Pappalaguda: భూ మాయ చేశారు!
ABN , Publish Date - Aug 14 , 2025 | 03:34 AM
నానక్‌రామ్ గూడ ఔటర్ రింగురోడ్డు టోల్‌గేట్‌కు పక్కన.. సర్వీసు రోడ్డుకు అనుకుని ఉన్న అత్యంత విలువైన భూములు ఇవి. ఇక్కడ ఎకరా ఎంత లేదన్నా రూ.100 కోట్లకు పైగానే ఉంటుంది. గతంలో వీటిపై వివాదాలు ఎన్నో జరిగినప్పటికీ న్యాయస్థానాల్లో ప్రైవేటు వ్యక్తుల వాదనలు నిలబడలేదు.
పుప్పాలగూడలో రూ. 6 వేల కోట్ల భూకుంభకోణం!!
ఓఆర్‌ఆర్‌ను ఆనుకుని ఉన్న కాందిశీకుల భూముల్లో రూ.30 వేల కోట్ల విలువైన రియల్‌ఎస్టేట్ వ్యాపారం
2005లో నిషేధిత జాబితాలో ఉన్న ప్రభుత్వ భూములవి
2021లో ఆ జాబితా నుంచి కొన్ని భూముల తొలగింపు
2022లో భారీ నిర్మాణాలకు హెచ్‌ఎండీఏ అనుమతులు
2025లో కొన్ని భూములు మళ్లీ నిషేధిత జాబితాలోకి
మాజీ ఎంపీ రంజిత్‌రెడ్డి కనుసన్నల్లో సాగిన వ్యవహారం!
వెస్టర్న్ కన్‌స్ట్రక్షన్ కంపెనీకి దాసోహమైన హెచ్‌ఎండీఏ
కంపెనీ డైరెక్టర్‌గా రంజిత్‌రెడ్డి కుమారుడు రాజ్ ఆర్యన్
మరో మాజీ ఎంపీ బంధువు కంపెనీది కూడా అదే దారి
ఈ భూదందాపై లోకాయుక్తకు, ఈడీకి ఫిర్యాదులు
2005 నాటికి అవన్నీ ప్రభుత్వ భూములే.
2021 నాటికి వాటిలో కొన్నింటిని ప్రైవేటు
భూములుగా చూపించారు.
2025 నాటికి మళ్లీ వాటిలో కొన్నింటిని ప్రభుత్వ
భూముల జాబితాలో చేర్చారు.
ఎంతలేదన్నా ఎకరా రూ.100 కోట్ల ధర పలికే భూమి అది. 2005 నుంచి ఖాళీగా ఉన్న ఆ భూముల్లో.. 2021లో బహుళ అంతస్తులతో భారీ భవన నిర్మాణాలకు అనుమతులిచ్చారు. రూ.30 వేల కోట్ల రియల్ ఎస్టేట్ వ్యాపారానికి గేట్లెత్తారు. రాజకీయ నేతల అత్యాశకు అధికారుల వత్తాసు తోడైన ఫలితమిది! హైదరాబాద్‌లో ఔటర్ రింగ్‌రోడ్డును ఆనుకుని పుప్పాలగూడలో ఉన్న కాందిశీకుల భూముల కథ ఇది! అత్యంత విలువైన ఆ ప్రభుత్వ భూముల్ని ఇష్టం వచ్చినట్టుగా నిషేధిత జాబితా నుంచి ఎలా తీసేశారు? అందులో కొన్నింటిని ప్రైవేటు భూములుగా ఎలా చూపించారు? మళ్లీ ఆ భూముల్లో కొన్నింటిని.. ప్రభుత్వ భూముల జాబితాలో ఎలా చేర్చారు? ఈ మార్పిళ్ల వెనుక మతలబు ఏమిటి? ఎన్నో ప్రశ్నలు... ఈ భూ కుంభకోణం విలువ.. రూ.6 వేల కోట్లు!! దీని వెనుక గత ప్రభుత్వంలో చక్రం తిప్పిన వ్యక్తులు ఉన్నారు. ప్రభుత్వం మారగానే వారంతా కండువాలు మార్చి అధికార పార్టీలోకి ఫిరాయించారు!! బీఆర్‌ఎస్ పార్టీ నిషేధిత భూములను సైతం రాత్రికి రాత్రే తనకు కావాల్సిన వాళ్లకు కట్టబెట్టిందంటూ.. 2023 అసెంబ్లీ ఎన్నికలకు ముందు రేవంత్ సహా పలువురు కాంగ్రెస్ నేతలు ఆరోపించారు. అధికారంలోకి వచ్చాక కూడా.. గత సర్కారు భూ అక్రమాలపై ఫోరెన్సిక్ ఆడిట్ నిర్వహిస్తామని పలుమార్లు హెచ్చరించారు. ఆ ఆడిట్‌లో భాగంగా ఈ భూములపైనా దృష్టిసారిస్తే అక్రమాల నిగ్గుతేలే అవకాశం ఉంది.
(ఆంధ్రజ్యోతి-రంగారెడ్డిజిల్లా ప్రతినిధి): ఔటర్ రింగురోడ్డుకు ఆనుకుని ఉన్న పుప్పాలగూడ సర్వేనంబరు 277, 278, 280, 281, 282, 340, 341, 342లో సుమారు 101.12 ఎకరాలకుపైగా కాందిశీకుల భూములు ఉన్నాయి. నానక్‌రామ్ గూడ ఔటర్ రింగురోడ్డు టోల్‌గేట్‌కు పక్కన.. సర్వీసు రోడ్డుకు అనుకుని ఉన్న అత్యంత విలువైన భూములు ఇవి. ఇక్కడ ఎకరా ఎంత లేదన్నా రూ.100 కోట్లకు పైగానే ఉంటుంది. గతంలో వీటిపై వివాదాలు ఎన్నో జరిగినప్పటికీ న్యాయస్థానాల్లో ప్రైవేటు వ్యక్తుల వాదనలు నిలబడలేదు. ఈ సర్వే నంబర్లలోని కొంత భూమికి హక్కుదారులమని, కబ్జాలో కూడా తామే ఉన్నామంటూ కొందరు గతంలో రెవెన్యూ అధికారులకు దరఖాస్తు చేసుకున్నారు. ఈ మేరకు 1994లో అప్పటి జాయింట్ కలెక్టర్ ఈ సర్వేనంబర్లలోని కొన్ని భూములకు డబ్బు కట్టించుకుని అప్పటికే కబ్జాలో ఉన్న వారికి కేటాయించేందుకు మెమో జారీ చేశారు. అయితే అప్పటి కలెక్టర్ దీన్ని వ్యతిరేకించి.. జాయింట్ కలెక్టర్ ఆదేశాలను నిలిపివేశారు. చివరకు ఈ వ్యవహారం ప్రభుత్వం వద్దకు వెళ్లింది. సీసీఎల్‌ఏ స్థాయిలో ఈ పక్రియ కొన్నేళ్లు నిలిచిపోయింది. అనంతరం.. ఆయా భూముల క్రయవిక్రయాలు నిషేధిస్తూ 2005 జూన్‌లో అప్పటి సీసీఎల్‌ఏ ఆదేశాలు జారీ చేశారు. దీంతో రిజిస్ట్రేషన్ కార్యాలయం ఈ భూములన్నింటినీ అప్పట్లోనే 22ఏ కింద నిషేధిత జాబితాలో పెట్టింది. అయితే.. ఔటర్ రింగ్ రోడ్డును ఆనుకుని ఉన్న అత్యంత ఖరీదైన ఈ భూములపై గత ప్రభుత్వ హయాంలో కొందరు పెద్దల కన్ను పడింది! వారు ఏం మాయ చేశారో ఏమోగానీ.. నిషేధిత జాబితాలో ఉన్న భూముల్లో కొన్నింటిని 2021లో ఆ జాబితా నుంచి తొలగింపజేయడం ద్వారా క్లియరెన్స్ తెచ్చుకున్నారు. ఆ భూముల్లో బహుళ అంతస్తుల నిర్మాణాలకు హెచ్‌ఎండీఏ ద్వారా ఏడాదిలోగా చకచకా అనుమతులు ఇప్పించుకున్నారు. సాధారణ వ్యక్తులు ఎవరైనా చిన్న ఇంటి నిర్మాణం కోసం దరఖాస్తు చేసుకుంటే రకరకాల కొర్రీలు పెట్టి ఏళ్ల తరబడి తమచుట్టూ తిప్పించుకునే అధికారులు.. నిషేధిత జాబితాలో ఉన్న ఈ రూ.వేల కోట్ల విలువైన ప్రభుత్వ భూముల్లో వాణిజ్య/నివాస ప్రాజెక్టు నిర్మాణాలకు అనుమతులు ఇచ్చేయడం గమనార్హం. నాలుగేళ్లుగా ఈ దందా కొనసాగుతుండగా.. 2025లో ప్రభుత్వం ఈ సర్వే నంబర్లలో కొన్నింటిని మళ్లీ నిషేధిత జాబితాలో పెట్టడం గమనార్హం. కానీ.. ఇప్పటికే ఆ భూమిలోని దాదాపు 60 ఎకరాల్లో రెండు కంపెనీలకు సంబంధించిన భారీ ప్రాజెక్టులు శరవేగంగా కొనసాగుతున్నాయి. వాటిలో బహుళ అంతస్తుల భారీ భవన నిర్మాణాలు 70 శాతానికిపైగా పూర్తయ్యాయి. ఆ రెండు ప్రాజెక్టుల వెనుకా గతప్రభుత్వంలో చక్రం తిప్పిన నేతలు ఉన్నారు. వారంతా ఇప్పుడు కాంగ్రె్‌సలో ఉన్నారు.
1.4 కోట్ల చదరపు అడుగుల్లో...
పుప్పాలగూడ సర్వేనంబరు 277, 282, 340, 341, 342పార్టులలోని దాదాపు 30 ఎకరాలకుపైగా భూమి నిషేధిత జాబితాలో ఉన్నప్పటికీ.. అనుమతులు సంపాదించి వెస్టర్న్ కన్‌స్ట్రక్షన్ సంస్థ ఇక్కడ 7.95 ఎకరాల్లో ‘వెస్టర్న్ విండ్సర్ పార్క్’ (రెరా నంబరు పి02400045581), 13.14 ఎకరాల్లో ‘వెస్టర్న్ స్ట్రింగ్స్’ (రెరా నంబరు పి0240005326), 7.75 ఎకరాల్లో ‘వెస్టర్న్ మెరీనా’ (రెరా నంబరు పి02400045581) పేరుతో భారీ టవర్లు నిర్మిస్తోంది. 41 అంతస్తులతో దాదాపు 1.40 కోట్ల చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మాణాలకు హెచ్‌ఎండీఏ అనుమతులు జారీ చేసింది. ఈ ప్రాజెక్టు విలువ దాదాపు రూ.20 వేల కోట్ల దాకా ఉంటుంది. సర్కారు ఇవి ప్రభుత్వ భూములని పేర్కొంటూ నిషేధిత జాబితాలో పెట్టినా.. ఈ భూములపై 26 సివిల్ కేసులు పెండింగ్‌లో ఉన్నా కూడా నిర్మాణాలకు హెచ్‌ఎండీ 2022లో అనుమతులు ఇవ్వడం గమనార్హం. ఒకవేళ వారు కోర్టుల ద్వారా లేదా ప్రభుత్వ ఉత్తర్వుల ద్వారా ఈ భూముల్లో నిర్మాణాలకు అనుమతులు తెచ్చుకున్నాయనుకున్నా.. వాటిని మళ్లీ నిషేధిత జాబితాలో ఎందుకు పెట్టారో చెప్పాలి.
ఎవరిదీ కంపెనీ ?
కాందిశీకుల భూములకు దర్జాగా అనుమతులు తీసుకుని భారీ భవంతులు నిర్మిస్తున్న వెస్టర్న్ కన్‌స్ట్రక్షన్స్ కంపెనీలో అనేక మంది పెద్దల పెట్టుబడులు ఉన్నాయి. ఇందులో కొందరు తెరపై కనిపిస్తుండగా మరికొందరు తెరవెనుక ఉండి కథ అంతా నడిపారు. ఈ కంపెనీకి మాజీ ఎంపీ గడ్డం రంజిత్‌రెడ్డితో పాటు మరికొందరు రాజకీయ నేతల బంధువులు ప్రమోటర్లుగా ఉన్నారు. రంజిత్‌రెడ్డి కుమారుడు గడ్డం రాజ్ ఆర్యన్ రెడ్డి ఈ కంపెనీలో డైరెక్టర్‌గా ఉన్నారు. వీరితో పాటు మాజీ ఎంపీ బంధువులు కూడా భాగస్వాములుగా ఉన్నారు. అప్పట్లో ఈ ఇద్దరు నేతలూ ఈ భూముల వ్యవహారంలో చక్రం తిప్పారు.
డీఎ్‌సఆర్‌ఎ్‌సఎ్‌సఐ కంపెనీదీ అదే దారి
మరో మాజీ ఎంపీ బంధువు అయిన డి.రఘురామిరెడ్డికి చెందిన డీఎ్‌సఆర్ ఎస్‌ఎ్‌సఐ బిల్డర్స్ అండ్ డెవలపర్స్ సంస్థ కూడా ఇలాగే అనుమతులు పొంది.. పుప్పాలగూడలోని 278, 280, 281 తదితర సర్వే నంబర్లలోని దాదాపు 30 ఎకరాల కాందిశీకుల భూముల్లో 30 అంతస్తుల భారీ నిర్మాణాలు చేపడుతోంది. దాదాపు 70 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మాణాలు చేపట్టింది. ఈ ప్రాజెక్టు విలువ ఎంత లేదన్నా రూ.10వేల కోట్లకుపైగానే ఉంటుందని అంచనా. ఈ రెండు కంపెనీలకూ.. మాజీ హెచ్‌ఎండీఏ కమిషనర్, ఐఏఎస్ అర్వింద్‌కుమార్, మాజీ ప్లానింగ్ డైరెక్టర్ శివబాల కృష్ణ నిబంధనలకు విరుద్ధంగా అనుమతులు ఇచ్చారనే అభియోగాలు వినిపిస్తున్నాయి.
లోకాయుక్తాలో ఫిర్యాదు.. ఈడీకి కూడా..
ఈ భూముల అన్యాక్రాంతంపై విచారణ జరపాలని ప్రముఖ న్యాయవాది ఇమ్మనేని రామారావు లోకాయిక్తాలో ఇటీవల ఫిర్యాదు చేశారు. ప్రభుత్వ భూమిగా నిషేధిత జాబితాలో ఉన్నప్పటికీ అప్పటి హెచ్‌ఎండీఏ కమిషనర్ అరవింద్‌కుమార్ , డైరెక్టర్ శివ బాలకృష్ణ వారికి నిర్మాణ అనుమతులు ఇవ్వడానికి సహాయం చేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు. దీనిపై విచారించిన లోకాయుక్త జస్టిస్ రాజశేఖర్‌రెడ్డి ధర్మాసనం.. దీనిపై విచారణ చేపట్టి సెప్టెంబరు 28లోగా నివేదిక సమర్పించాలని హెచ్‌ఎండీఏ కమిషనర్ సర్ఫరాజ్ అహ్మద్‌కు ఆదేశాలు జారీ చేసింది. దీంతో అధికారవర్గాల్లో మల్లగుల్లాలు మొదలయ్యాయి. ఈ వ్యవహారాలను సమర్థించుకునేందుకు ప్రయత్నాలు జరుగుతున్నట్టు తెలిసింది. మరోవైపు ఈడీకి కూడా ఈ అంశంపై ఫిర్యాదులు అందాయి.
కేంద్రం కూడా..
పుప్పాలగూడ ప్రభుత్వ భూముల నిషేధిత జాబితాను 20 ఏళ్ల కాలంలో అఽధికారులు మూడుసార్లు సవరించగా 2021లో జరిగిన సవరణలపైనే అనుమానాలు రేకెత్తుతున్నాయి. 2005లో జారి చేసిన నిషేధిత జాబితాలో ఈ సర్వేనంబర్లలోని మొత్తం భూమి 101.02 ఎకరాలు ప్రభుత్వ భూమి అని పేర్కొగా 2021లో జరిగిన నిషేధిత జాబితా సవరణలో అది కాస్తా 17.30 ఎకరాలకు పరిమితమైంది. మళ్లీ 2025 జూన్‌లో చేసిన సవరణలో 64.30 ఎకరాలు ప్రభుత్వ భూమిగా పేర్కొన్నారు. 2021 సవరణ జాబితాలో సర్వేనంబరు 277లో 7.30 ఎకరాలు, సర్వేనంబరు 278లో 6 ఎకరాలు, సర్వేనంబరు 342లో 4 ఎకరాల ఫ్రభుత్వ భూములే ఉన్నట్లు చూపించారు. 2025 జూన్ నాటి జాబితాలో మాత్రం.. సర్వేనంబరు 282, 341 మినహా మిగతా సర్వేనంబర్లలో ఫ్రభుత్వ భూములు ఉన్నట్లు చూపారు. ఒక వేళ చట్ట ప్రకారమే ఈ భూములు ప్రైవేటు వ్యక్తులపరమైతే మళ్లీ 2025 జూన్‌లో ఈ భూములను మళ్లీ నిషేధిత జాబితాలో ప్రభుత్వం ఎందుకు పెట్టింది? రూ.వేల కోట్ల విలువైన ఈ భూముల వ్యవహారంపై వస్తున్న ఆరోపణలను నిగ్గుతేల్చాలంటే ఉన్నతస్థాయి దర్యాప్తు చేయాల్సిన అవసరం ఉంది. ఈ భూములు కేంద్ర హోంశాఖ పరిధిలో ఉన్న భూములు కావడంతో మొత్తం వ్యవహారంపై కేంద్రం కూడా దృష్టిసారించాల్సిన అవసరముంది.
తొలగించినపుడు కారణాలు ఉండవా?
ఏవైనా భూములను 22ఏ కింద నిషేధిత జాబితాలో పెట్టినప్పుడు.. ఎందుకు పెడుతున్నారో కారణాలు పేర్కొంటారు. వాటిని ఎవరైనా పరిశీలించుకకునే అవకాశం ఉంటుంది. కానీ ఆ జాబితాను సవరించినపుడు కారణాలు చెప్పకుండానే ఏకపక్షంగా అధికారులు కొన్ని సర్వేనంబర్లు తొలగిస్తుంటారు. దీంతో ఆకస్మాత్తుగా ఫ్రభుత్వ భూములు ఈ నిషేధిత జాబితా నుంచి మాయం అవుతున్నాయి. ఈ భూములను ప్రభుత్వం క్రమబద్ధీకరించినా, న్యాయస్థానం ఉత్తర్వుల కారణంగా తొలగించినా.. ఆ వివరాలను కూడా జాబితా సవరణ చేసేటపుడు పెట్టాలి. కానీ అలాంటిది జరగడం లేదు. రూ. వేల కోట్ల విలువైన ఫ్రభుత్వ భూముల విషయంలో ప్రభుత్వాలు జవాబుదారీతనం లేని విధంగా వ్యవహరిస్తుండడం ఆశ్యర్యం కలిగిస్తోంది.
20 ఏళ్లలో మూడుసార్లు
పుప్పాలగూడలోని ప్రభుత్వ భూములకు సంబధించి 2005 నుంచి 2025 మధ్య కాలంలో అఽధికారులు మూడుసార్లు నిషేధిత జాబితాలను సవరించారు. మొదట 06-06-2005న అప్పటి సీసీఎల్‌ఏ సర్వేనంబరు 277, 278, 280, 281, 282, 340, 341, 342లో సుమారు 101.12 ఎకరాలను 22-ఏ కింద నిషేధిత జాబితాలో పెడుతూ ఉత్తర్వులు జారీ చేశారు. అప్పటి నుంచి ఈ భూములపై క్రయ విక్రయాలు కొనసాగుతూనే ఉన్నాయి. తరువాత 29-09-2021న జిల్లా కలెక్టర్ మరోసారి జాబితాను సవరించారు. ఆ తరువాత ఇటీవల 01-06-2025న జిల్లా కలెక్టర్ మరోసారి నిషేధిత జాబితాను సవరిస్తూ స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖకు లేఖ రాశారు. ఈ మేరకు 06-06-2025న ఐజీఆర్‌ఎస్ వెబ్‌సైట్‌లో ఈ నిషేధిత జాబితాను పెట్టారు.
ఈ వార్తలు కూడా చదవండి..
సోనియా గాంధీ లక్ష్యంగా సంచలన ఆరోపణలు..
రిమాండ్ పొడిగింపు.. కోర్టు వద్ద చెవిరెడ్డి హల్‌చల్
Read latest Telangana News And Telugu News