Congress: కాంగ్రెస్‌లో అంతర్మథనం.. రంగారెడ్డి శివార్లలో గట్టిపోటీ ఇచ్చిన బీఆర్‌ఎస్
ABN , Publish Date - Dec 19 , 2025 | 10:02 AM
ఇటీవల జరిగిన గ్రామపంచాయతీ ఎన్నికల్లో.. అధికార కాంగ్రెస్ పార్టీ అనుకున్నదొకటి, అయ్యిందొకటి అన్నట్లుగా జరిగిందని భావిస్తుప్పారు. రంగారెడ్డి జిల్లా పరిధిలోకి వచ్చే శివార్లలో బీఆర్‌ఎస్ పార్టీ గట్టిపోటీ ఇవ్వడంతో కాంగ్రెస్ నేతల్లో కలవరం కలిగిస్తోంది.
- రెండు నియోజకవర్గాల్లో బలపడిన కమలం
హైదరాబాద్: పంచాయతీ ఎన్నికల్లో అధికార కాంగ్రెస్(Congress) పార్టీ పైచేయి సాధించినప్పటికీ గణనీయ సంఖ్యలో సర్పంచ్ స్థానాలు కైవసం చేసుకోకపోవడం ఆ పార్టీ అధినాయకత్వానికి ఆందోళన కలిగిస్తోంది. భవిష్యత్తులో జరిగి పరిషత్, పురపాలికల ఎన్నికలపై పార్టీ నేతలు అంతర్మథనం చెందుతున్నారు. రంగారెడ్డి జిల్లాలో ఈ సారి మొత్తం స్థానాల్లో 50శాతం కూడా గెలవకపోవడం అధికార పార్టీ పల్లెల్లో ఇంకా బలహీనంగానే ఉన్నట్లు స్పష్టమవుతోంది. జిల్లాలో మొత్తం 525 సర్పంచ్ స్థానాలకు ఎన్నికలు జరగగా ఇందులో 249 సర్పంచ్ స్థానాల్లో మాత్రమే అధికార పార్టీ మద్దతుదారులు గెలుపొందారు.
అలాగే బీఆర్‌ఎస్(BRS) మద్దతుదారులు 182 చోట్ల, బీజేపీ మద్దతుదారులు 43 చోట్ల, సీపీఎం మద్దతుదారులు, ఇతరులు కలిపి 51 చోట్ల విజయం సాధించారు. అంటే అధికార కాంగ్రెస్ మద్దతుదారులు 47.42శాతం, బీఆర్‌ఎస్ మద్దతుదారులు 34.66శాతం, బీజేపీ మద్దతుదారులు 8.19శాతం, ఇతరులు 9శాతానికిపైగా సర్పంచ్ స్థానాలు గెలుపొందారు. ప్రధాన ప్రతిపక్షం బీఆర్‌ఎస్ దాదాపు అన్ని స్థానాల్లో గట్టిగానే పోటీపడింది. అయితే, జిల్లాలో కాంగ్రెస్ పార్టీకి పెద్ద దిక్కు ఎవరూ లేకపోవడం, పార్టీని ముందుండి నడిపే నాధుడు కరువవడం ఇతరులకు కలిసివచ్చింది. రాష్ట్రంలోని అన్ని జిల్లాలకు పార్టీ అధ్యక్షులను నియమించినప్పటికీ రంగారెడ్డిలో మాత్రం పెండింగ్‌లోనే పెట్టింది. దీంతో అసలు జిల్లా స్థాయిలో పార్టీని సమన్వయం చేసే వారే కరువయ్యారు.

ఎమ్మెల్యేలు కొందరు ముఖ్యనేతలు ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న గ్రామాల్లోనే కాంగ్రెస్ పాగా వేయగలిగింది. ఈ ఫలితాలతోనైనా అధికార పార్టీ మేల్కోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. శివార్లలో ప్రధాన ప్రతిపక్షం బీఆర్‌ఎస్ అనేక చోట్ల బలంగానే ఉంది. కొన్నిచోట్ల బీఆర్‌ఎస్ బలహీనపడుతున్నా ఈ ప్రాంతాల్లో కాంగ్రెస్ బలపడడం లేదు. మహేశ్వరం, ఇబ్రహీంపట్నం నియోజకవర్గాల పరిధిలో బీజేపీ బలపడింది. ప్యూచర్ సిటీ ప్రాంతంలోని 74 గ్రామ పంచాయతీల పరిధిలో 29 చోట్ల కాంగ్రెస్ మద్దతుదారులు విజయం సాధించారు. ప్రధాన ప్రతిపక్షమైన బీఆర్‌ఎ్‌సకు 22 స్థానాలు, బీజేపీకి 18 స్థానాలు, ఇండిపెండెంట్లకు 5 సర్పంచ్ స్థానాలు దక్కాయి. ఇక్కడ అధికార పార్టీకి బీఆర్‌ఎస్, బీజేపీ గట్టి పోటీనే ఇచ్చాయి.
ఈ వార్తలు కూడా చదవండి..
కవితనే కాదు ఎవరైనా సీఎం కావొచ్చు
Read Latest Telangana News and National News