Bhatti Vikramarka: అధిష్ఠానం మా పాలనపై పూర్తి సంతృప్తిగా ఉంది
ABN , Publish Date - Jul 12 , 2025 | 03:43 AM
తెలంగాణలో సీఎం రేవంత్‌రెడ్డి నాయకత్వంలో ప్రభుత్వ పనితీరు పట్ల కాంగ్రెస్ అధిష్ఠానం పూర్తి సంతృప్తిగా ఉందని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క చెప్పారు.
రాష్ట్రంలో సామాజిక న్యాయం, హామీల అమలును ప్రశంసించింది
ముఖ్యమంత్రి రేవంత్, నేను అవగాహనతో పనిచేస్తున్నాం
కర్ణాటక తరహాలో తెలంగాణలో‘పవర్ షేరింగ్’ ఏమీ లేదు
ఢిల్లీలో మీడియాతో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఇష్టాగోష్ఠి
న్యూఢిల్లీ, జూలై 11 (ఆంధ్రజ్యోతి): తెలంగాణలో సీఎం రేవంత్‌రెడ్డి నాయకత్వంలో ప్రభుత్వ పనితీరు పట్ల కాంగ్రెస్ అధిష్ఠానం పూర్తి సంతృప్తిగా ఉందని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క చెప్పారు. ఇటీవల పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ రాష్ట్రానికి వచ్చి సమీక్ష జరిపిన తర్వాత.. తెలంగాణలో సామాజిక న్యాయం, ప్రభుత్వ హామీల అమలు తీరును ప్రశంసించారని తెలిపారు. భట్టి శుక్రవారం ఢిల్లీలో మీడియాతో ఇష్టాగోష్ఠిగా మాట్లాడారు. తెలంగాణలో కుల సర్వే, ఎస్సీ వర్గీకరణ, సన్నబియ్యం, ఉద్యోగాల భర్తీ, ఇందిరమ్మ ఇళ్లు, రైతు రుణాల మాఫీ, రైతు భరోసా, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, మహాలక్ష్మి, గృహజ్యోతి పథకాలు విజయవంతంగా అమలు చేస్తున్నామని చెప్పారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై ప్రజలకు వాస్తవాలు తెలియజేస్తున్నామన్నారు. రాష్ట్ర ఆదాయం ప్రతినెలా రూ.16 వేల కోట్ల వరకు ఉంటుందని... సుమారు రూ.7 వేల కోట్లు పథకాలకు, రూ.5,500 కోట్లు జీతాలకు, రూ.6,300 కోట్లు అప్పులు, వడ్డీల చెల్లింపునకు ఖర్చవుతున్నాయని భట్టి చెప్పారు. ఆదాయ వనరుల సమీకరణపై దృష్టిపెట్టామని తెలిపారు. అవసరమైనప్పుడు భూములు అమ్మడంలో తప్పేమీ లేదన్నారు. గత ప్రభుత్వాధినేతలు చేసిన అక్రమాలపై చట్టపరంగా శిక్షలు ఉంటాయని, ఉపేక్షించే ప్రసక్తే లేదని పేర్కొన్నారు. కేసీఆర్ చుట్టూ దయ్యాలు ఉన్నాయని ఆయన కుమార్తె కవిత స్వయంగా అన్నారని, ప్రజల్లో బీఆర్‌ఎస్ ప్రతిష్ఠ పూర్తిగా పడిపోయిందని వ్యాఖ్యానించారు. ఏపీలో జగన్‌లా కేసీఆర్ కూడా అసెంబ్లీకి రావడం లేదని విమర్శించారు. నియోజకవర్గాల పునర్విభజన తర్వాత రాష్ట్రంలో 150కి పైగా అసెంబ్లీ స్థానాలు ఉంటాయని, కాంగ్రెస్ మళ్లీ అధికారంలోకి వచ్చి తీరుతుందని ధీమా వ్యక్తం చేశారు.
కలసికట్టుగా పనిచేస్తున్నాం..
సీఎం రేవంత్‌రెడ్డి, తాను మంచి అవగాహనతో కలసికట్టుగా పనిచేస్తున్నామని, తమ మధ్య ఎలాంటి సమస్యలూ లేవని భట్టి తెలిపారు. కర్ణాటకలో సీఎం సిద్ధ్దరామయ్య, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ మధ్య అధికారం విషయంలో నెలకొన్న స్పర్థలను మీడియా ప్రస్తావించగా.. కర్ణాటకలో లాగా తెలంగాణలో అధికారం పంచుకునే ఏర్పాటు (పవర్ షేరింగ్ అరేంజ్‌మెంట్) ఏమీ లేదని స్పష్టం చేశారు. మంత్రి పదవుల ఆకాంక్షలు ఉండటంలో తప్పేమీ లేదన్నారు. తదుపరి మంత్రివర్గ విస్తరణపై అధిష్ఠానం నిర్ణయం తీసుకోవాల్సి ఉందన్నారు.
రాంచందర్‌రావును పదవి నుంచి తొలగించాలి
హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ (హెచ్‌సీయూ) దళిత విద్యార్థి రోహిత్ వేముల ఆత్మహత్యకు కారణమైన ఎన్.రాంచందర్‌రావుకు బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవి ఇవ్వడం దారుణమని భట్టి పేర్కొన్నారు. బీజేపీ నాయకత్వం రాంచందర్‌రావును వెంటనే పదవి నుంచి తొలగించి, ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ‘‘హెచ్‌సీయూలో ఆత్మగౌరవంతో బతకడానికి కావాల్సిన హక్కులు కల్పించాలంటూ వైస్ చాన్సలర్‌కు అంబేద్కర్ స్టూడెంట్స్ అసోసియేషన్ వినతిపత్రం ఇచ్చింది. అప్పట్లో వర్సిటీ ఏబీవీపీ అధ్యక్షుడిగా ఉన్న సుశీల్‌కుమార్ దీనిని జీర్ణించుకోలేక ఆ విద్యార్థులను దేశద్రోహులుగా చిత్రీకరించారు. తర్వాత బీజేపీ నేతలు రంగంలోకి దిగారు. రోహిత్ వేముల, మరో నలుగురిపై కేసులు పెట్టాలంటూ రాంచందర్‌రావు గుండాలతో వచ్చి ధర్నాకు దిగారు. వీసీపై, అప్పటి కేంద్ర మానవ వనరుల శాఖపై ఒత్తిడి తెచ్చారు. ఈ క్రమంలో యూనివర్సిటీ అధికారులు రోహిత్ వేముల, మిగతా వారిని బయటికి పంపేశారు. అది తట్టుకోలేక రోహిత్ వేముల ఆత్మహత్య చేసుకున్నారు’’ అని భట్టి చెప్పారు. అలాంటి రాంచందర్‌రావును బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా, అప్పటి ఏబీవీపీ నేత సుశీల్‌కుమార్‌ను ఢిల్లీ యూనివర్సిటీ అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా నియమించడం బీజేపీ దళిత వ్యతిరేక వైఖరిని స్పష్టం చేస్తోందని ఆరోపించారు. దళిత వ్యతిరేకులకే బీజేపీ పదోన్నతులు, ప్రోత్సాహకాలు ఇస్తోందని విమర్శించారు. రోహిత్ వేముల ఆత్మహత్య కేసును తిరిగి తెరిచేందుకు కోర్టు అనుమతి కోరుతామని తెలిపారు. దళితులకు రాజ్యాంగం కల్పించిన రక్షణ కట్టుదిట్టంగా అమలు చేసేందుకు రోహిత్ వేముల చట్టాన్ని తీసుకొస్తామని చెప్పారు.
ఈ వార్తలు కూడా చదవండి..
భారత్ లక్ష్యంగా ఉగ్రవాద దాడులు..!
అసెంబ్లీకి కాదు.. జనాల్లోకి రావడం లేదు
For Telangana News And Telugu News