాగీ చేసి తల్లిని కొట్టి మరీ ఆ సొమ్మును తాగడానికి తీసుకెళుతున్న ప్రబుద్ధులకు తెలుగునాట కొదవలేదు. మగపిల్లలతో పోలిస్తే కూతుళ్లు కన్నవారిపట్ల ప్రేమ, కరుణతో ఉంటారని ఒక నమ్మకం. కానీ.. ఇటీవలి కాలంలో పల్లెల్లో ఆడపిల్లలు సైతం అమ్మానాన్నపట్ల కర్కశత్వంగా వ్యవహరిస్తున్న ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. ఇటీవలికాలంలో భూముల రేట్లు ఆకాశాన్నంటుతుండడంతో ఇలాంటి గొడవలు పల్లెల్లో మరీ ఎక్కువగా జరుగుతున్నాయని హెల్పేజ్‌ ఇండియా ప్రాజెక్టు కోర్డినేటర్‌ శ్యామ్‌ తెలిపారు. ఇలాంటి సమస్యల నుంచి బయటపడాలంటే వృద్ధులు సాంఘిక జీవనాన్ని పెంపొందించుకోవాలని.. వయోధికుల హక్కుల సంఘానికి చెందిన డాక్టర్‌ రావు చెలికాని సూచిస్తున్నారు.


వృద్ధుల కోసం హెల్ప్‌ లైన్లు

కుటుంబం, సమాజం నుంచి వేధింపులు, సమస్యలు ఎదుర్కొంటున్న వయోధికులకు తగిన సహాయం అందించడానికి హెల్పేజ్‌ ఇండియా ఒక ఉచిత హెల్ప్‌లైన్‌ నిర్వహిస్తోంది. నంబరు.. 18001801253. బాధితులే కాదు, కష్టాల్లో ఉన్న వృద్ధుల గురించి ఎవరైనా ఈ సహాయ కేంద్రానికి తెలియజేయచ్చు.అలాగే, వయోధికులకు అండగా కేంద్ర ప్రభుత్వం 14567 హెల్ప్‌లైన్‌ను అందుబాటులోకి తెచ్చింది. పథకాలు, పెన్షన్‌, పింఛన్లు తదితర విషయాలకు సంబంధించిన అనుమానాలను నివృత్తి చేయడంతో పాటు మానసిక స్థైర్యాన్ని అందించే కౌన్సెలింగ్‌ లాంటి సేవలను ఉచితంగా పొందవచ్చు. ఉదయం 8 నుంచి రాత్రి 8 గంటల వరకూ ఈ హెల్ప్‌లైన్‌ పనిచేస్తుంది.

అమ్మానాన్నలతో రోజూ మాట్లాడండి

పట్టణ ప్రాంతాల్లో 20-25 శాతం వృద్ధుల్లో మానసిక కుంగుబాటు కనిపిస్తోంది. అందుకు ప్రధానకారణం ఒంటరితనం. ఈ మధ్యకాలంలో 60-75 ఏళ్లలోపు ఒంటరి మగవాళ్లు హనీట్రాప్‌ లాంటి మోసాలకు గురవుతున్నారు. అందులోనూ మరొక తోడు కోసం పరితపిస్తున్న పెద్దలే ఎక్కువమంది బాధితులు. కనుక వారి మానసిక స్థితిని అర్థంచేసుకోవాలి. అలాగే.. వయోధికులకు డిజిటల్‌ లిటరసీ చాలా అవసరం. పిల్లలు కూడా.. ఎంత బిజీగా ఉన్నా తల్లిదండ్రులతో రోజూ కాసేపు మాట్లాడాలి. సరైన సమయంలో గుర్తించి తగిన వైద్య సహాయం అందించాలి.

- డాక్టర్‌ మధువంశీ, సైకియాట్రిస్ట్‌


ఆశకు పోతే ఖాతా ఖాళీ.. జరభద్రం

స్టాక్‌ మార్కెట్‌, షేర్‌ మార్కెట్లో సొమ్ము పెడితే రెట్టింపు అవుతుందన్న ప్రకటనలు నమ్మి కొంతమంది వయోధిక మహిళలు కూడా లక్షల రూపాయలు పోగొట్టుకున్నారు. డిజిటల్‌ అరెస్టులు, ‘మీ కొడుకును నార్కోటిక్‌ కేసులో బంధించాం’ లాంటి బెదిరింపులతో డబ్బు గుంజేస్తున్నారు. బీమా కంపెనీల పేరుతో ఓటీపీలు తీసుకొని బ్యాంకు ఖాతాలు ఖాళీచేస్తున్నారు. కాబట్టి వృద్ధులు ఇలాంటివాటిపట్ల జాగ్రత్తగా ఉండాలి. వ్యక్తిగత విషయాలు, బ్యాంకు ఖాతా వివరాలు, పాస్‌వర్డ్‌లు ఎవరితోనూ చెప్పకూడదు. అధిక లాభాలు వస్తాయని ఎవరైనా చెప్తే ఆశపడి ఆన్‌లైన్‌ వ్యాపారాల్లో పెట్టుబడి పెట్టద్దు. మీరు మోసపోయినట్లు గుర్తించినా, మిమ్మల్ని ఎవరైనా బెదిరించినా ధైర్యంగా ఫిర్యాదు చేయండి.

- జి. నాగేశ్వరరావు,


స్టేట్‌ కౌన్సిల్‌ ఫర్‌ సీనియర్‌ సిటిజన్స్‌ సభ్యుడు వ్యాపకాలు కల్పించుకోవాలి

వృద్ధాప్యంలో అయినవారి ప్రేమాభిమానాలు, ఆత్మీయ స్పర్శ చాలా అవసరం. అవి కుటుంబం నుంచి లభిస్తే.. చాలా సమస్యలు పరిష్కారమవుతాయి. వృద్ధులు కూడా ఒంటరితనాన్ని జయించడానికి మంచి వ్యాపకాలు కల్పించుకోవాలి. అందుకే మేము నెలకు రెండు సార్లు వయోధికులతో ఆత్మీయ సమావేశాలు ఏర్పాటుచేస్తున్నాం.

- రాజేశ్వరి, తోడు-నీడ ఫౌండేషన్‌


ఈ వార్తలు కూడా చదవండి

Trains: రైల్వే ప్రయాణికులకో గుడ్ న్యూస్.. అందేంటంటే..

Bandi Sanjay: 10 లక్షల ఎకరాల్లో పంటలు ఎండినా పట్టదా?

Raja Singh: ముఖ్యమంత్రితో బీజేపీ సీనియర్‌ నేతల రహస్య భేటీలు

Read Latest Telangana News and Telugu News

Updated Date - Jun 28 , 2025 | 04:23 AM